ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 05, 2020 , 23:03:30

బయోగ్రీన్‌ పారిశ్రామిక పార్క్‌కు గ్రీన్‌సిగ్నల్‌

బయోగ్రీన్‌ పారిశ్రామిక పార్క్‌కు గ్రీన్‌సిగ్నల్‌

  • దాతరుపల్లిలో 104 ఎకరాలలో నిర్మాణం 
  • త్వరలో మంత్రి కేటీఆర్‌తో శంకుస్థాపన
  • భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం 
  •  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆలేరు/భువనగిరి : ఒకవైపు యాదాద్రి ఆలయం.. మరోవైపు బస్వాపూర్‌ జలాశయం.. మధ్యలో ఉన్న దాతరుపల్లి గ్రామంలో బయోగ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలోని దాతారుపల్లిలో సర్వే నంబర్‌ 294లో 104 ఎకరాలలో నిర్మించేబోయే బయోగ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌కు కావాల్సిన స్థలాన్ని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి ఆమె పరిశీలించారు. అంతకు ముందు కలెక్టర్‌ కార్యాలయంలోనూ ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు. పార్క్‌ నిర్మాణ నమూనాను పరిశీలించి, కావాల్సిన సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో కాలుష్య రహిత పరిశ్రమలను నిర్మిస్తామని తెలిపారు. త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి, పర్యాటక కేంద్రంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు తోడు గా పరిశ్రమల పార్క్‌ నిర్మాణంతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌ నిర్మాణానికి కావాల్సిన అనుమతులను టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఇవ్వాలని కోరారు. పార్క్‌ విస్తరణకు అవసరమైతే మరింత స్థలాన్ని సేకరిస్తామని తెలిపారు. పార్క్‌ ఏర్పాటుకు సహకరించిన రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్‌ రమేశ్‌, ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, జోనల్‌ మేనేజర్‌ శారద, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, జడ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకుల సుధాహేమేందర్‌గౌడ్‌, సర్పంచ్‌ బైరగాని చిన్నపుల్లయ్యగౌడ్‌, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కాటంరాజు, కౌన్సిలర్‌ తాళ్లపల్లి నాగరాజు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ మిట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ విప్‌ కృషి అభినందనీయం

  • టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు

ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాల కోసం మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి మరీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు అన్నారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌కు కావాల్సిన సదుపాయాలు దాతారుపల్లిలో ఉన్నాయని, పార్క్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో బయో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను నిర్మించి కాలుష్యరహిత పరిశ్రమలు నిర్మిస్తామని తెలిపారు. బస్వాపూర్‌ జలాశయం, ఇండస్ట్రియల్‌ పార్క్‌లో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామన్నారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలనుగుణంగానే  ఇక్కడి నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. నేడో రేపో ప్రత్యేక సర్వే టీం ద్వారా ఇండస్ట్రియల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ అనుమతితో త్వరలో మంత్రి కేటీఆర్‌తో కలిసి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 

VIDEOS

logo