సోమవారం 06 జూలై 2020
Yadadri - Jun 04, 2020 , 00:08:50

కంటోన్మెంట్‌ జోన్‌గా విద్యానగర్‌

కంటోన్మెంట్‌ జోన్‌గా విద్యానగర్‌

  • విద్యానగర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
  • కాలనీలోకి రాకపోకలు బంద్‌ 
  • కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌, సిబ్బందికి హోం క్వారంటైన్‌ 

చౌటుప్పల్‌ : మున్సిపాలిటీ కేంద్రంలోని విద్యానగర్‌ కాలనీని కంటోన్మెంట్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. కాలనీకి చెందిన కూరగాయల వ్యాపారికి ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్య, పోలీసు అధికారులు అలర్టయ్యారు. విద్యానగర్‌ కాలనీ, మార్కండేయ నగర్‌లోని కూరగాయల వ్యాపారి ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లను బుధవారం జల్లడపట్టారు. కాలనీల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. కరోనా నిర్ధారణ కాకముందు వ్యాపారి సిద్ధార్థ నర్సింగ్‌ హోంలో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో 14రోజుల పాటు మూసివేయాలని నిర్వాహకుడికి సూచించారు.

నర్సింగ్‌ హోం ఆవరణలో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. వ్యాపారికి పరీక్షలు చేసిన డాక్టర్‌, మెడికల్‌ షాపు నిర్వాహకుడు, రక్త నమూనాలు సేకరించిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వ్యాపారిని చికిత్స కోసం కారులో హైదరాబాద్‌ తీసుకెళ్లిన డ్రైవర్‌ను సైతం హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇంకా అతను ఎంత మందిని కలిశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు అతను కలిసిన వారందరి డేటా తీసుకున్నారు. ఇతర గ్రామాల్లోని ఏఏ షాపులకు కూరగాయలు సైప్లె చేశాడో వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. లింగోజీగూడెంలోని ఓ షాపునకు కూరగాయలు సైప్లె చేయడంతో ఆ షాపును మూసివేయించారు. షాపు నిర్వాహకుడితో పాటు కుంటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. ఇప్పటికే అతని కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు కరోనా టెస్టులు కూడా చేశారు. విద్యానగర్‌, మార్కండేయ నగర్‌లోకి ఎవరూ రాకుండా, పోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

20 మందికి హోం క్వారంటైన్‌..

వలిగొండ : కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం మండల వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. బుధవారం మండల వ్యాప్తంగా 20 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌ పట్టణంలోని కూరగాయల వ్యాపారికి ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో అతను వలిగొండ పట్టణంలోని ఓ కూరగాయల వ్యాపారికి హోల్‌సెల్‌గా కూరగాయలు సైప్లె చేసేవాడని తెలుసుకున్న అధికారులు అతని కుటుంబంలోని 8 మందికి పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌లో ఉంచారు. అదేవిధంగా మండలంలోని దుప్పెల్లిలో ఐదుగురు, వేములకొండలో నలుగురు, మాందాపురంలో ముగురిని హోం క్వారంటైన్‌   చేసినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారులు సుమలత, జ్యోతి, ఆరోగ్య పర్యవేక్షకులు నర్సింహ, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొల్లూరులో మహిళకు కరోనా..

ఆలేరు రూరల్‌ : మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బుధవారం అధికారులు తెలిపారు. శారాజీపేట పీహెచ్‌సీ వైద్యాధికారి జ్యోతిబాయి తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మహిళ వారం రోజుల కిందట మండల కేంద్రంలోని సాయిగూడెంలో జరిగిన వివాహానికి వెళ్లింది. అనంతరం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను సికిందరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. వెంటనే పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ దవాఖానకు రెఫర్‌ చేయగా అక్కడ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను అక్కడే ఉంచి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న మండల వైద్య సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురిని బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. 

గ్రామంలో పారిశుధ్య పనులు..

గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు నిర్వహించారు. ఇందులో భాగంగా వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్సై రమేశ్‌ సందర్శించి కరోనాపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.


logo