విద్యార్థినుల దశ మార్చనున్న దిశ..!

- పోటీతత్వం పెరిగేందుకు దోహదం
- దిశకు రూపకల్పన చేసిన డీఈవో చైతన్యజైని
- రాష్ట్రమంతటా ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కేజీబీవీల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నాణ్యమైన ఫలితాలు సాధించడం కోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో దిశ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల కేజీబీవీల్లో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల పరీక్షలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. దీంతో సెలవుల్లో ఉన్న విద్యార్థినులను నిరంతరం పర్యవేక్షణ చేసి అత్యుత్తమ ఫలితాలు సాధించే ఉద్దేశంతో కసరత్తు ప్రారంభమైంది. మార్చి 26న ప్రారంభమైన దిశలో కేజీబీవీల స్పెషలాఫీసర్లతో పాటు సబ్జెక్ట్ నిపుణులు, జిల్లా విద్యాశాఖ అధికారి, సెక్టోరియల్ అధికారితో పాటు విద్యార్థినులందరినీ వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేర్చి పర్యవేక్షణ చేయడం..విద్యార్థినులు ఖాళీగా ఉండకుండా తమలోని ప్రతిభాపాఠవాలను వెలుగులోకి తెచ్చుకునే అవకాశం కలిగించారు.
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు..
కరోనా వల్ల పరీక్షలు వాయిదా పడటంతో ఇండ్ల వద్ద విద్యార్థినులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉద్దేశించి దిశ కార్యక్రమాన్ని రూపొందించారు. దీని వల్ల విద్యార్థినులు చదువుతున్నారా? లేదా అని పర్యవేక్షణ చేసే అవకాశం ఏర్పడింది. జిల్లాలోని 11 కేజీబీవీ పాఠశాలల్లో 2249 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తుండగా వారిలో 369 మంది పదోతరగతి చదువుతున్నారు.
ఏం చేస్తున్నారంటే..
జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులను, సబ్జెక్ట్ టీచర్స్, స్పెషల్ ఆఫీసర్స్‌ను కలిపి ఒక వాట్సాప్ యాప్ ద్వారా అచీవర్స్ ఆఫ్ కేజీబీవీ అనే పేరుతో ఒక గ్రూప్‌ను తయారు చేశారు. ఒక్కో ఎస్వో వారి సబ్జెక్ట్‌ను బట్టి టీమ్ లీడర్లుగా కేటాయించారు. ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్‌గా ఐదు టీంలుగా విభజించారు. ప్రతి టీంలో మళ్లీ అందరూ స్పెషల్ ఆఫీసర్లు, సబ్జెక్ట్ వైజ్ టీచర్స్‌ను యాడ్ చేశారు. ప్రతి టీం లీడర్ ఒకరిని సబ్జెక్ట్ లీడర్‌గా డిసైడ్ చేసుకొన్నారు. విద్యార్థినులకు రోజువారి టైంటేబుల్ ఇచ్చారు. అందులో రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక సబ్జెక్ట్, అనంతరం మ్యాథ్స్ సబ్జెక్ట్ రాత్రి పడుకునే వరకు ప్రాక్టీస్ చేయడం, అదేవిధంగా ఉదయం నిద్రలేవగానే సైన్స్‌ను చదివిస్తున్నారు. రోజూ ఒక సబ్జెక్ట్‌తో పాటు మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ ఉండేటట్లు విద్యార్థినులకు టైమ్‌టేబుల్ ఇచ్చారు.
ఖాళీ సమయం సద్వినియోగం..
కరోనా వైరస్ వల్ల పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థినులు తమ సమయం వృథా చేసుకుంటున్నారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏదో చేయాలనే తలంపులో నుంచి దిశ పుట్టుకొచ్చింది. ఫలితంగా విద్యార్థినులు ఉన్నతమైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కల్పించాలని డీఈవో చైతన్యజైని రాష్ట్రంలో ఎవరూ చేపట్టని కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లయింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రమంతటా..
ప్రస్తుతం పరీక్షలు రాయనున్న విద్యార్థినుల కోసం రూపొందించి అమలు చేస్తున్న దిశ కార్యక్రమం గురించి డీఈవో చైతన్యజైని కలెక్టర్ అనితారామచంద్రన్, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, విద్యాశాఖలోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో అమలు జరుగుతున్న తీరు తెన్నుల గురించి కలెక్టర్ అనితారామచంద్రన్ కూడా విద్యాశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు. దాంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. మంచి ఫలితాలు సాధించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కేవలం జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్రమంతటా విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా తెలియజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎలా నడిపిస్తున్నారన్న విషయాలతో కూడిన నివేదికను డీఈవో వారికి అందజేసింది. దాంతో రాష్ట్ర విద్యాశాఖకు నుంచి ప్రశంసలు వచ్చాయి. రాష్ట్రమంతటా దీన్ని ఆదర్శంగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు కసరత్తు చేయనున్నట్లు సమాచారం వచ్చింది.
విద్యార్థినుల్లో క్వాలిటీ పెరిగింది..
మార్చి 26న దిశను ప్రారంభించాం. నిరంతర సాధన వల్ల విద్యార్థినుల్లో క్వాలిటీ పెరిగింది. కరోనా వల్ల వచ్చిన సెలవులను ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. విద్యార్థినులకు టార్గెట్ ఇవ్వడం, సూచనలు చేయడం సబ్జెక్ట్ లీడర్లు చూస్తున్నారు. టైమ్ టేబుల్ ప్రకారం కొనసాగే విధంగా టీమ్ లీడర్లు, ఎస్వోలు కృషిచేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. స్మార్ట్ఫోన్లు లేని విద్యార్థినులకు ఫోన్లోనే ఈ రోజు టార్గెట్ ఏమిటనే విషయం తెలియజేస్తున్నాం. ప్రతి సబ్జెక్ట్ గ్రూప్, జిల్లా కామన్ గ్రూప్‌లో నేను, మా సెక్టోరియల్ ఆఫీసర్ ఆండాలు కూడా సూచనలు చేస్తూ విద్యార్థినులను ఎంకరేజ్ చేస్తున్నాం.
-చైతన్యజైని, జిల్లా విద్యాశాఖ అధికారి
మెరుగుపడనున్న విద్యాప్రమాణాలు..
డీఈవో చైతన్యజైని ఆలోచనల నుంచి వచ్చిన ఈ దిశ కార్యక్రమం విద్యార్థినుల్లో గుణాత్మక మార్పుకు వేదికవుతున్నది. విద్యార్థినులు కరోనా సమయంలో ఇంటి వద్ద చదువుతున్న వివరాలను అడిగిన వెంటనే గ్రూపులో పోస్టు చేస్తున్నందున వారు బాధ్యతగా చదువుతున్నారా.. లేదా అనేది తెలిసిపోతుంది. పరీక్షల్లో వచ్చిన మార్కులు వారిని లక్ష్యం వైపునకు తీసుకువెళ్తాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వినూత్న పద్ధతిలో ఈ కార్యక్రమం ఊపిరిపోసుకున్నది. వచ్చే విద్యా సంవత్సరం మొదటి నుంచే ప్రణాళికా బద్ధంగా దిశను ఉపయోగించుకుంటాం. దిశ కార్యక్రమం వల్ల విద్యార్థినుల విద్యాప్రమాణాలు మెరుగుడుతాయని భావిస్తున్నాం.
-ఆండాలు, సెక్టోరియల్ ఆఫీసర్, యాదాద్రి భువనగిరి
తాజావార్తలు
- ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. స్నేహితురాలి తండ్రి పనేనా.!
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది