బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jun 04, 2020 , 23:41:11

ధర్మ దర్శనాలకు మాత్రమే పరిమితం

ధర్మ దర్శనాలకు మాత్రమే పరిమితం

  • యాదాద్రిలో చురుగ్గా  సాగుతున్న ఏర్పాట్లు 
  • 8 నుంచి భక్తులకు అనుమతి 
  • క్యూలైన్లలో మాస్కులు, భౌతిక దూరం  తప్పనిసరి  
  • దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసిన ఈవో గీత 

యాదాద్రి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోనే ప్రసిద్ధ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దర్శనాల కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఈ నెల 8 నుంచి అన్ని ప్రార్థనా మందిరాలు ప్రారంభమవుతుండటంతో యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయానికి భక్తులు పోటెత్తె అవకాశం ఉన్నది. దీంతో ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.

మొదటి రోజు నుంచే అర్జిత పూజలు కూడా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి శ్రీవారి దర్శనాలు నిలిచిపోవడంతో భక్తులు 78 రోజులుగా తమ ఇష్టదైవాన్ని దర్శించుకునే అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఆలయం తెరుచుకోనుండటంతో దర్శనం కోసం భక్తులు క్యూ కట్టనున్నారు. కొండపైన ధర్మ దర్శనాల క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ భక్తులు నిలబడేందుకు బాక్సులను గీశారు. ఇప్పటికే రెండు మూడు సార్లు వివిధ శాఖల అధికారులతో ఆలయ ఈవో ఎన్‌.గీత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనా లు సులువుగా కల్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అర్జిత దర్శనాలు లేకుండా కేవలం ధర్మ దర్శనాలకే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతానికి రూ.50, 150 టికెట్‌ దర్శనాలు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు. 

మాస్కులు ధరించి రావాలి..

యాదాద్రికి వచ్చే ప్రతి భక్తుడు విధిగా మాస్కులు ధరించి రావాలని ఆలయ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. శానిటైజర్లు కూడా వెంట తెచ్చుకోవచ్చని చెప్పారు. గర్భాలయంలోకి అనుమతి లేకుండా లఘు దర్శనం మాత్రమే ఉంటుందని ఆలయ ఏఈవో మేడి శివకుమార్‌ తెలిపారు. బాలాలయంలోనికి భక్తులు వెళ్లి భయటకు వచ్చే సమయంలో ఒకరికొకరు ఎదురుపడి తాకే అవకాశం ఉన్నందున బాలాలయంలోని ద్వారం వద్ద నుంచే శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 

దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసిన ఈవో గీత..

కరోనా నేపథ్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తీసుకుంటున్న సౌకర్యాలపై దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఆలయ ఈవో గీత చర్చించారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపా ట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె కమిషనర్‌కు వివరించారు. ఇప్పటికే తాము వివిధ శాఖల అ ధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. కొండ కింద నుంచి భక్తులు కాలినడకన కొండపైకి రావడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నిర్ణీత బాక్సులను కూడా కొండ కింది నుంచి కొండపై వరకు గీసి భక్తులు అవి దాటి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌తో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రా లేదని ఈలోగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో మీడియాకు వివరించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణ యం మేరకు దర్శనాల ప్రక్రియ ఉంటుందన్నారు.

VIDEOS

logo