బుధవారం 03 మార్చి 2021
Yadadri - Mar 26, 2020 , 23:15:16

నాలుగో రోజు లాక్‌డౌన్‌

నాలుగో రోజు లాక్‌డౌన్‌

  • ఇండ్లకే పరిమితమైన జనం..
  • పలు గ్రామాల్లో బియ్యం పంపిణీ
  • సామాజిక దూరం పాటించి నిత్యావసర
  •  సరుకులు కొనుగోలు 

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : నాలుగో రోజు లాక్‌డౌన్‌ విజయవంతమయ్యింది. చౌటుప్పల్‌లోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. మెడికల్‌ షాపులు, దవాఖానలు మాత్రమే తెరిచి ఉంచారు. కిరాణ షాపులు, పెట్రోల్‌ బంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించి నిత్యవసర సరుకుల కొనుగోలు, పెట్రోలు పోయించుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పకడ్బందీగా పెట్రోలింగ్‌ నిర్వహించారు. చౌటుప్పల్‌, తంగడపల్లి, లక్కారం, తాళ్లసింగారం, లింగోజీగూడెం గ్రామాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటికి రావొద్దని ప్రజలకు సూచనలు చేశారు. ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వారిపై ఆరా తీస్తూ ఎవరైన వస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చిన వారిని మాత్రమే తమ గ్రామాలకు వెళ్లేందుకు అనుమతించారు. హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న వాహనాదారులను అనుమతించలేదు. 

రేషన్‌ బియ్యం పంపిణీ హర్షణీయం..

లాక్‌డౌన్‌లో భాగంగా తెల్లరేషన్‌ కార్డు దారులకు 12 కిలోల బియ్యాన్ని సీఎం కేసీఆర్‌ సరఫరా చేయడం హర్షణీయమని మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. గురువారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌ షాపుల ఎదుట సామాజిక దూరం పాటించి రేషన్‌ను తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. 

సంస్థాన్‌నారాయణపురంలో..

ఇతర ప్రాంతాల నుంచి మండలానకి వచ్చిన 30 మందిని వైద్యసిబ్బంది గుర్తించి వారిచేతులపై క్వారంటైన్‌ స్టాంపులు వేశారు. మండలంలోని లింగంవారిగూడెంలో ఇటీవల సౌతాఫ్రిక నుంచి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు చేసి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా అతని చేతిపై క్వారంటైన్‌ స్టాంపు వేసి ఇంట్లోనే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు. అదేవిధంగా అతని పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట, మోత్కూరు మండలాల్లో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగింది. 99 శాతం జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా వ్యాప్తి నివారణపై ఆయా గ్రామాల సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించారు.

అడ్డగూడూరులో..

అడ్డగూడూరు : కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. దీంతో గురువారం అన్ని గ్రామాల్లో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. అదే విధంగా మండలంలోని వివిధ గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి చేతులకు ముద్రలు వేసినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు. ధర్మారం గ్రామంలో గ్రామ సర్పంచ్‌ ట్రాక్టర్‌కు మైక్‌ ఏర్పాటు చేసి కరోనా వైరస్‌పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో చౌళ్ళరామారంలోని రేషన్‌ షాపు వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా లేకుండా సామాజిక దూరాన్ని పాటించే విధంగా డీలర్లు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్‌ రామకృష్ణ రేషన్‌ షాపులను పరీశీలించి ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని గ్రామస్తులకు సూచించారు.

బియ్యం పంపిణీ..

మోత్కూరు : కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం అందజేస్తున్నదని మున్సిపల్‌ చైర్మపర్సన్‌ తిపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి అన్నారు. గురువారం మోత్కూరు మున్సిపల్‌ కేంద్రంలోని పోతాయిగడ్డలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతోపాటు వైరస్‌ వ్యాప్తి చెందకుండా స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం కోసం సీఎం కేసీఆర్‌ తన ఆలోచన విధానంతో ప్రతి కుటుంబానికి బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. అనంతరం కాశవారిగూడెంలో పలువురికీ మాస్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ పొరెడ్డి మనోహర్‌రెడ్డి, ఎంపీవో సురేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ వనం స్వామి, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ తిపిరెడ్డి మేఘారెడ్డి పాల్గొన్నారు.

రామన్నపేటలో..

రామన్నపేట : మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మొత్తం 30 రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 46,463 మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కక్కిరేణిలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, వివిధ గ్రామాల్లో సర్పంచులు బియ్యం పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు.

VIDEOS

logo