అపార నష్టం..

- వడగండ్లతో రైతన్నలకు కడగండ్లు
- జిల్లాలో 7239 ఎకరాల్లో వరి నేలపాలు
- మామిడి, బత్తాయి, నిమ్మకూ తీవ్ర నష్టం..
యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లను మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నేలపాలు చేసింది. గురువారం సాయంత్రం నుంచి భారీగా కురిసిన రాళ్లవానకు వరితో పాటు మామిడి, బత్తాయి, నిమ్మకు తీవ్ర నష్టం జరిగింది. జిల్లాలో మొత్తం 57 గ్రామాల్లో 7239 ఎకరాల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. 11 మండలాల్లో రాళ్లవాన ప్రభావం ఉందని, మరీ ముఖ్యంగా వలిగొండ మండలంలో 1196 ఎకరాలు, ఆలేరు మండలంలో 404 ఎకరాలు, యాదగిరిగుట్ట మండలంలో 400 ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందని ఆమె ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఎక్కడెక్కడ.. ఎంతెంత నష్టం..
ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి, రాళ్లజనగాం గ్రామాలలో 220 ఎకరాల్లో వేసిన వరికి 33 శాతం కంటే ఎక్కువే నష్టం వాటిల్లింది. భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం, బస్వాపురం, హన్మాపురం, వడపర్తిలతో పాటు హుస్సేనాబాద్, భువనగిరి పట్టణంలోని 411ఎకరాల్లో వరి నేలకొరిగింది. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో 40 ఎకరాలు, వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో 1196ఎకరాల్లో వేసిన వరి ఎందుకూ పనికి రాకుండా పోయింది. చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మనాగారం, నేలపట్ల, మందోళ్లగూడెం తదితర గ్రామాల్లో 645 ఎకరాల్లో వేసిన పంట పూర్తిగా పాడైపోయింది.
నేతలు, అధికారుల సందర్శన..
జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఎళ్లవేళలా అండగా ఉంటుందని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ బీకూ నాయక్ అన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంతో పాటు ముల్కపల్లి, రుస్తాపూర్, పెద్దతండా, మోతీరాంతండా, వాసాలమర్రి, రాంశెట్టిపల్లి, దత్తాయిపల్లి, వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్, గంధమల్ల తదితర గ్రామాలలో దెబ్బతిన్న వరిపంటను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. పంటనష్టం జరిగిన అన్ని గ్రామాలను రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు రైతు సమన్వయ సమితి సభ్యులతో కలిసి క్షేత్ర పరిశీలన చేపట్టి నివేదికను రూపొందించాలన్నారు. ఏడీఏ పద్మావతి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వడగండ్ల వర్షంతో 3200 ఎకరాల్లో వరిపంట 40 శాతం పైగా దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. పూర్తిస్థాయి పరిశీలన చేపట్టి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానాధికారి సురేశ్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, తహసీల్దార్ సలీముద్దీన్, ఏవో దుర్గేశ్వరి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..