శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - May 06, 2020 , 00:32:36

ధాన్యాగారంగా జిల్లా

ధాన్యాగారంగా జిల్లా

 సీఎం కేసీఆర్‌ ముందుచూపుతోనే రికార్డుస్థాయి దిగుబడులు 

 ప్రతిగింజనూ కొనేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు 

‘నమస్తేతెలంగాణ’తో టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌,  డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

“ రైతుల కండ్లల్లో ఆనందం చూడాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పం నెరవేరింది. ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరించి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు మిషన్‌ కాకతీయ, పంటసాయం, 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయడంతో భరోసాతో సాగు చేపట్టిన అన్నదాత రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించారు. జిల్లాను ధాన్యాగారంగా మార్చారు. అయితే ఈ సంతోష సమయంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతు పండించిన ప్రతి గింజనూ కొనేందుకు రంగం సిద్ధం చేసింది.” అని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే  రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

నమస్తేతెలంగాణ : జిల్లాలో కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయి?    

డీసీసీబీ చైర్మన్‌ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 278 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి రెవెన్యూ గ్రామానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా సుమారు 3,94,318 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న వ్యవసాయ శాఖాధికారుల అంచనా వేయగా ఇప్పటి వరకు 1,58,852.206 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 రైస్‌మిల్లుల్లో 1,50,444.920 మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేశాం. 

నమస్తేతెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో గన్నీ బ్యాగుల కొరతను ఎలా అధిగమిస్తున్నారు?  

డీసీసీబీ చైర్మన్‌ : ఇతర రాష్ర్టాల నుంచి గన్నీ బ్యాగులు రావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఇక్కడికి గన్నీ బ్యాగులను తీసుకురావడం సమస్యగా మారింది. అయితే అంతగా ధాన్యం పండని ప్రాంతాలకు వచ్చిన గన్నీ బ్యాగులకు వాడుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. జిల్లాకు 88,75,000 గన్నీ బ్యాగులు అవసరం ఉండగా ఇందులో 47,68,250 గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాం. మిగిలిన బ్యాగులను త్వరలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.  

నమస్తేతెలంగాణ : హమాలీల పరిస్థితేంటి?

డీసీసీబీ చైర్మన్‌: జిల్లాలో ఉన్న 22 మిల్లుల్లో బీహార్‌కు చెందిన వారే పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 50 శాతం హమాలీలు తమ తమ రాష్ర్టాలకు వెళ్లిపోయారు. దీంతో స్థానికంగా ఉండే హమాలీల సహకారంతో ఎఫ్‌సీఐ, రైస్‌ మిల్లుల వద్ద ధాన్యాన్ని దించే ఏర్పాట్లు చేస్తున్నాం.  

నమస్తేతెలంగాణ : కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు మీరిచ్చే సూచనలు?

డీసీసీబీ చైర్మన్‌ : వడగండ్ల వానతో చాలా ప్రాంతాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాక నాణ్యత దెబ్బతింది. దీంతో పాటు అగ్గి తెగులుతో తాలుశాతం పెరిగింది. వరికోత సమయంలో హార్వెస్టర్‌లో బ్లోయర్‌ స్పీడ్‌ పెంచితే తాలు వేరు పడుతుంది. ధాన్యం తేమశాతం నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలి. టోకెన్‌లో ఇచ్చిన సమయానికి  రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలి. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదు. 

నమస్తేతెలంగాణ : వెంటవెంటనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయా?

డీసీసీబీ చైర్మన్‌ : జిల్లాలో ఇప్పటివరకు 692 మంది రైతులకు సంబంధించి రూ.93.17 కోట్ల నగదు జమ అయ్యాయి. మిగితా రైతులకు సైతం విడుతల వారీగా నగదును జమ చేసేందుకు చర్యలు చేపట్టాం.  

VIDEOS

logo