గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 03, 2020 , 01:26:51

కనుల పండువగా లక్ష పుష్పార్చన

కనుల పండువగా లక్ష పుష్పార్చన

  •  నిత్యపూజల కోలాహలం 
  • వైభవంగా కల్యాణతంతు 
  • ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం 

యాదాద్రి, నమస్తే తెలంగాణ:  యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి మంగళవారం లక్ష పుష్పార్చనను కనుల పండువగా నిర్వహించారు. ఏకాదశి కావడంతో శ్రీవారికి లక్షపుష్పాలతో కొలుస్తూ అపురూపంగా పూజాకైంకర్యాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు  కాండూరి వెంకటాచార్యులు, బట్టర్‌ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం శ్రీలక్ష్మీనరసింహుడికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. లక్ష పుష్పాలతో శ్రీవారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన చేయడం ఆనవాయితి. నిత్య పూజలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారు జాము నాలుగు గంటల నుంచి నిత్యపూజల కోలాహలం మొదలైంది. రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవం జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నర పాటు కల్యాణ తంతును జరిపారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన శ్రీస్వామి అమ్మవార్లకు హారతి నివేదన జరిపారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వహించారు. మహామండపంలో అష్టోత్తరం, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. శివ సన్నిధిలో మహాశివుడిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చన చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. 

గవర్నర్‌కు యాదాద్రి అర్చకుల ఆశీర్వచనం..

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆశీర్వాదాన్ని  అర్చకులు అందించారు. యాదాద్రి నుంచి రాజ్‌భవన్‌కు ప్రధానార్చకుడు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకుడు బట్టర్‌ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలో వెళ్లిన అర్చక బృందం ఆశీర్వచనం జరిపారు. శ్రీవారి శేషవస్ర్తాన్ని కప్పి ఆశీస్సులు అందించారు. శ్రీవారి ప్రసాదాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఏఈవో మేడి శివకుమార్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo