గురువారం 04 జూన్ 2020
Yadadri - Mar 25, 2020 , 22:46:15

‘లాక్‌డౌన్‌'కు సహకరించాలి

‘లాక్‌డౌన్‌'కు సహకరించాలి

  • వీధుల్లోకి కూరగాయలు తెచ్చేలా ఏర్పాట్లు 
  • విదేశాల నుంచి వచ్చిన 146మందిని స్వీయ నిర్బంధం చేశాం
  • త్వరలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
  • సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సమకూరుస్తున్నాం.. ప్రజలందరూ నిబంధనలు పాటించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీలో వీధుల్లోకి కూరగాయలు వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 146 మందిని గుర్తించామని.. వీరిలో 68 మంది సమాచారం రాష్ట్ర స్థాయి నుంచి అందగా.. మిగిలిన 78 మందిని అధికారులు గుర్తించినట్లు చెప్పారు. వీరంతా తమ ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని, ప్రతిరోజూ రెండుసార్లు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా ఫారెన్‌ రిటర్న్స్‌ ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. ఎవరు సహకరించకున్నా వారి పాస్‌పోర్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరమైతే 100 నెంబర్‌కు కాల్‌ చేస్తే సేవలు అందుతాయన్నారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు 4ఫీట్ల దూరంతో బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే దుకాణాలు మూసివేస్తామన్నారు. త్వరలోనే రైతులు పండించిన ధాన్యం చేతికి వస్తుండగా.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. 

ఎటివంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం

ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసుకూడా నమోదు కాలేదని, ఒకవేళ నమోదైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రతి గ్రామంలో మూడు కిలోమీటర్ల మేర బ్లీచింగ్‌ పౌడర్‌, ఇతర కెమికల్స్‌ చల్లడం, చెత్తను పూర్తిగా ఎత్తివేయిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు గ్రామాల్లో సర్వే నిర్వహించి 10 ఏళ్లలోపు 60 ఏళ్లకు పైబడిన వారిలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా అనే విషయాన్ని గుర్తిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌ కేసులు నమోదైతే అలాంటి వారికి తొందరగా కరోనా సోకే అవకాశం ఉన్నందున వారందరినీ ఐసోలేషన్‌కు తరలిస్తామన్నారు. జిల్లాలో ప్రైవేటు భవనాలను ఐసోలేషన్‌ కేంద్రాల కోసం గుర్తిస్తున్నట్లు, ఇప్పటికే ఇమాంపేట మోడల్‌ స్కూల్‌లో 300ల పడకలు, జనగాం రోడ్డులో 100 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.  logo