శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - May 19, 2020 , 01:40:03

తుది దశకు బస్వాపూర్‌

తుది దశకు బస్వాపూర్‌

90 శాతం పనులు పూర్తి.. మిగిలిన 10 శాతం పనుల్లో పురోగతి  

యాదగిరిగుట్ట:  బస్వాపూర్‌ జలాశయానికి 1.50 టీఎంసీల నీటిని తరలించే లక్ష్యంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. మల్లన్నసాగర్‌ జలాశయం నుంచి 13వ ప్యాకేజీలోని ప్రధాన గ్రావిటీ కాల్వ, సమాంతర కాల్వల ద్వారా దిగువ ప్యాకేజీలకు నీటి సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ప్రధాన గ్రావిటీ కాల్వకు సంబంధించిన ఎడమ కాల్వ ద్వారా నీటిని 15వ ప్యాకేజీ నుంచి 16వ ప్యాకేజీ గల ఆయకట్టుకు, 11.39 టీఎంసీల సామర్థ్యం గల బస్వాపూర్‌ జలాశయానికి గోదావరి నీటిని సరఫరా చేసేలా ప్రతిపాదించారు. అదేవిధంగా కుడి కాల్వ ద్వారా 14వ ప్యాకేజీల ఆయకట్టుకు, 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ జలాశయానికి నీటిని సరఫరా చేయనున్నారు. ఇందుకోసం కొద్దిరోజుల క్రితమే ట్రయల్న్‌ పూర్తి చేశారు. అక్కడి నుంచి నేరుగా 15వ ప్యాకేజీ నుంచి 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న బస్వాపూర్‌ జలాశయానికి నీటిని తరలించనున్నారు.

జూన్‌లోగా జలాశయానికి 1.50 టీఎంసీల నీరు

వచ్చే వానకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించిన వెంటనే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులు నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నీటిపారుదలశాఖ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు.  వచ్చే నెల చివరివారంలోగా బస్వాపూర్‌ జలాశయంలో 1.50 టీఎంసీల నీటిని నింపేందుకు కావాల్సిన ప్రధాన కాల్వ పనులు, బస్వాపూర్‌ జలాశయ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 90 శాతం ప్రధాన కాల్వ లైనింగ్‌, స్టక్చర్లు, బ్రిడ్జీలు, సొరంగం పనులు పూర్తి కాగా మరో 10శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా తుర్కపల్లి మండల కేంద్రంలోని యాదగిరిగుట్టకు  వెళ్లేదారిలో బ్రిడ్జి, ముల్కలపల్లి వద్ద గల సీసీ స్టక్చర్స్‌ పనులు కొనసాగుతున్నాయి. బస్వాపూర్‌ జలాశయంలో గల 120 కేవీ విద్యుత్‌ హెటెన్షన్‌ వైర్ల తొలగింపు పనులు, తూం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధాన కాల్వకు  సంబంధించిన భూసేకరణ పూర్తికాగా, జలాశయానికి సంబంధించిన భూసేకరణ, దిగువ కాల్వ, ఉపకాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వ, తూం నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణపై దృష్టి సారించామని,త్వరలో  పనులు పూర్తి కానున్నాయని  నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.

16 ప్యాకేజీ ఇలా..

 జిల్లాలోని తుర్కపల్లి మండలం  ముల్కలపల్లిలో ప్రారంభమై నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం అక్కడి  నుంచి సంస్థాన్‌నారాయణపూర్‌ మండలం వరకు మళ్లించడం కోసం ప్రధాన కాల్వ, ఉప కాల్వ తవ్వించడం ప్రధాన లక్ష్యం. దాదాపుగా  87 కిలోమీటర్లు ప్రధాన కాల్వ ఉంది.  ముల్కలపల్లిలో 36.609 కిలోమీటర్ల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ అయిన బస్వాపూర్‌ ప్రాజెక్టు ప్రారంభమవుతున్నది.  అక్కడి నుంచి ప్రధాన కాల్వ 5.19 కిలోమీటర్లు ప్రవహించి 41.80 కిలో మీటర్ల వద్ద సుమారు 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమవుతున్న బస్వాపూర్‌ జలాశయంలోకి గోదావరి జలాలు వస్తాయి. బస్వాపూర్‌ జలాశయం మెయిన్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రారంభమైన ప్రధాన దిగువ కాల్వ భువనగిరి అరోరా ఇంజినీరింగ్‌  కళాశాల మీదుగా రైల్వే ట్రాక్‌ బ్రిడ్జి నుంచి రాయగిరి, పెంచుకలపహాడ్‌, రామచంద్రాపురం తుక్కాపురం, చందుపట్ల, గౌస్‌నగర్‌ గ్రామాలను తాకుతూ ఎర్రబెల్లి వద్దకు చేరుకుంటుంది. 60.675 కిలోమీటర్ల వద్ద మరో క్రాస్‌ రెగ్యులేటర్‌ నిర్మించారు. ఇక్కడి నుంచి ప్రధాన కాల్వలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌(ఓటీ-5) నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ వీరవెల్లి గ్రామాన్ని తాకుతూ మోటకొండూర్‌ మండలంలోని కదిరేణిగూడెం,ఆత్మకూరు(ఎం) మండలంలోని చెరువులు నింపుతూ వెళ్తున్నది. ఇక ఎర్రబెల్లి నుంచి ప్రధాన కాల్వ నాగిరెడ్డిపల్లి, వలిగొండ మండలంలోని  టేకులసోమారం, పహిల్వాన్‌పూర్‌ బునాదిగాని కాల్వను దాటుకుంటూ వర్కట్‌పల్లి, గోకారం మీదుగా 87 కిలోమీటర్లు ప్రవహించి రామన్నపేట మీదుగా సిరిపురం,  వెల్లంకి వరకు చేరుకుంటుంది. వెల్లంకి వద్ద ప్రధాన కాల్వ రెండు భాగాలుగా విభజన చేశారు. అక్కడి నుంచి ఎడమ కాల్వ చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలను తాకుతూ 13.7 కిలోమీటర్లు ప్రవహించి  శివనేనిగూడెం వద్ద ముగుస్తుంది. కుడికాల్వ చౌటుప్పల్‌ మండలంలోని న్యాలపట్ల, జై కేసారం, కంచనపల్లి, పంతంగి, లింగోజిగూడెం మీదుగా 16.15 కిలోమీటర్లు ప్రవహించి సంస్థాన్‌నారాయణపూర్‌ మండలంలోని  కోతులాపురంలో ముగుస్తుంది. ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా 2 మీటర్ల నుంచి 6 మీటర్ల వెడల్పుతో కాల్వ పనులు చేపట్టారు. 

1,218 చెరువుల్లోకి గోదావరి జలాలు..

బస్వాపూర్‌ జలాశయం నీటిని దిగువకు మళ్లించేందుకు ప్రధాన కాల్వతో పాటు ఆయా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మొత్తం 14 డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఏర్పాటు చేసి  జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని మొత్తం 1,218 చెరువులు నింపనున్నారు. ఇందులో ప్రధానంగా మేజర్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌1, 2ల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లోని 699 చెరువులు నింపి,  53,500 ఎకరాల ఆయకట్టు, మిగతా  3 నుంచి 14 వరకు గల డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌తో  భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో 683 చెరువులు నింపి,  1,05,831 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. నల్లగొండ జిల్లాలోని 29,169 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

యాదాద్రిలో 1,59,331, నల్లగొండ జిల్లాలో 29,169 ఎకరాలకు సాగు జలాలు.. 

బస్వాపూర్‌ జలాశయం ప్రధాన తూం ద్వారా నిర్మితమవుతున్న దిగువ కాల్వలకు డిస్ట్రిబ్యూటరీ కాల్వను నిర్మించనున్నారు. వీటికి తూంలు నిర్మించి ఉపకాల్వల ద్వారా జిల్లాలో 1,218 చెరువులు నింపి 1,59,331 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 29,169 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురానున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,88,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ పనులు ప్రతిపాదించారు.

పనుల్లో వేగం పెంచాం.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి చెరువును  నింపేందుకు పనుల్లో వేగం పెంచాం. మరో 20 రోజుల్లో బస్వాపూర్‌ జలాశయంలోని విద్యుత్‌ హెటెన్షన్‌ వైర్లు తొలగిస్తాం. దిగువ ప్రాంతంలో ప్రధాన కాల్వతోపాటు,  ఇతర డిస్ట్రిబ్యూటరీ కాల్వ పనులకు సంబంధించిన సర్వే చేశాం. భూసేకరణ చేపట్టి, కాల్వలకు తూంలు ఏర్పాటు చేసి జిల్లాలోని 1218 చెరువుల్లో నీటిని నింపుతాం. బస్వాపూర్‌లో జూన్‌ లేదా జూలై మొదటివారంలో 1.00 నుంచి 1.50 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు కావాల్సిన పనులు త్వరలో పూర్తి చేస్తాం.  

             -ఖుర్షీద్‌, ఈఈ, కార్యనిర్వాహక ఇంజినీరు,  కాళేశ్వరం ప్రాజెక్టు, కన్‌స్ట్రక్షన్‌ డివిజన్‌ నెం 3, భువనగిరి

VIDEOS

logo