బుధవారం 15 జూలై 2020
Yadadri - May 10, 2020 , 01:12:03

భలే మంచి చౌక బేరమూ..!

భలే మంచి చౌక బేరమూ..!

  • అగ్గువకే మొగ్గు దొరుకుతున్న తాజా కూరగాయలు
  • రూ.100కే చేసంచి నిండుతున్న పలు రకాలు
  • దళారీ జోక్యానికి చెక్‌.. నేరుగా అమ్ముతున్న రైతులు  
  • కరోనా సమయంలో భారీగా తగ్గిన ధరలు

‘కొండెక్కిన ధరలు.. భగ్గుమంటున్న కూరగాయలు..’ ఏటా వేసవిలో వింటున్న మాట ఇది. కానీ కరోనా వేళ సామాన్య, మధ్య తరగతికి కూర‘గాయాల’ బెడద తప్పింది. అన్ని రకాల తాజా కూరగాయలు  అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. లాక్‌డౌన్‌ వేళ 40రోజులుగా అగ్గువకే దొరుకుతూ కడుపు నింపుతున్నాయి. రూ.100కే వారానికి సరిపడా సంచి నిండుతున్నాయి. ఒకట్రెండు మాత్రమే అత్యధికంగా రూ.40ధర పలుకుతుండగా మిగతావన్నీ కిలో రూ.10, 20కే లభ్యమవుతున్నాయి. 

- నల్లగొండ 

దళారీ జోక్యానికి అడ్డుకట్ట..

లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలి రెండ్రోజుల్లో ధరలు భగ్గుమన్నాయి. వ్యాపారులు మూడింతలు పెంచి ప్రజల్లో ఆందోళన రేకెత్తించారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు వేశారు. నేరుగా రైతులే విక్రయించేలా మార్కెట్లు తెరిచి పరిస్థితిని చక్కదిద్దారు. తక్కువ ధరలు వినియోగదారులకు కలిసొస్తుండగా.. మరోవైపు పండించిన రైతాంగానికి సైతం గిట్టుబాటు కావడం విశేషం. ఏండ్ల తరబడి దళారుల జోక్యంతో ‘అడ్డికి పావుశేరు’ అన్నట్లుగా అమ్ముకున్న రైతులు.. నేరుగా మార్కెట్లో విక్రయాలు జరుపుతూ మంచి ఆదాయం పొందుతున్నారు. తాజా కూరగాయలు నోరూరిస్తుండడంతో వినియోగదారులు మురిసిపోతున్నారు. ఇన్నాళ్లూ పావుకిలో, అరకిలో కొని సరిపెట్టుకున్న వారంతా నేడు కిలోల కొద్దీ ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు.

నిత్యం రెండు వేల మంది... 

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీట్‌ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన రైతుల అడ్డాకు నిత్యం రెండు వేల మంది వినియోగదారులు వస్తున్నారు. గతంలో రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భౌతిక దూరం దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ మార్కెట్‌కు తరలించారు. దీంతో ఉదయం నుంచి సమీపంలోని పలు గ్రామాల రైతులు సుమారు 40-50మంది కూరగాయలు విక్రయిస్తున్నారు. తాజా కూరగాయలతో పాటు ఆకుకూరలు, పుచ్చ, కర్బూజ, సపోటా, బొప్పాయి, నిమ్మ, బత్తాయి పండ్లు సైతం తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయి.

2800ఎకరాల్లో కూరగాయల సాగు...

జిల్లా వ్యాప్తంగా స్థానిక అవసరాలకు మించి కూరగాయలు సాగవుతున్నాయి. సాధారణ రోజుల్లో దొండ, బీర, కాకర, గోంగూర, టమాట, గోకర సాగుచేస్తున్న రైతులు.. వేసవిలో అదనంగా దోస, బెండ, వంకాయ పండిస్తున్నారు. ఉదయాన్నే పట్టణాలకు తీసుకువచ్చి విక్రయించి తిరిగి పనుల్లోకి వెళ్తున్నారు. పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని కనీస ధరలకు విక్రయించడంతో వినియోగదారులకు మేలు జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 2800ఎకరాల్లో కూరగాయలు పండిస్తుండగా గతంలో ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇక్కడే దండిగా వినియోగిస్తున్నారు.

నల్లగొండ మండలం ఖాజీరామారానికి చెందిన రైతు నకిరేకంటి పాపయ్య అర ఎకరం భూమిలో పందిరి వేసి దొండ సాగుచేస్తున్నాడు. గతంలో ఉదయాన్నే 50 కిలోల కాయలు తెంపి హోల్‌సేల్‌ వ్యాపారులకు కిలో రూ.6-8చొప్పున విక్రయించి మిగతా సమయాన్ని ఇతర పనులకు కేటాయించేవాడు. అదే సమయంలో మార్కెట్‌లో దొండ కిలో రూ.30 ధర పలికినా తనకు మాత్రం రూ.300-400 మాత్రమే చేతికందేది. కానీ, లాక్‌డౌన్‌లో 40రోజులుగా స్వయంగా మార్కెట్లో విక్రయించి లాభాలు పొందుతున్నాడు. కిలో రూ.20కి విక్రయించడం ద్వారా రూ.1000కు పైగా ఆదాయం లభిస్తోంది.

లాక్‌డౌన్‌ కారణంగా దళారీ దందాకు బ్రేక్‌.. 

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర పనులు నిలిచిపోవడంతో రైతులు తాము పండించిన కూరగాయలను సొంతంగా మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఈ కారణంగా హోల్‌సేల్‌ వ్యాపారం నిలిచిపోయి దళారుల పాత్రకు అడ్డుకట్ట పడింది. వ్యాపారుల చేతికి వెళ్లకుండా కూరగాయలను రైతులే విక్రయిస్తుండడంతో వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతోంది.

అరెకరంలో గోగులు చల్లిన.. అరెకరంలో గోకర ఏసిన.. 

నాకు నాలుగెకరాలుంది. అరెకరంల గోగులు జల్లిన... ఇంకో అరెకరంల గోకర గింజలేసిన.. రోజు తీసుకొచ్చి మార్కెట్‌లోనే అమ్ముతున్న. ఏడెనిమిదొందల దాకా వస్తున్నయి. ఇంట్ల కర్సులు ఎల్తున్నయి. పొలం పెట్టుబడికి కూడ ఎంతోకొంత మేలైతయి. ప్రతేడు ఏదో ఒకరకం కూరగాయ తప్పకుండేస్త. పని బాగా ఉన్నప్పుడు మారుబేరగాల్లకు పోస్తం. ఇప్పుడు అన్ని పనులైపోయినయి..అందుకే నేనే రోజొచ్చి అమ్ముకుంటున్న. 

- సైదులు, తొరగల్లు, నల్లగొండ రూరల్‌

ధరలు శానా తగ్గినయి.. 

రెండు, మూడు నెలల కింద ఏ కూరగాయ పట్టుకున్నా కిలో రూ.40, 50ధర ఉండేది. ఈ మధ్య రూ.20కే అమ్ముతున్నరు. ఆకు కూరలు కూడా చాలా తాజాగా ఉంటున్నాయి. వారానికి ఒక సారి మార్కెట్‌కు వచ్చి కొనుక్కుంటున్నం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కూరగాయల విషయంలో డబ్బులు పొదుపు అవుతున్నయి. రూ.100పెడితే సంచి నిండా రావడం సంతోషంగా ఉంది. 

- హేమలత, గృహిణి, వీటీ కాలనీ, నల్లగొండ పట్టణం


logo