బుధవారం 03 మార్చి 2021
Yadadri - May 30, 2020 , 23:09:43

కొవిడ్‌ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించాలి

కొవిడ్‌ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించాలి

  • పరీక్షకు మాస్క్‌ తప్పనిసరి 
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే లోపలికి అనుమతి 
  • బెంచీకి ఒక్క విద్యార్థే ఉండాలి 
  • అధికారులకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశం 

భువనగిరి : లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, పోలీసులు, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్యం, విద్యుత్‌, మున్సిపల్‌, పంచాయతీ శాఖల అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 10,066 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు.  ఇప్పటికే తెలుగు సబ్జెక్ట్‌ రెండు పేపర్లు, హిందీ ఒక పేపరు పరీక్షలు పూర్తయినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి పేపరుకు మధ్య రెండు రోజుల వ్యవధి ఇస్తూ జూన్‌ 8 నుంచి మిగిలిన  పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న 49 పరీక్ష  కేంద్రాలను 98 పరీక్ష కేంద్రాలకు పెంచామన్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. బెంచీకి ఒకరు చొప్పున ఒక గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలన్నారు. ప్రతి రోజు పరీక్ష పూర్తయిన వెంటనే సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని గదుల్లో పిచికారీ చేసేలా మున్సిపల్‌, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేపట్టిన తర్వాతే విద్యార్థులను కేంద్రంలోకి పంపించాలని వైద్య, ఆరోగ్య శాఖల అధికారులను కోరారు. దగ్గు, జలుబు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు బందోబస్తుతో పాటు, నిరంతర విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌, డీఈవో చైతన్యజైనీ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo