సోమవారం 13 జూలై 2020
Yadadri - May 26, 2020 , 00:22:26

మంత్రి పిలుపు.. పనుల పరుగు

మంత్రి  పిలుపు.. పనుల పరుగు

  • ఇండ్లు, కార్యాలయాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం 

భువనగిరి : సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపర్చేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చిన ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఈ నెల 10న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ ప్రముఖులంతా ఉత్సాహంగా పాల్గొంటూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు వరుసగా మూడు ఆదివారాలు తమ నివాసాల్లో పరిసరాలను శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారు. ఇక అధికారులు తాము సైతం అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తను తొలగిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భువనగిరి మున్సిపల్‌ అధికారులు పారిశుధ్య నిర్వహణపై పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణ, పరిసరాల పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలపై కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. వీధుల్లో ప్రచార బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.

ఆదేశాల అమలుకు సమగ్ర చర్యలు.. 

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో పారిశుధ్య పనులను చేపడుతున్నాం. ప్రతి ఆదివారం 10 గంటలకు 10నిమిషాల కార్యక్రమాన్ని మూడు వారాలుగా కొనసాగిస్తున్నాం. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పరిశుభ్రతపై ఇండ్ల గోడలకు పోస్టర్లు అంటిస్తున్నాం. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పారిశుధ్య నిర్వహణకు సహకరిస్తున్నారు.

-వంశీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌, భువనగిరి


logo