శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Mar 27, 2020 , 22:39:58

నిత్యావసరాల ధరలపై నిఘా

నిత్యావసరాల ధరలపై నిఘా

  • జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ పర్యటన
  • పలు నిత్యావసర దుకాణాల తనిఖీ

లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వ్యాపారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ధరలపై ఆరా తీశారు. కూరగాయలు, కిరాణ వస్తువులను నిర్దేశించిన ధరలకే విక్రయించాలని సూచించారు.

నల్లగొండ, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాప్తి నియంత్రణ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ చేపట్టిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించకుండా నివారించడానికి జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పట్టణంలోని ఎన్జీ కళాశాల వద్ద పండ్ల మార్కెట్‌, ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కిరాణషాపులు, వీటీకాలనీలో షాపులు, చెక్‌పోస్టును పరిశీలించి పలు దుకాణాలను తనిఖీ చేశారు. అదేవిధంగా మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును పరిశీలించి స్థానిక పోలీసులతో మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తాసిల్దార్‌ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. 

ఎంజీయూలో కరోనా క్వారంటైన్‌ కేంద్రం

మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని బాయ్స్‌ హాస్టల్‌లో కరోనా క్వారంటైన్‌ కేంద్రాన్ని వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 25పడకలతో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ను శుక్రవారం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి కరోనా అనుమానితులు ఉండేందుకు అన్నిసౌకర్యాలు కల్పించాలన్నారు. వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది రోస్టర్‌ వారీగా విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ప్లెక్సీ ఏర్పాటు చేసి ఆయా శాఖల అధికారులు, నోడల్‌ అధికారుల ఫోన్‌ నెంబర్లను ఇందులో పొందు పరిచారని సూచించారు. ఆయన వెంట ఏసీ రాహుల్‌శర్మ, డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, షెడ్యూల్‌ కులాల డీడీ, క్వారంటైన్‌ కేంద్ర నోడల్‌ అధికారి రాజ్‌కుమార్‌, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌, నల్లగొండ, నార్కట్‌పల్లి తాసిల్దార్లు నాగార్జునరెడ్డి, రాధ, డాక్టర్‌ పుల్లారావు పాల్గొన్నారు. 

రూ.1.58కోట్ల విలువైన పనులకు ఉత్తర్వులు

2018-19 ఆర్థిక సం వత్సరానికి దేవరకొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.1.58కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ శుక్రవారం పరిపాలన అనుమతులు ఇచ్చారు. దేవరకొండ మున్సిపాలిటీలో ఈ నిధులతో ఏడు పనులు చేయాలని కలెక్టరేట్‌లో జరిగిన ఆర్థిక సంఘం కమిటీ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. రూ.60లక్షలతో డంపింగ్‌యార్డు పనులు, రూ.12 లక్షలతో చెత్తబుట్టల కొనుగోలు, రూ. 20లక్షలతో పొడిచెత్త సేకరణ పనులు చేపట్టాలన్నారు. అదేవిధంగా రూ.36లక్షలతో హైడ్రాలిక్‌ ఆటోల కొనుగోలు, రూ.30లక్షలతో స్వర్ణముఖి వరదనీటి కాల్వ పునర్నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో ఏసీ రాహుల్‌శర్మ, సీపీఓ ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ తిరుపతయ్య, రోడ్డు రవా ణాధికారి వెంకట్‌రెడ్డి, పబ్లిక్‌హెల్త్‌ డీఈ రాములు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo