రేపటి నుంచి నారసింహుడి దర్శనం

- తొలిరోజు స్థానికులు, ఆలయ ఉద్యోగులకే
- 9 నుంచి ఇతర భక్తులకు అనుమతి
- తీర్థ, ప్రసాదాలు ఉండవు..ప్రసాద విక్రయాలు యథాతథం
- తలనీలాల సమర్పణకు నో..
- ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకే దర్శనం
- సమీక్షలో కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీత వెల్లడి
యాదాద్రి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. యాదాద్రి ఆలయంలో భక్తులకు అనుమతి అంశంపై శనివారం డీసీపీ కె. నారాయణరెడ్డి, ఆలయ ఈవో ఎన్.గీత, అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డిలతో కలిసి యాదాద్రి దేవాలయ ప్రాంగణంలోని అతిథిగృహంలో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ నెల 8న స్థానికులు, ఆలయ ఉద్యోగులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. 9 నుంచి భక్తులకు అనుమతి ఉందని చెప్పారు. భక్తులంతా భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు విధిగా మాస్కులు ధరించి దర్శనాలకు రావాలని సూచించారు. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. యాదాద్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌వార్డు, ఫీవర్ వార్డులను ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారి సాంబశివరావును ఆమె ఆదేశించారు. శఠారి, తీర్థ ప్రసాదాలు లేకుండా స్వామి వారిని దర్శించుకుని దండం సమర్పించుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లడ్డూ ప్రసాదాలు కూడా కవర్లలో విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గరిమాఅగర్వాల్, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, తహసీల్దార్ అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రజిత, యాదాద్రి ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
దర్శనాలకు విధి విధానాలు ఖరారు
యాదాద్రిలో మొదటి రోజు స్థానిక భక్తులు, విశ్రాంత ఉద్యోగులు, ఆలయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు దర్శనాలు ఉంటాయని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. దేవస్థానం ఏఈవోలు, సూపరింటెండెంట్లతో ఆమె సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మొదటిరోజు స్థానిక భక్తులు విధిగా ఆధార్‌కార్డు తీసుకుని దర్శనానికి రావాలని, లేనట్లయితే దర్శనాలకు అనుమతించమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించి రావాలని కోరారు.
దేశం నులుమూలల నుంచి వచ్చే ఇతర భక్తులకు ఈ నెల 9 నుంచి దర్శనాలు అనుమతిస్తున్నట్లు చెప్పారు. అందరికీ ఉచిత లఘు దర్శనాలు ఉంటాయన్నారు. ఆన్లైన్లో పూజా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు వారి గోత్రనామాలతో పూజలు చేస్తారని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శానిటైజర్, లేదా సోప్‌వాటర్‌తో మాత్రమే చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. యాదాద్రికొండపైన తలనీలాలు సమర్పించుకోవాలనుకునే భక్తులు మరికొంత కాలం ఆగాల్సిందేనన్నారు. భక్తులకు గతంలో కోరినన్ని ప్రసాదాలు ఇచ్చేవారమని, ఇప్పుడు పరిస్థితిని బట్టి విక్రయాలు జరుగుతాయని తెలిపారు. కొండపైకి ఆర్టీసీ బస్సులు, ద్విచక్రవాహనాలు, పరిమిత సంఖ్యలో ఆటోలను అనుమతిస్తామని చెప్పారు. ఆటోలో ఇద్దరు భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులకు కొండపైకి అనుమతి లేదన్నారు. వీఐపీలకు ఉదయం పది గంటల నుంచి 11 గంటల మధ్య బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. ఆలయ ఏఈవో దోర్బల భాస్కరశర్మ,చంద్రశేఖర్, మేడి శివకుమార్, పర్యవేక్షకులు రాజన్‌బాబు, రమేశ్‌బాబు, వేముల వెంకటేశ్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం