అనుక్షణం అప్రమత్తం

ఇంటింటికీ తిరిగి అనుమానితులను గుర్తించి, వైద్య పరీక్షలు చేయించి, వారికి అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లది కీలక పాత్ర. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజల రక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం రూ.కోట్ల సంపదను సైతం ప క్కన పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రెండు వారాలుగా లాక్డౌన్ ప్రకటించి, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో వైద్య సిబ్బందిలో భాగమైన ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి. క్షేత్రస్థాయిలో కరోనా చైన్‌ను తెంచేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. జిల్లాలోని 20 పీహెచ్సీ పరిధిలో 672 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,991 అనుమానితులను హోం క్వారంటైన్లో ఉంచారు. వీరిలో 946 మంది క్వారంటైన్ గడువు పూర్తి కాగా మరో 1,045 మంది హోం క్వారంటైన్లో కొనసాగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసు లేకపోవడంతో జిల్లా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
డోర్ టూ డోర్ సర్వే..
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రకటించిన నాటి నుంచి ఆశా వర్కర్లు రంగంలోకి దిగారు. కరోనా కట్టడి చేసేందుకు సర్వైలెన్స్ టీంల్లో భాగస్వాములవుతూ ఇంటింటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి వైద్య పరీక్షలు చేయించారు. ఎప్పటికప్పుడు సర్వేలో గుర్తించిన అనుమానితుల వివరాలు మండల వైద్యాధికారి దృష్టికి తీసుకొస్తున్నారు. నిత్యం గ్రామాల్లో ఇతర దేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి, వైద్య సిబ్బందికి తెలియజేయడం, అనుమానితులను హోం క్వారంటైన్లో పెట్టించడంతోపాటు నిత్యం వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
మర్కజ్ లింక్‌ను కనిపెట్టడంలో..
దేశాన్ని గడగడలాడిస్తున్న మర్కజ్ లింకును గుర్తించడంలో ఆశా వర్కర్లది కీలక పాత్ర. ఇంటింటికీ తిరుగుతూ వారి వివరాలు సేకరించి, వైద్యాధికారులు, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
జిల్లావ్యాప్తంగా 13 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిని గుర్తించగా యాదగిరిగుట్ట మండలంలో 5 మంది, రాజాపేటలో ఒక్కరు, ఆలేరులో నలుగురు, బీబీనగర్‌లో ఒక్కరు, భువనగిరిలో ఇద్దరు ఉన్నారు. వీరందరిని గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్ దవాఖానల్లో క్వారంటైన్లో ఉంచారు.
672 మంది ఆశా వర్కర్లు..
జిల్లా వ్యాప్తంగా 20 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో 672 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నా రు. ఆలేరు మండలంలోని శారాజీపేట పీహెచ్సీ పరిధిలో 35 మంది, యాదగిరిగుట్టలో 35, మో టకొండూర్లో 26, రాజాపేటలో 39, భువనగిరి మండలంలోని బొల్లెపల్లిలో 50, బీబీనగర్‌లో 36, కొండమడుగులో 19, బొమ్మలరామారంలో 36, తుర్కపల్లిలో 33, ఆత్మకూరు(ఎం)లో 31, భువనగిరి అర్బన్‌లో 11, మోత్కురులో 28, అడ్డగూడురులో 28, వలిగొండ మండలంలోని వర్కట్‌పల్లిలో 17, చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లిలో 63, పోచంపల్లిలో 41, నారాయణపూర్ లో 44, రామన్నపేట మండలంలోని మునిపంపులలో 51, వలిగొండలో 18, వేములకొండలో 20 మంది ఆశా వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.