సోమవారం 08 మార్చి 2021
Yadadri - May 26, 2020 , 00:28:47

కాకతీయ కళానైపుణ్యంతో యాదాద్రి పునర్నిర్మాణం

కాకతీయ కళానైపుణ్యంతో యాదాద్రి పునర్నిర్మాణం

  • రిటైర్డ్‌ ఐఏఎస్‌ రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి
  • ఆలయ విస్తరణ పనుల పరిశీలన 

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నదని రిటైర్డ్‌ ఐఏఎస్‌ రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి అన్నారు. ఆలయ విస్తరణ పనులను సోమవారం వారు పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడి, అష్టభుజి మంటపం, ఆళ్వార్ల విగ్రహాలు, సప్త రాజగోపురం, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, విష్ణు పుష్కరిణి, సత్యనారాయణ వ్రత మంటపంతో పాటు టెంపుల్‌ సిటీ, గండిచెరువు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌, ఇతర అనుబంధ ఆలయాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయుల కళానైపుణ్యంతో దక్షిణాదిలోనే ఎక్కడా లేనివిధంగా గోపురాలను కృష్ణశిలలతో తీర్చిదిద్దారన్నారు. శిల్ప కళావైభవాన్ని భవిష్యత్‌ తరాలకు తెలియజెప్పేలా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 

హైదరాబాద్‌ నగరానికి చేరువలో యాదరుషి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ తనదైన ముద్రతో తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎక్కడా లేనివిధంగా పూర్తిస్థాయిలో కృష్ణశిలలతో ప్రధానాలయం నిర్మితమవుతుందని తెలిపారు. భక్తులు, పర్యాటకుల మనసు దోచేలా ఆలయ విస్తరణ పనులు సాగుతున్నాయన్నారు. గర్భాలయం ముఖద్వారంపై పంచలోహంతో తయారు చేసిన హిరణ్యాక్షుడి రాజ్యసభ, ప్రహ్లాదుడి చరిత్ర తెలుపుతూ ఏర్పాటు చేసిన 10 ప్యానళ్లు ఎంతో ఆకర్షిణీయంగా ఉన్నాయన్నారు.

మొదటి ప్రాకారంలో తూర్పు వైపున త్రితల రాజగోపురం, పడమర దిశలో ఐదంతస్తుల గోపురం, రెండో ప్రాకారానికి పశ్చిమాన ఏడంతస్తుల మహా రాజగోపురం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదంతస్తుల రాజగోపురాల కట్టడాలు అబ్బురపరుస్తున్నాయన్నారు. ప్రధానాలయం చుట్టు నిర్మితమవుతున్న వలయదారులు, సుంగధ ద్రవ్యాలు వెదజల్లే విధంగా మొక్కల పెంపకం, భక్తులు సేద తీరేందుకు చేపట్టిన విల్లాలతో టెంపుల్‌సిటీ, వీఐపీల విడిది కోసం ప్రెసిడెన్షియల్‌ సూట్ల నిర్మాణం చూపరులను మంత్రముగ్ధులను చేసేలా ఉన్నాయని చెప్పారు. వారి వెంట వైటీడీఏ ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ వసంత్‌ నాయక్‌, డీఈఈ సునీల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo