మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jun 03, 2020 , 01:22:01

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ జిల్లా కేంద్రంలో ఆవిర్భావ వేడుకలు

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ జిల్లా  కేంద్రంలో ఆవిర్భావ వేడుకలు

  • అభివృద్ధి, సంక్షేమంలోతెలంగాణ నెంబర్‌-1
  • తెలంగాణ ప్రజల కరెంటు కష్టాలు తీరాయి 
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
  • అభివృద్ధికి అందరి సహకారం అవసరం 
  • సాగునీటి ప్రాజెక్టులతో రైతుల వెతలు తీరుతాయి
  • ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌-1గా నిలిచిందని  ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ భువనగిరిలోని కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆమె నిరాడంబరంగా జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు పట్టణంలోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఆరు వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. ఆరేండ్ల కేసీఆర్‌ పాలనలో సాధించింది ఎంతో ఉన్నా.. ఇంకా సాధించాల్సింది ఉందన్నారు. తెలంగాణ ప్రజల కరెంటు కష్టాలు తీరాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో జిల్లాలోని రైతుల కష్టాలు తీరుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని గుర్తుచేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెం.1గా నిలిచిందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఆవిర్భావ వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో హంగు ఆర్భాటాలు లేకుండా అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి.

 అంతకు ముందు పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆరు వసంతాలు పూర్తి చేసుకున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ ఆరేండ్ల పాలనలో సాధించింది ఎంతో ఉన్నా.. ఇంకా సాధించాల్సింది కూడా ఉన్నదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్ర ప్రజలకు కరెంటు కష్టాలు తీరాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి అనేక పథకాలు అమలు చేసిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో జిల్లాలో రైతుల కష్టాలు తీరనున్నాయన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్‌ అంతే పట్టుదలతో బంగారు తెలంగాణ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాదని అపహాస్యాలు చేసినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ సాధించుకొని నేడు సంబురంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఎందరో త్యాగధనుల స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అమరేందర్‌గౌడ్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌, జడ్పీటీసీ మల్లయ్య, ఎంపీపీ నిర్మల, అదనపు కలెక్టర్‌ జి.రమేశ్‌, కీమ్యానాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి..

ప్రతి పక్షాలు చేసే విమర్శలు సద్విమర్శలుగా ఉండి అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనతికాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులు కనుమరుగయ్యే పరిస్థితులు గతంలో ఉండగా.. ఆరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రైతుల అప్పులు తీరి బాగుపడే స్థితికి వచ్చారన్నారు. త్వరలోనే జిల్లాకు కాళేశ్వర జలాలు రానుండటంతో 60 ఏండ్ల కరువు దూరం కానున్నదన్నారు.  జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, శాసన మండలి సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌  మాట్లాడుతూ.. సాగునీటికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని వారు ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్‌తోనే యాదాద్రి ఆలయ అభివృద్ధి

యాదాద్రి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధాన కార్యాలయం వద్ద ఆలయ ఈవో గీత పతకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతోనే యాదాద్రి ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. మరి కొద్ది నెలల్లోనే ఆలయ నిర్మాణం పనులు పూర్తి కానున్నాయన్నారు. అదేవిధంగా తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ తదితర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఎదుట పలువురు నాయకులు, అధికారులు పతకావిష్కరణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఏఈవోలు భాస్కర్‌, శివకుమార్‌, ప్రధానార్చకుడు కారంపూడి నర్సింహచార్యులు, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి జయకృష్ణ, ఎంపీడీవో వినోద్‌రెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, జడ్పీటీసీ అనురాధ, ఎంపీపీ శ్రీశైలం, ఎంపీటీసీలు వీరయ్య, ఆర్టీసీ గుట్ట డీఎం రఘు, సీఐ పాండురంగారెడ్డి, ఏఎస్సై విజయభాస్కర్‌, మండల అధ్యక్షుడు వెంకటయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, ఏడీఏ పద్మావతి, ఏవో రాజేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

అమరులకు ఘన నివాళి..

రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా యాదగిరిగుట్టలోని అమరవీరుల స్తూపం వద్ద టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో జడ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధ, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు, కౌన్సిలర్‌ నాగరాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాజు, నాయకులు బాలయ్య, నర్సింహ, పవన్‌కుమార్‌, బాలరాజు, రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

VIDEOS

logo