శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - May 11, 2020 , 01:49:23

కరోనా కలకలం

కరోనా కలకలం

  • జిల్లాలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ

ఆత్మకూరు(ఎం): ఇప్పటి వరకు ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదుకాకుండా గ్రీన్‌జోన్‌లో ఉన్న జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటం కలకలం రేపింది. ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన పలువురు ఉపాధి కోసం ముంబై వలస వెళ్లారు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముంబైలో ఉన్న గ్రామానికి చెందిన ఏడుగురు ఈనెల 6న రైలు ద్వారా హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే 7వ తేదీన హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అత్యవసర వాహనం(కారు)లో వీరు గ్రామానికి వచ్చారు. వెంటనే సమాచారం తెలుసుకున్న సర్పంచ్‌ నాయిని నర్సింహారెడ్డితో పాటు గ్రామస్తులు ముంబై నుంచి వచ్చిన వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా కాపలా ఉండి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై, తహసీల్దార్‌, వైద్య సిబ్బంది గ్రామానికి వచ్చి వారికి వైద్య పరీక్షలు చేశారు. ఇందులో నలుగురు వ్యక్తులకు టెంపరేచర్‌ ఎక్కువగా ఉండటంతో వెంటనే 108 వాహనంలో కరోనా పరీక్షల కోసం హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి దవాఖానకు తరలించారు. అందులో ముగ్గురికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి  ప్రణీష, భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కలిసి కారులో ప్రయాణించిన మరో నలుగురితో పాటు ఇద్దరు వారి కుటుంబ సభ్యులను  బీబీనగర్‌ ఎయిమ్స్‌ దవాఖానకు వైద్య పరీక్షల కోసం తరలించారు.

వలస కార్మికుడికి కరోనా.. 

సంస్థాన్‌నారాయణపురం: ఉపాధి కోసం ముంబై వలస వెళ్లి వచ్చిన కార్మికుడికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన నలుగురు,  ఉపాధి కోసం ముంబైకి వెళ్లారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌నేపథ్యంలో ఈనెల 3న వారు గ్రామానికి చేరుకోగా..  పాఠశాలలోని క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నెల 7న హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి దవాఖానకు వారిని పరీక్షల కోసం తరలించగా అందులో ఒకరికి అదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చౌటుప్పల్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌ వారి కుటుంబసభ్యులు 13 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. అతడితోపాటు వచ్చిన మరో 11 మందిని బీబీనగర్‌లోని క్వారంటైన్‌కు తరలించారు.

VIDEOS

logo