శనివారం 30 మే 2020
Yadadri - May 24, 2020 , 01:09:16

సిరుల మూట ఎడారి తోట

సిరుల మూట ఎడారి తోట

  • జిల్లాలో తొలిసారి విభిన్న సాగు 
  • సంప్రదాయ సాగు కాదని ఎడారి
  • పంటవైపు మళ్లిన రైతు గోపాల్‌రెడ్డి 
  • చైనా, వియత్నాం దేశాల్లో ఈ పండుకు భలే గిరాకీ
  • మూడు ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంట
  • పంట కాలం ఏడాది, ఎకరానికి రూ.5 లక్షల పెట్టుబడి
  • జూలై నుంచి డిసెంబర్‌ వరకు పంట చేతికి 
  • షుగర్‌ పేషెంట్లు, క్యాన్సర్‌ రోగులకు  ఈ పండు దివ్యఔషధం 
  • సాకారమవుతున్న సీఎం కేసీఆర్‌ స్వప్నం

ఆయన అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాడు.. సంప్రదాయ సాగును పక్కనపెట్టి సరికొత్త విధానంతో వ్యవసాయం చేయాలని భావించా డు.. తనకున్న పరిజ్ఞానం, ఉద్యానశాఖ అధికారుల తోడ్పాటుతో ఎడారి దేశా ల్లో పండించే పంట వేశాడు..స్వేదాన్ని చిందిస్తూ తోటను పెంచుతున్నా డు.. భువనగిరి మండలం అనాజీపురానికి చెందిన గోపాల్‌రెడ్డికి 8 ఎకరాల భూమి ఉంది. తొలుత మల్బరీ సాగు చేశాడు. పెద్దగా లాభాలు రాకపోవడంతో విభిన్నంగా డ్రాగన్‌ ఫ్రూట్స్‌ను సాగు చేయాలని భావించాడు. వెంటనే సంగారెడ్డిలోని ఓ రైతు నుంచి మొక్కలను కొనుగోలు చేసి మొదట 3 ఎకరాల్లో సాగు ప్రారంభించాడు. పంటకాలం ఏడాది. ఇప్పటివరకు 8 నెలలు పూర్తికాగా, నాలుగునెలల్లో పంట చేతికి రానుంది. ఎకరానికి పంట పెట్టుబడి రూ.5 లక్షలు. జిల్లా ఉద్యానశాఖ నుంచి రూ.3.46 లక్షల ప్రోత్సాహం పొంది డ్రిప్‌ పద్ధతిన సాగు చేస్తున్నాడు. డ్రాగన్‌ ఫ్రూట్‌  పంట వానకాలంలో చేతికి వస్తుంది. జూలై నుంచి నవంబర్‌ వరకు మూడు దఫాలుగా కోస్తారు. ఒక్కో పండు 300 నుంచి 500 గ్రాములు ఉంటుంది. ఒక్కసారి చెట్టు పెరిగితే 30 ఏండ్ల పాటు కాస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు, పలు రకాల క్యాన్సర్‌ రోగులు ఈ పండును దివ్యఔషధంగా తీసుకుంటారు.  

యాదగిరిగుట్ట: మారిన ఆహార అలవాట్లతో కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నా యి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్‌లో డిమాండ్‌ దృష్ట్యా కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. నాగజముడు, బ్రహ్మజముడును పోలి ఉండే  డ్రాగన్‌ ఫ్రూట్స్‌ శాస్త్రీయ నామం పిటాయ. ఇందులో ఎరుపు, పసుపు రకాలు ఉంటాయి. పై భాగంలో ఎరుపుగా ఉండి లోపల గుజ్జు మాత్రం ఎరుపు లేక తెలుపు రంగులో ఉంటుంది. కొన్నేండ్ల క్రితం చైనా దేశంలోని వియత్నాం,అమెరికా దేశాల్లో మాత్రమే పండే ఈ పంట ప్రస్తుతం మన దేశంలో కూడా పండిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదారేండ్లుగా తెలుగు రాష్ర్టాల్లో ఈపండ్లను పండిస్తున్నారు. భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన  రైతు బోయపల్లి  గోపాల్‌రెడ్డికి సుమారు 8 ఎకరాల భూమి ఉంది. గతంలో మల్బరీ, వేప సాగు చేశాడు. సాగులో పెద్దగా లాభం లేకపోవడంతో విభిన్న పంటలవైపు దృష్టిపెట్టాడు. చైనాలో పండే డ్రాగన్‌ ఫ్రూట్స్‌ను సాగు చేయాలని భావించాడు. సంగారెడ్డిలోని ఓ రైతు వద్ద నుంచి డ్రాగన్‌ ఫ్రూట్స్‌మొక్కలు కొనుగోలు చేసి మూడు ఎకరాల్లో  మొదటిసారి సాగు చేశా డు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేశ్‌, క్లస్టర్‌ అధికారి సౌమ్యను సంప్రదించి రూ. 3.46 లక్షల ప్రో త్సాహకం పొంది, డ్రిప్‌ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేసి సాగు చేస్తున్నాడు. మొక్కలు నాటి 8 నెలలు అవుతుంది. ప్రస్తుతం ఏపుగా పెరిగాయి.

జూలై నుంచి డిసెంబర్‌ వరకు పంట చేతికి..

సాధారణంగా డ్రాగన్‌ ఫ్రూట్స్‌ వర్షాకాలంలో పంట చేతికి వస్తుంది. జూలై నుంచి నవంబర్‌ వరకు ఈ పంట మూడు విడుతలుగా కోస్తారు. ఒక్కో పండు 300 నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది. మొదటిసారి కావడంతో ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 పండ్లుకాస్తాయి. సుమారు 30 ఏండ్లపాటు డ్రాగన్‌ ప్రూట్స్‌ను పండించవచ్చు. మార్కెట్‌లో ఒక పండుకు  రూ. 80 నుంచి రూ.100 వరకు ఉంటుంది. కిలోకు రూ. 300 వరకు అమ్ముకునే అవకాశం ఉంది. మొదటి ఏడాదిలో ఎకరాకు 8 ఎనిమిది క్వింటాళ్లు, రెండో సంవత్సరంలో 2 టన్నులు, ఇలా ఏడాదికి ఏడాది పంట దిగుబడి పెరుగుతూ ఉంటుంది.  ఐదేండ్ల వరకు ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పంట దిగుబడి వస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు, పలు రకాల క్యాన్సర్లకు ఎక్కువగా ఈ పండును ఔషధంగా వాడుతారు.  

ఎకరానికి రూ. 5 లక్షల పెట్టుబడి..

డ్రాగన్‌ ప్రూట్స్‌ సాగుకు ఎకరానికి రూ. 5 లక్షల పెట్టుబడి వస్తుందని రైతు చెబుతున్నాడు. మొక్క కు రూ.70, ఎకరానికి 2000 మొక్కలు వేసుకోవచ్చు. మొక్కలు ఎదిగేందుకు 600 పోల్స్‌, కాంక్రీట్‌ రింగులు వేయాల్సి ఉంటుంది.  రోజువారి కూలీలకు కలుపుకుని మొత్తం ఎకరానికి 5లక్షలు పెట్టుబడి వస్తుందని రైతు అంటున్నాడు.  

సులభ యాజమాన్య పద్ధతులు..

ప్రధానంగా సేంద్రియ ఎరువులతోనే పంట సాగుచేస్తారు. వేప పిండి, పశువులు పేడ వేసి మొక్కను నాటుతారు. చెట్ల మొదలులో గడ్డి మొలువకుండా వరిపొట్టును వేస్తారు. నాటిన మొక్కకు ప్రతి నెలకోసారి డికంపోజర్‌ను డ్రిప్‌ ద్వారా అందిస్తారు. ఒక్కో మొక్కను 10 అడుగులు, 8 అడుగుల వెడల్పులో నాటుతారు. సిమెంట్‌ పోల్‌ 7 అడుగుల ఎత్తులో ఉండాలి. ఆధారం లేకుండా చెట్టు పెరగదు కాబట్టి, సపోర్టుగా సిమెంట్‌ పోల్స్‌ వేసి, వాటిపై సిమెంట్‌ కాంక్రీట్‌ రింగులు వేయా లి. నాటిన 12 నెలల తర్వాత దిగుబడి వస్తుంది. ఆర్గానిక్‌కు అనుకూలమైన పంటకావడంతో చీడపీడలు ఉండవు. పశువుల ఎరువులు, జీవామృతం, డికంపోజుడ్‌ బ్యాక్టీరియాను మార్చి మా ర్చి వాడుకుంటే పంట దిగుబడి పెరుగుతుంది. మొక్క పెరుగుతున్నా కొద్ది పిల్లకొమ్మలను తొలగించాలి. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. వేసవిలో 20 లీటర్ల నీటిని అందించాలి. వానకాలంలో మాత్రం నీటిని ఇవ్వకూడదు.  

భిన్నమైన పంటలు సాగుచేయాలి


ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ప్రతి రైతు భిన్నమైన పంటలు సాగుచేయాలి. డ్రాగన్‌ ప్రూట్స్‌ పంటకు జిల్లాలోని నేలలు అనుకూలంగా ఉన్నాయి. రెండేండ్లుగా చాలా మంది రైతులు ఈ డ్రాగన్‌ ప్రూట్స్‌ పంట సాగుచేసేందుకు ముందుకువస్తున్నారు. జిల్లాలో 13 ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేయగా అనాజీపురంలో పంట ఏపుగా పెరిగింది. డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంట సాగుచేస్తున్న రైతుకు రూ. 3.46 లక్షల ప్రోత్సాహకం అందజేశాం. 

-సురేశ్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి, యాదాద్రిభువనగిరి


విభిన్న పంట వేయాలని ఆలోచించా..


చాలా ఏండ్లుగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలని ఆలోచన ఉండేది. గతంలో మల్బరీ, వేప సాగుచేశా. పెట్టుబడి సైతం మిగలలేదు. దీంతో మరో కొత్తరకమైన పంటసాగుచేయాలని భావించా. ఈ క్రమంలో డ్రాగన్‌ ప్రూట్స్‌కు మార్కెట్‌లో భలేగిరాకీ ఉందని తెలుసుకున్నా. వెంటనే సంగారెడ్డిలోని ఓ రైతు వద్దకు వెళ్లి మొక్కలు తీసుకువచ్చా. డ్రాగన్‌ ప్రూట్స్‌లో ఎరుపురకాన్ని ఎంచుకుని సాగు చేశా. మొదటలో భూమిలో పంట వస్తుందా అన్న భయం ఉండేది. కానీ మొక్క ఏపుగా పెరిగింది. మరింత ఈ పంటను విస్తరిస్తాను. ఒకేసారి పెట్టుబడితో 30 ఏండ్లవరకు పంట వచ్చి మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నా.                                                   

  -బోయపల్లి గోపాల్‌రెడ్డి, రైతు, అనాజీపురం 


logo