ఊపిరి పీల్చుకుంటున్న నల్లగొండ!

- ఊపిరి పీల్చుకుంటున్న నల్లగొండ!
- స్వీయ నియంత్రణ ఫలితం... గడపదాటని ప్రజానీకం..
- కొత్తగా పంపిన 170కిపైగా శాంపిళ్లన్నీ నెగెటివ్ రిజల్ట్
- జిల్లాలో నమోదైన పాటిజివ్ కేసులు 15మాత్రమే...
- ఎనిమిది మంది డిశ్చార్జి, చికిత్సలో ఏడుగురు
- ఎంజీయూ క్వారంటైన్ కేంద్రంలో 15మంది..
- రెడ్జోన్లలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే
- నేడో, రేపో ర్యాపిడ్ డయాగ్నస్టిక్ బృందాల రాక
నీలగిరి: కరోనా కేసుల నుంచి నల్లగొండ జిల్లా క్రమంగా కోలుకుంటోంది. ఏప్రిల్1న నల్లగొండలో ఆరు, మిర్యాలగూడలో ఒక్క పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో ఉలిక్కిపడిన జిల్లా వాసులు.. తాజాగా వచ్చిన నెగెటివ్ ఫలితాలతో ఊపిరిపీల్చుకుంటున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, దామరచర్ల పట్టణాల్లో మొత్తం 15మందికి వ్యాధి సోకగా.. చికిత్స అనంతరం ఎనిమిది మంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. అదనంగా వందల కొద్దీ సేకరించిన అనుమానిత శాంపిళ్లన్నీ తాజా ఫలితాల్లో నెగెటివ్‌గా తేలడంతోజిల్లా ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటోంది. ఓ వైపు అధికారులు.. మరోవైపు పోలీసుల పనితీరు, కృషి ఫలితంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుండగా ప్రజలు సైతం నెల రోజులకు పైగా స్వచ్ఛందంగా ఇండ్లకే పరిమితం కావడం ప్రస్తుత ఫలితాలకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఏప్రిల్1న తొలిరోజే ఆరు కేసులు
జిల్లాలో ఏప్రిల్ 1నుంచి 18వరకు 12కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12రోజుల విరామానంతరం 19వ తేదీన జిల్లా కేంద్రంలో మరో మూడు కేసులు నమోదు కావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చిందని అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సుమారు 170మందికి పైగా శాంపిల్స్ పరీక్షలకు పంపగా అన్నీ నెగెటివ్ రావడం విశేషం.
నల్లగొండలో 9, దామరచర్లలో 2, మిర్యాలగూడలో 1 కేసు నమోదుకాగా.. వీరిలో మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఏడుగురున్నారు. వీరి కుటుంబీకుల్లో మరో ఐదుగురికి కూడా వైరస్ వ్యాపించింది. ఆయా ప్రాంతాల్లో కార్డన్ ఆఫ్ ప్రకటించిన అధికారులు సుమారు 11రోజుల పాటు అనుమానం ఉన్న ప్రతి చోట శాంపిల్స్ సేకరించారు. అన్నీ నెగెటివ్ రావడంతో పాటు ఇటీవల ఎనిమిది మంది వ్యాధి నయమై ఇంటికి చేరుకుని హోంకార్వంటైన్లో ఉన్నారు. మరో నలుగురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న మరోసారి వైరస్ వెలుగుచూసింది. సూర్యాపేట లింకుతో జిల్లాకేంద్రంలోని మాన్యంచెల్క ప్రాంతానికి చెందిన తల్లి, కూతురు, కుమారుడికి కరోనా సోకింది. ఈ మూడు కేసులతో ఇప్పటి వరకు మొత్తంగా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వైరస్ మళ్లీ వ్యాపిస్తోందా..? అనే అనుమానంతో పరిసర ప్రాంతాల నుంచి సుమారు 170మంది ప్రైమరీ, సెకండరీ శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపారు. ఇవి కూడా నెగెటివ్ వచ్చాయి. అయితే, రెండో దఫా పాజిటివ్ వచ్చిన వారిలో బాలిక పలు ఫంక్షన్లకు హాజరుకావడం, మెడికల్ షాప్కువెళ్లడంతో వైరస్ ఎంత వరకు విస్తరించిందోనని భయపడిన జనం... శాంపిళ్లన్నీ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్తగా 15మందిని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. త్వరలో హోంక్వారంటైన్‌కు పంపించడంతో పాటు మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్ర దవాఖాన ఐసోలేషన్ వార్డులో ఉన్నటువంటి ఐదుగురిని సైతం గురువారం రాత్రి డిశ్చార్జి చేశారు.
జిల్లాలో ర్యాండమ్‌గా పరీక్షలు...
రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు జిల్లాల్లో ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మన జిల్లాలోనూ 10బృందాలు ఒకట్రెండ్రోజు ల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరీక్షలు ప్రారంభించనున్నాయి. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు గ్రా మంలో, వార్డులో 300నుంచి 400శాంపిళ్లు సేకరించి మూడ్రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నారు.
కొనసాగుతున్న ఇంటింటి సర్వే...
కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించిన అధికారులు.. వైద్యారోగ్య బృందాలతో సర్వే చేయిస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలతో బాధపడేవారి గురించి ఆరా తీస్తున్నారు. రెడ్‌జోన్ ఏరియా చుట్టూ 3కి.మీ. దూరం వరకు ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యలక్షణాలు తెలుసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు గుర్తించి అవసరమైతే చికిత్సకోసం సిఫారసు చేస్తున్నారు.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..