బుధవారం 03 మార్చి 2021
Yadadri - Mar 31, 2020 , 22:46:08

లాక్‌డౌన్‌ విజయవంతం..

లాక్‌డౌన్‌ విజయవంతం..

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : ఆలేరు నియోజకవర్గంలో మంగళవారం లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, వంగపల్లి గ్రామాల్లో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ఫైర్‌ ఇంజన్‌తో సోడియం హైఫొక్లోరైట్‌ను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా సీఎం కేసీఆర్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, వైరస్‌ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ ఈ నెల 14వ తేదీకి పొడిగించిన సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని వైన్‌ షాపులను ఎక్సైజ్‌ సీఐ మాధవరావు సీజ్‌ చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు వైన్‌ షాపులు తెరిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. 

నిత్యావసర వస్తువులు పంపిణీ..

మోటకొండూర్‌ మండలంలోని చాడ మధిర గ్రామమైన పిట్టలగూడెంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఏసీపీ నర్సింహారెడ్డి ఉచితంగా బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని పారిశుధ్య కార్మికులకు టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ గడ్డం దశరథగౌడ్‌ మాస్కులు అందజేశారు. ఆలేరు మండల వ్యాప్తంగా వలస కూలీలకు కరోనా వైరస్‌పై రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లి, పెద్దతండా, రాంపూర్‌, సంగ్యాతండా తదితర గ్రామాల్లో కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి పంపిణీ చేసిన మాస్కులను ఎస్సై యాదగిరి ప్రజలకు అందజేసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. రాజాపేట మండల వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. 

కరోనా కట్టడికి నడుం బిగించాలి..

భువనగిరి, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన బ్లీచింగ్‌ స్ప్రేను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు విధిగా లాక్‌డౌన్‌ను పాటించాలన్నారు. పలు వా ర్డుల్లో ప్రజలకు స్థానిక కౌన్సిలర్లు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆర్యవైశ్య మహాసభ, వాసవీక్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత మాస్కుల పంపిణీకి మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు హాజరయ్యారు. ఏసీపీ భుజంగరావు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. వలిగొండ మండలం గోకారంలో సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో రూ.25 వేలతో గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బీబీనగర్‌ మండలం కొండమడుగులో ఉపసర్పంచ్‌ రంగ కృష్ణావేణిగోపాల్‌గౌడ్‌, వార్డుసభ్యుడు కడెం కావ్యల ఆధ్వర్యంలో వలస కూలీలు, కూలీలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బీబీనగర్‌ మండల కేంద్రంలో హోలియా దాసరి సంఘం రాష్ట్ర నాయకుడు  జహంగీర్‌, బీబీనగర్‌ ఎంపీటీసీ-3 భార్గవ్‌ ఆధ్వర్యంలో ఎస్సై రాఘవేందర్‌ నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. మణికంఠ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు కనకబోయిన రాజమల్లేశం ఉచిత బియ్యాన్ని అందజేశారు. సియాం పరిశ్రమ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హైపో కెమికల్‌ స్ప్రేను సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్‌ ప్రారంభించారు. 

చౌటుప్పల్‌ డివిజన్‌లో..

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : చౌటుప్పల్‌ డివిజన్‌ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతున్నది. కిరాణం షాపులు , మెడికల్‌షాపులు,  పెట్రోల్‌బంకు, వాటర్‌ ప్లాంట్ల ఎదుట ప్రజలు సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించారు. వివిధ రాష్ర్టాలనుంచి వచ్చినవారి వివరాలను ఆరా తీశారు.  విజయవాడ నుంచి వచ్చిన ఇద్దరికి వైద్యపరీక్షలు చేసి స్టాంప్‌ వేసి హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

VIDEOS

logo