శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - May 12, 2020 , 00:54:17

ఇంట్లోనే ప్రార్థనలు

ఇంట్లోనే ప్రార్థనలు

  • రంజాన్‌ మాసం గతానికి భిన్నం
  • లాక్‌డౌన్‌ను ఆచరిస్తూ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలు

యాదాద్రిభువనగిరి, నమస్తేతెలంగాణ :  కొవిడ్‌- 19 లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. దీంతో ఉపవాసం ఉంటున్న ముస్లింలు తమ ఇండ్లల్లోనే నమాజ్‌ చేస్తున్నారు. ఈ సారి రంజాన్‌ మాసం గతానికి భిన్నంగా ఉంది. రోజా సాయంత్రం విరమించే ఇఫ్తార్‌ ప్రక్రియను కూడా ఇంట్లోనే జరుపుకుంటున్నారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసంలో గతంలో మసీదుల వద్ద సందడి కొనసాగేది. ఇఫ్తార్‌ విందులు, భోజనాల ఏర్పాట్లు ఉండేవి. ఈసారి ఆంక్షలతో బోసిపోయి కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులంతా వారి గృహాల్లోనే సహర్‌, ఇఫ్తార్‌, ఖురాన్‌ పఠనం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి ఆధ్యాత్మిక చింతనలో ఉంటున్నారు. ఈ ఆపత్కాలంలో అల్లాను ప్రార్థిస్తూ.. మళ్లీ పాత రోజులు రావాలని దువా చేస్తున్నారు.  రంజాన్‌ నెల మొత్తం జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ఎంతో కోలాహలంగా ఉండేది. ఒక వైపు హలీం రుచులు.. మరో వైపు ప్రత్యేక ప్రార్థనలతో పాటు  సందడి ఉండేది. వేలాది మంది ముస్లింలు  కరోనా మహమ్మారిని తరిమేయాలని ఇంట్లో అల్లాను ప్రార్థిస్తున్నారు. 

ఈ తేదీలు కీలకం..

రంజాన్‌ నెలలోని 21, 23, 25, 27, 29వ తేదీల్లో జాగారం చేస్తారు. నమాజ్‌ చేస్తూ, ఖురాన్‌ పఠిస్తూ తాఖ్‌రాత్‌ (లైలతుల్‌ ఖద్‌)్ర అన్వేషిస్తారు. ఉపవాసాల చివరి ఐదురోజులు ముస్లింలు మరింత కీలకంగా భావిస్తారు. పుణ్య ఫలాలు అందుకునేందుకు పరితపిస్తారు.

తరావ్హీ కూడా..

కేవలం రంజాన్‌ నెలలోనే తరావ్హీ అనే ప్రత్యేక నమాజ్‌ను ఇషా ప్రార్థన తర్వాత ఆచరిస్తారు. 20 రకాత్‌ విధానంలో రాత్రి 8.30 గంటల నుంచి గంటన్నర పాటు ఖురాన్‌పఠనం ఉంటుంది. అయితే ఈసారి ఇదంతా ఇండ్లల్లోనే ఆచరిస్తున్నారు. 

జకాత్‌..

ముస్లింలు పేదలకు జకాత్‌ పేరిట దానం చేయనున్నారు. తమ ఆదాయంలో రెండున్నర శాతాన్ని ఇలా వెచ్చించాలనేది వారి విశ్వాసం. రంజాన్‌ పండుగ రోజు ఫిత్రపేరిట కూడా దానధర్మాలు చేస్తారు.

అల్లాను  రోజూ వేడుకుంటున్నా..

ఇంట్లో నమాజ్‌ చేస్తున్నాం...ఇఫ్తార్‌ విందులు కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాం. రోజూ కొవిడ్‌- 19 వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను రక్షించాలని అల్లాను వేడుకుంటున్నా....అల్లా దయతో త్వరలోనే  కొవిడ్‌-19కు మందు దొరుకుతుందని నమ్ముతున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతం కావటానికి ముస్లింలు కృషి చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో కరోనా అదుపులోనే ఉంది. లాక్‌డౌన్‌ ముగిసే వరకూ రోడ్డు మీదికి రాకుండా ఒకరికొకరు సహకరించుకోవడం వల్లనే కరోనాను అదుపు చేయగలుగుతాం.  

-ఇబ్రహీం (ఆల్‌ హజ్‌), గాంధీనగర్‌, యాదగిరిగుట్ట

ఇంట్లోనే ఇఫ్తార్‌ విందు.. 

ముస్లింలు రంజాన్‌ను అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.  ఇంట్లోనే ఐదు సార్లు నమాజ్‌ చేస్తున్నాం. రాత్రి తొమ్మిది గంటలకు  ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనైన తరావ్హీ అనే నమాజ్‌ చేస్తున్నాం. కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్‌ విందు ఉంటుంది. కరోనా నివారణకు చర్యలు తీసుకుంటూనే అల్లాను భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తున్నాం. కేవలం ఐదుగురితో మసీద్‌, దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్నాం. 

-ఎండీ రహీం, చౌటుప్పల్‌

VIDEOS

logo