శనివారం 11 జూలై 2020
Yadadri - Jun 02, 2020 , 00:18:06

8 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనం

8 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనం

  • అధికారుల కసరత్తు షురూ  
  • వైరస్‌ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు 
  • నిరంతరం క్యూలైన్లు శానిటైజేషన్‌ 
  • ఐదుగురి చొప్పున ఆలయంలోకి ప్రవేశం 

యాదాద్రి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సడలింపుతో ఈనెల 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవచ్చని కేంద్రం నిర్ణయించడంతో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో రెండునెలలుగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసి ఏకాంత సేవలు నిర్వహిస్తున్నారు. భక్తులకు దర్శనం కల్పించేందుకు  తీసుకోవాల్సిన చర్యలపై ఆయా విభాగాల అధికారులతో ఈవో గీత చర్చించారు. క్యూలైన్లు శుభ్రపర్చడం...రక్షణపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది ఎలా వ్యవహరించాలనే విషయం చర్చకు వచ్చింది. 

క్యూలైన్లు శానిటైజేషన్‌ ...

క్యూలైన్లు శానిటైజేషన్‌ చేయించాలని నిర్ణయించారు. సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పదేపదే పిచికారీ చేయడం కోసం నిల్వచేసి ఉంచాలని శానిటైజేషన్‌ విభాగం పర్యవేక్షకుడికి ఈవో ఆదేశాలు జారీచేశారు. భక్తులు క్యూలైన్‌లో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం చేసుకుని బయటకు వెళ్లే వరకు భౌతిక దూరం పాటించేలా సూచనలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు.  

ఐదుగురు చొప్పున ఆలయంలోకి ..

ఒకేసారి కాకుండాఐదుగురి చొప్పున ఆలయంలోకి ప్రవేశించి దర్శనం కల్పించే విషయంపై చర్చ లు జరుగుతున్నాయి. బాలాలయంలో ఐదుగురు దర్శనం చేసుకున్న తర్వాత మరో ఐదుగురు లోపలికి పంపించే ప్రతిపాదన వచ్చింది. 

కేవలం దర్శనాలకు ఏర్పాట్లు 

శ్రీవారి నిత్య కల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణస్వామివారి వ్రత పూజలు నిర్వహించే భక్తులు మరికొంత కాలం ఆన్‌లైన్‌లో జరిపించుకునే అవకాశం ఉంది. దేవాదాయశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో కేవలం దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్జిత పూజలు   ప్రారంభమైన తర్వాత  అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.  


logo