ఆదివారం 07 మార్చి 2021
Yadadri - May 29, 2020 , 23:32:07

వ్యవసాయంలో నవశకం

వ్యవసాయంలో నవశకం

మోత్కూరు : నియంత్రిత సాగు విధానాన్ని అవలంభించడంతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో నియంత్రిత సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తన ఆలోచన విధానంతో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చేస్తున్నారన్నారు. ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సమగ్ర వ్యవసాయ పంట సాగు విధానాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పంట పెట్టుబడి, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతు తాను పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకునేలా అన్ని గ్రామాల్లో మార్కెట్‌ వసతి కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. అంతకు ముందు అధికారులు మండలంలోని దాచారం, పనకబండ గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ సోంమల్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కంచర్ల అశోక్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి యాదయ్య, ఏవో స్వప్న, ఏఈవో సైదులు, అశోక్‌, గోపీనాథ్‌, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం సూచించిన పంటలు వేయాలి..

భువనగిరి : రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేసి అధిక లాభాలు పొంది ఆర్థికంగా ఎదుగాలని జిల్లా పరిషత్‌ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. నియంత్రిత సాగు వ్యవసాయంపై మండలంలోని వీరవెల్లి గ్రామంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు వరిలో సన్నరకాలు సాగు చేయడంతో పాటు, కూరగాయలు, పప్పుదినుసుల సాగు చేపట్టాలన్నారు. రైతులు పండించుకున్న పంటలకు సొంతంగా ధర నిర్ణయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి నియంత్రిత వ్యవసాయ సాగుకు సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ కంచి మల్లయ్య, మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ తంగెళ్లపల్లి కల్పనాశ్రీనివాసాచారి, ఎంపీటీసీ లలిత, రైతులు పాల్గొన్నారు.

నియంత్రిత సాగు విధానంతో అధిక లాభాలు..

చౌటుప్పల్‌ రూరల్‌ : నియంత్రిత సాగువిధానంతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏవో) అనురాధ అన్నారు. మండలంలోని దండు మల్కాపురం, జైకేసారం గ్రామాల్లో నియంత్రిత సాగు విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. రైతులు ఒకే రకం పంటలు కాకుండా డిమాండ్‌కు తగ్గ పంటలు పండించాలన్నారు. వరిలో 60 శాతం సన్నరకాలు, 40 శాతం దొడ్డు రకాలు వేయాలన్నారు. నీటి వసతులు అధికంగా ఉంటే పత్తి, కందులు వేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్న స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంతప్రదించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, రైతు అవగాహన సదస్సు ఇన్‌చార్జి లక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి రిషిత, ఏవో ముత్యాల నాగరాజు పాల్గొన్నారు.

నూతన సాగు విధానాలు అలవర్చుకోవాలి..

రామన్నపేట : రైతులు నూతన పంట సాగు విధానాలను అలవర్చుకోవాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి బి.సౌమ్య తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నియంత్రిత పంటల సాగు విధానంపై రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇంద్రపాలనగరంలో జిల్లా ఉద్యానవనశాఖ అధికారి పాల్గొని మాట్లాడుతూ.. రైతులు వరిలో సన్నరకం ధాన్యాన్ని 60శాతం, దొడ్డురకం 40 శాతం వేసుకోవాలని తెలిపారు. పత్తి, కంది సాగుచేసే రైతులకు ఎలాంటి నియంత్రణ లేదని తెలిపారు. కార్యక్రమాల్లో ఏవో యాదగిరిరావు, విస్తరణాధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, రైతు బంధు సమితి సభ్యులు పాల్గొన్నారు. 

VIDEOS

logo