కొండంత సంబురం

- నేడు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం
- సిద్ధించనున్న సీఎం కేసీఆర్ స్వప్నం
- కొండపోచమ్మ నుంచి జిల్లాకు గోదావరి పరవళ్లు
- బొమ్మలరామా రం, తుర్కపల్లి, బీబీనగర్ మండలాలకు పుష్కలంగా నీళ్లు
- సాగులోకి రానున్న 13,254.06 ఎకరాలు
- జలకళ సంతరించు కోనున్న 77 చెరువులు
- భారీగా పెరగనున్న భూగర్భజలాలు
- ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి
- జిల్లాలో 336.27 ఎకరాల భూసేకరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమవుతున్నది..వలసలు ఆపి, బీడుభూములకు నీళ్లివ్వాలన్న సంకల్పం సిద్ధించబోతున్నది..సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష..రేయింబవళ్లు కార్మికుల కష్టం..ఇంజినీర్ల కృషితో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పూర్తయిన కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి శుక్రవారం ప్రాజెక్టును ప్రారంభించి జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు. కొండపోచమ్మ నుంచి బొమ్మలరామారం కాల్వ ద్వారా జిల్లాకు గోదావరి జలాలు ప్రవేశించనున్నాయి. ప్రధానంగా బొమ్మలరామారం, తుర్కపల్లి, బీబీనగర్ మండలాల్లోని 77 చెరువులను నింపనున్నారు. వీటికింద 13,254.06 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుంది. ప్రతి ఎకరానికి నీళ్లందించేలా పక్కా ప్రణాళికతో జిల్లాలో భూసేకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మూడు మండలాల్లో 336 ఎకరాలను సేకరిస్తున్నారు. ఈ మూడు మండలాల్లో వ్యవసాయం అనుకున్నంత లేకపోవడంతో చాలామంది ఉపాధి కోసం వలస వెళ్లారు. నీళ్లొస్తే వలసలు వాపస్ వచ్చి పుష్కలంగా పంటలు పండించుకునే అవకాశం ఉండనుంది. గోదావరి రాకతో భూగర్భజలాలు భారీగా పెరగడంతోపాటు ప్రత్యక్షంగా,పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి లభించనుంది.
యాదగిరిగుట్ట : రైతును రాజుగా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రధానంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిపెట్టడంతో రైతుల సాగునీటి కల నెరవేరుతున్నది. బాహుబలి ప్రాజెక్టు కాళేశ్వరం జలాశయం 14వ ప్యాకేజీలో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ జలాశయంతో ప్రధానంగా సిద్దిపేట, మేడ్చల్, సంగారెడ్డితోపాటు యాదాద్రిభువనగిరి జిల్లాకు సాగునీరు అందనున్నది.
జిల్లాలో 13,254.06 ఎకరాలకు..
కొండపోచమ్మ నుంచి బొమ్మలరామారం కాల్వ ద్వారా జిల్లాలో 13,254.06 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. బొమ్మలరామారంలో 6,958 ఎకరాలు, తుర్కపల్లి 4019.24 ఎకరాలు, బీబీనగర్ 2276.82 ఎకరాలు సాగులోకి రానున్నది. ఇందులో భాగంగా బొమ్మలరామారం మండలంలో 36 చెరువులు, తుర్కపల్లిలో 40, బీబీనగర్‌లో ఒక చెరువును కలుపుకొని మొత్తం 77 చెరువులను నింపనున్నారు. దీంతో జిల్లాకు సమృద్ధిగా సాగునీరు అందనున్నది.
యాదాద్రికి ఇలా..
కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రధాన కాల్వ 5 కిలోమీటర్లు ప్రవహించి మర్కుక్ పంపుహౌస్‌కు నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రారంభమయ్యే బొమ్మలరామారం కాల్వ నుంచి నీరు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లి, మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి, హలియాబాద్ గుండా శామీర్‌పేట చెరువులోకి 0.5 టీఎంసీ నీరు చేరుతుంది. అక్కడి నుంచి 18 కిలోమీటర్లు ప్రవహించి ఉద్దమర్రి నుంచి యాదాద్రిభువనగిరి జిల్లాలోని బండకాడిపల్లి వద్ద శామీరుపేట వాగులోకి నీరు చేరుతుంది. అటు నుంచి బొమ్మలరామారం మండలం బండకాడిపల్లి, ప్యారారం, చీకటిమామిడి, మర్యాల, హాజీపూర్, మాసాన్‌పల్లి, భువనగిరి మండలం వడపర్తి కత్వ వద్దకు చేరుకొని తిరిగి బొమ్మలరామారంలోని మేడిపల్లి, ఫకీర్‌గూడెం నుంచి బీబీనగర్ చెరువుకు చేరి రుద్రవెల్లిలోని మూసీలో కలుస్తుంది.
జిల్లాలో 336.27 ఎకరాల భూ సేకరణ..
కొండపోచమ్మ జలాశయానికి సంబంధించి బొమ్మలరామారం కాల్వ నిర్మాణం కోసం భూ సేకరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇందులో బొమ్మలరామారం మండలం రామలింగంపల్లిలో 35.12 ఎకరాలు, రంగాపూర్‌లో 21, బొమ్మలరామారం 35.14, మల్యాలలో 7.29, మాసిరెడ్డిపల్లిలో 17.32, హాజీపూర్‌లో 4.06, మర్యాల 20.28 ఎకరాల భూ సేకరణ కొనసాగుతుందని తెలిపారు. అన్ని మండలాల్లో కలిపి మొత్తంగా 336.27 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
సాగునీరు అందించడమే లక్ష్యం..
కొండపోచమ్మ జలాశయం నుంచి శామీర్‌పేట వాగు ద్వారా జిల్లాలో 77 చెరువులు నింపనున్నాం. దీంతో 13,254.06 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. శామీర్‌పేట వాగు నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు చైన్ ఆఫ్ ట్యాంకుల మ్యాప్‌లను అధికారులు సిద్ధం చేశారు. రైతులకు సరిపడా సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
నీరుంటే బంగారం పండిస్తాం..
నాకు వీరారెడ్డిపల్లిలో 10 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఇన్నాళ్లు నీరు లేక మొత్తం భూమిని సాగుకు చేయలేకపోయాం. సీఎం కేసీఆర్ సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా మా గ్రామానికి సాగునీరు రానుండటం సంతోషంగా ఉంది. సరిపడా నీరు ఉంటే భూమిలో బంగారం పండిస్తాం.
-బిట్ల లక్ష్మీనరసింహారెడ్డి, వీరారెడ్డిపల్లి, తుర్కపల్లి
కొండపోచమ్మ నీళ్లు వస్తాయని ఊహించలె
సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. కొండపోచమ్మ నీళ్లు వస్తాయని ఊహించలేదు. సీఎం కేసీఆర్ సార్ రైతు పక్షపాతిగా సాగునీటి అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మిస్తున్నారు త్వరగా మా గ్రామానికి నీళ్లు వస్తాయని ఆశిస్తున్నాం.
-తోట వెంకటేశం, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్, మర్యాల, బొమ్మలరామారం
తాజావార్తలు
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్‌లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్‌కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
- కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
- మోదీకి టీకా ఇచ్చిన నర్సు ఏమన్నారంటే..