శనివారం 06 జూన్ 2020
Yadadri - May 23, 2020 , 01:13:04

అ‘టెన్‌' షన్‌

అ‘టెన్‌' షన్‌

 జూన్‌ 8 నుంచి పదోతరగతి పరీక్షలు  

 కరోనా నేపథ్యంలో మరింత  కట్టుదిట్టంగా ఏర్పాట్లు

 షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ 

యాదాద్రి భువనగి, నమస్తేతెలంగాణ : కరోనా కారణంగా వాయిదా పడిన పదోతరగతి పరీక్షలు జూన్‌ 8 నుంచి నిర్వహించేందుకు  విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసిం ది. ఈ నేపథ్యంలో టెన్త్‌ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తును ప్రారంభించింది. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో చైతన్యజైని సమీక్ష సమావేశం నిర్వహించారు.  విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేందుకు సెంటర్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన 11, 500 మాస్కులను కూడా సిద్ధం చేశారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు అవసరమైన థర్మల్‌ స్క్రీనింగ్‌ గన్స్‌ కూడా ప్రతి పరీక్షా కేంద్రానికి రెండు  చొప్పున సమకూర్చేందుకు జిల్లాలోని ఒక కంపెనీ ముందుకు వచ్చింది. అదనపు కలెక్టర్‌ జి. రమేశ్‌ చొరవ తీసుకుని థర్మల్‌ టెస్టులు చేసేందుకు అవసరమైన గన్స్‌ చౌటుప్పల్‌లోని ఒక కంపెనీ నుంచి విరాళంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు స్క్రీనింగ్‌ టెస్టు లు జరిపిన తర్వాతనే సెంటర్‌లోకి అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 98 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.98 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 75 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు విధులు నిర్వహిస్తారు. బెంచీకి ఒకరు చొప్పున  మాత్రమే కూర్చొని పరీక్ష రాసేందుకు చర్యలు తీసుకున్నారు.  

10, 066  మంది రెగ్యులర్‌ విద్యార్థులు

టెన్త్‌ పరీక్షలకు 10, 066  మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 5092 మంది బాలురు, 4974 మంది బాలికలు ఉన్నారు. ఫెయిల్‌ అయి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 172 మంది మాత్ర మే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 98 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1100 మంది సిబ్బందిని ఇన్విజిలేషన్‌ విధుల్లో నియమించారు.   

ఏ సమయానికి కేంద్రానికి చేరుకోవాలి

పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తారు.  విద్యార్థులు గంట ముందుగానే  పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా చూడాలని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్‌ జారీ చేశారు. పదోతరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 

కట్టుదిట్టంగా పరీక్షలు 

జూన్‌ 8 నుంచి 29 వరకు పదోతరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. నిమిషం ఆలస్యంగా వస్తే అనుమతి నిరాకరణకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. పాత పద్ధతిలోనే అనుమతి ఉంటుంది. 11, 500 మాస్కులు అందజేస్తాం. శానిటైజేషన్‌ కూడా చేస్తాం.. ప్రతి సెంటర్‌కు 1/2 లీటర్‌ శానిటైజర్‌ను అందజేసి విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. పరీక్షకు గంట ముందు కేంద్రంలోని ప్రతి బెంచీని శుభ్రం చేస్తాం. వైరస్‌ నిర్మూలన కోసం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో పిచికారీ చేయిస్తాం.   

- చైతన్యజైని, డీఈవో, యాదాద్రి భువనగిరి 

విద్యార్థులు సమయపాలన పాటించాలి

విద్యార్థులు తప్పకుండా సమయపాలన పాటించాలి. పరీక్ష సమ యం కంటే గంటముందే  కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు హాల్‌టికెట్లు, పరీక్షాప్యాడ్లు  మాత్రమే తీసుకురావాలి. ఇతర వస్తువు లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించం.  

 -రంగరాజన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, జిల్లా పరీక్షల విభాగం


logo