ఆదివారం 07 మార్చి 2021
Yadadri - May 13, 2020 , 00:31:10

హై అలర్ట్‌..

హై అలర్ట్‌..

యాదాద్రిభువనగిరి, నమస్తేతెలంగాణ: ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అలజడి మొదలైంది. ముంబై, చెన్నై, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి వలస కూలీలు జిల్లాకు చేరుకుంటుండటం.. వారిలో కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పల్లెలకు చేరుకుంటున్న వలస కార్మికులను గుర్తిస్తున్నారు. వారికి పరీక్షలు నిర్వహిస్తూ క్వారంటైన్‌ చేస్తున్నారు.  

పలువురిలో పాజిటివ్‌ లక్షణాలు..

పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు కావడంతో జిల్లాలో ఇప్పటివరకూ పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటుండటంతో వారిలో పాజిటివ్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగామకి చెందిన వారితో మొదలైన పాజిటివ్‌ కేసులు ఆగడం లేదు. మంగళవారం ముంబై నుంచి వచ్చిన మోటకొండూరు మండలానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ రాగా, అదేవిధంగా సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంకు చెందిన ఇద్దరు, చౌటుప్పల్‌ మండలం తంగడపల్లికి చెందిన నలుగురు వలస కూలీలు ముంబై నుంచి వచ్చి కింగ్‌కోఠిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. 

క్వారంటైన్‌ చేస్తున్న అధికారులు.. 

జిల్లాకు చేరుకుంటున్న వలస కూలీల్లో పాజిటివ్‌ లక్షణాలు కనిపిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు వారితో సత్సంబంధాలు కలిగిన వారిని గుర్తిస్తూ క్వారంటైన్‌ చేస్తున్నారు. 

- యాదగిరిగుట్ట మండలంలో మొత్తం 35 మందిని క్వారంటైన్‌ చేయగా ఇందులో 8 మంది మహారాష్ట్రకు చెందిన వలస కూలీలను హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. 

- వివిధ రాష్ర్టాల నుంచి మోటకొండూరు మండలకేంద్రంతో పాటు పలు గ్రామాలకు 30 మంది రాగా ఇందులో 26 మందిని హోం క్వారంటైన్‌ చేసిన అధికారులు మరో నలుగురిని, వారి కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురిని ఫీవరాస్పత్రికి తరలించారు. ఇందులో ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారులు ప్రకటించారు.  

-ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏడుగురిని, తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 30, ఆలేరు మండలంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 53, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 300 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. ఇందులో ముగ్గురిని బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు పరీక్షల నిమిత్తం పంపారు. 

- రాజాపేటలో 40, బీబీనగర్‌లో 210, చౌటుప్పల్‌లో 84, సంస్థానారాయణపురంలో 48 , భూదాన్‌పోచంపల్లిలో 89, అడ్డగూడూరులో 106 మందిని, రామన్నపేటలో 15, మోత్కూరులో ఇతర జిల్లాల నుంచి వచ్చిన 290, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 62, వలిగొండలో 60 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు ఆయా మండలాల వైద్యాధికారులు తెలిపారు.     

-మహారాష్ట్ర నుంచి బీబీనగర్‌ మండలం జంపల్లికి వచ్చిన ఒకరిని ఎయిమ్స్‌కు తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. అదేవిధంగా కొండమడుగు పీహెచ్‌సీ పరిధిలోని 153 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. 

VIDEOS

logo