గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Mar 22, 2020 , 23:23:50

కదలని జనం.. కరోనాపై యుద్ధం

కదలని జనం.. కరోనాపై యుద్ధం

  • జిల్లా అంతటా జనతా కర్ఫ్యూ
  • రోడ్డెక్కని వాహనాలు.. వాడలన్నీ నిర్మానుష్యం 
  • మూతపడిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు
  • పక్కింటికి సైతం వెళ్లకుండా ఇండ్లకే పరిమితం
  • జనతా కర్ఫ్యూను నిరంతరం పర్యవేక్షించిన కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, 
  • సీపీ మహేశ్‌ భగవత్‌  

జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రధాన మంత్రి  మోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు జిల్లా ప్రజలు మద్దతు తెలిపారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం వరకు స్వీయ నిర్బంధంలోనే ఉండి తమకు తామే సాటి అని నిరూపించారు. కరోనా అంతుచూసే లక్ష్యంగా చేపట్టిన 24 గంటల బంద్‌తో జిల్లా అంతా నిర్మానుష్యంగా మారింది. అన్ని రకాల వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోల్లోనే ఆగిపోయాయి. అంబులెన్స్‌లు, అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేశాయి. శనివారం అర్ధరాత్రి నుంచే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు మినహా ఇతరులెవ్వరూ రోడ్డెక్కలేదు. పాలు, కూరగాయలు, నిత్యవసరాలను సైతం ముందే సమకూర్చుకున్న నేపథ్యంలో ఆదివారం పిల్లాపాపలతో అందరూ ఇళ్లలోనే గడిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి సహా ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు సైతం ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, సీపీ మహేశ్‌ భగవత్‌, అదనపు కలెక్టర్లు జి.రమేశ్‌, కీమ్యానాయక్‌, భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి జనతా కర్ఫ్యూను పర్యవేక్షించారు. మరోవైపు వైద్యారోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా సాయంత్రం ఐదు గంటలకు స్థానికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఇండ్లముందు నిలబడి చప్పట్లు కొట్టారు.  

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: జనతా కర్ఫ్యూకు జిల్లా ప్రజలు మద్దతు పలికారు. స్వీయనిర్బంధం ప్రకటించి తామంతా ఒక్కటేనని చాటిచెప్పారు. దీంతో రోడ్లు ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. అసలు ఇక్కడ జనాలు ఉంటారా అన్న అనుమానం కలిగే విధంగా ప్రజలు బంద్‌కు చేయూతను అందించారు. అన్ని రకాల వాణిజ్యవ్యాపార సంస్థలు బంద్‌ చేసి పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌లు ఇచ్చిన పిలుపుకు అండగా నిలబడ్డారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అదనపు కలెక్టర్లు రమేశ్‌, కీమ్యానాయక్‌, భువనగిరి ఆర్డీవోఎంవీ భూపాల్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డిలు కర్ఫ్యూను పర్యవేక్షించారు. ఎన్ని పనులు ఉన్నా వాయిదా వేసుకుని ఇండ్లలో టీవీలు, క్రీడలకు పరిమితమయ్యారు. యాదగిరిగుట్ట ప్రధాన రహదారి పూర్తి నిర్మానుష్యంగా మారింది. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలోని బస్సులు పూర్తిగా డిపోకే పరిమితమయ్యాయి. పోలీసులు, అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది తమ విధులు నిర్వర్తించి, ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా బస్టాండ్‌, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ప్రజలులేక బోసి పోయాయి.  ప్రజలు, వ్యాపారులు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ నాయకులు జనతా కర్ఫ్యూకు మద్దతుగా నిలిచారు. వలిగొండ మండల కేంద్రంలోని రహదారుల్లో ద్విచక్రవాహనదారులను విచారించి సరైన ధ్రువపత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలను జిల్లా రవాణా శాఖ అధికారి వై.సురేందర్‌రెడ్డి సీజ్‌ చేశారు. 

సీపీ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణ..

రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ జిల్లాలో జనతా కర్ఫ్యూను పర్యవేక్షించారు. పరిస్థితిపై డీసీపీ నారాయణరెడ్డిని ఆరాతీశారు. ఏసీపీలు భుజంగరావు, కోట్ల నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలోని పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. 

అంత్యక్రియలు నిలిపివేత..

భువనగిరి మండలంలోని చీమలకొండూరులో గ్రామానికి చెందిన కర్కి నర్సింహ(70) అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు.  జనతాకర్ఫ్యూ కారణంగా కుటుంబ సభ్యులు నర్సింహ అంత్యక్రియలను నిలిపివేశారు. 

 పంతంగి టోల్‌ప్లాజా వెలవెల..

జనతా కర్ఫ్యూతో చౌటుప్పల్‌ జాతీయ రహదారి బోసిపోయింది. పంతంగి టోల్‌ప్లాజా వాహనాలు లేక వెలవెలబోయింది. చౌటుప్పల్‌ డివిజన్‌ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను ఆర్డీవో సూరజ్‌కుమార్‌ పర్యవేక్షించారు. 

స్వీయనిర్బంధంలో ప్రముఖులు..

పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన 24 గంటల కర్ఫ్యూలో ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత,  టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, శాసనమండలి విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డిలు స్వీయ నిర్బంధంలో గడిపారు. ఉదయం నుంచి తమ పిల్లాపాపలతో ఆడుతూ పాడుతూ గడిపారు. వైద్యారోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా కుటుంబసభ్యులతో కలిసి ఇండ్ల నుంచి బయటకు వచ్చి  చప్పట్లు కొట్టారు. 

క్లాప్‌ ఫర్‌ సర్వీస్‌..

సాయంత్రం 5 గంటలకు క్లాప్‌ ఫర్‌ సర్వీస్‌లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్ల ముందు నిలబడి  చప్పట్లు కొట్టి వివిధ రకాల సేవలు అందిస్తున్న వారిని అభినందించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు రమేశ్‌, కీమ్యానాయక్‌ ఇతర అధికారులు చప్పట్లు కొట్టారు. ఇండ్లకే పరిమితమైనవారు విధులు నిర్వహిస్తున్న వారికి జైకొట్టిన తీరు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది. 

బీబీనగర్‌ ఎయిమ్స్‌కు అనుమానితుడు..

కరోనా వైరస్‌ బాధితుడు అనే అనుమానంతో ఓ  వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. ఆస్ట్రేలియా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వచ్చిన అతడు కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ఏపీ సంపార్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా.. భువనగిరి పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో చేతికి ఉన్న ముద్రను గమనించిన అధికారులు వెంటనే ఆంబులెన్స్‌ సహాయంతో బీబీనగర్‌ ఎయిమ్స్‌కు తరలించారు. 

VIDEOS

logo