స్వీయ నిర్బంధానికి సిద్ధం

- జనతా కర్ఫ్యూలో పాల్గొంటామంటున్న జిల్లా జనం
- ఆదివారం మొత్తం ఇండ్లకే పరిమితం కానున్న స్థానికులు
- కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
- ఆర్టీసీతో పాటు ప్రైవేట్ వాహనాలన్నీ బంద్
- కర్ఫ్యూకు జిల్లా ప్రజలు సహకరించాలి
- కలెక్టర్ అనితారామచంద్రన్
కరోనా అంతు చూసేందుకు జిల్లా ప్రజలు స్వీయ నిర్బంధానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇండ్లకు పరిమితమై జనతా కర్ఫ్యూను వందశాతం సక్సెస్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు, దేవాలయాలు, రెస్టారెంట్లు, సినిమా టాకీసులు మూత పడిన విషయం తెలిసిందే. అయితే జనతా కర్ఫ్యూకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే జనతా కర్ఫ్యూపై వివిధ పద్ధతుల ద్వారా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రజా రవాణా దగ్గరి నుంచి మద్యం షాపులు, పెట్రోలు బంక్‌లను బంద్ చేయనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన జనతా కర్ఫ్యూకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఆదివారం స్వీయ గృహ నిర్బంధానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని అన్ని సేవలు రద్దయ్యాయి. అత్యవసర సేవలు అందించేందుకు గుట్ట ఆర్టీసీ డిపోలో ఐదు బస్సులను మాత్రమే అందుబాటులో ఉంచారు. జిల్లా ప్రజలంతా పూర్తి సంఘీభావంతో కర్ఫ్యూను విజయవంతం చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు కలెక్టర్ రమేశ్ పిలుపునిచ్చారు.
24 గంటలు..
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన 14 గంటల జనతా కర్ఫ్యూ తరహాలో రాష్ట్రంలో 24 గంటలపాటు కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు స్వీయ గృహ నిర్బంధం చేసుకోవాలన్నారు. కొంత కష్టమైనా ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజలు సహకరించాలని కోరారు. దీనికి ప్రజల నుంచి సానుకూలత లభిస్తున్నది. పలువురు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని చొరవను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, తదితర జనసమూహ సముదాయాలకు బంద్ ప్రకటించింది.
ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప..
ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప అన్ని రకాలైన కార్యకలాపాల రద్దుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆ దిశగా అధికారులు సమాయత్తమవుతున్నారు. పలు సంఘాలు, సంస్థలు ఇప్పటికే జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపాయి. ప్రజారవాణా దగ్గరి నుంచి మద్యం అమ్మకాల వరకు, పెట్రోల్ బంక్, హోటళ్లు, మార్కెట్లు మొత్తం బంద్ కానున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో తమ దైనందిన వస్తువుల కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రైళ్లు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. వ్యాపారులు, దుకాణాదారులు జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీంతో వ్యాపార సముదాయాలు మూత పడనున్నాయి. జిల్లాలోని అన్ని దేవాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ వరకు ఆర్జీత సేవలు, స్వామివారి దర్శనాలను బంద్ చేయగా.. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా దేవాలయం పూర్తిగా మూసేయాలని ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పూజలు చేయడానికి వీలులేదన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూ పై అధికారులు టాం.. టాం.. వేయించారు. పట్టణాల్లో మైకుల ద్వారా అవగాహన కల్పించారు.
110ఆర్టీసీ బస్సుల రద్దు..
కరోనా వైరస్ ప్రభావంతో ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. జిల్లాలోని యాదగిరిగుట్ట డిపోలోని 110 బస్సులను ఆదివారం రద్దు చేసి జనతా కర్ఫ్యూకు మద్దతు పలుకుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నదని ఆర్టీడీ డిపో మేనేజర్ రఘు తెలిపారు. ముఖ్యంగా డిపో నుంచి హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, శ్రీశైలంతో పాటు వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను వెళ్లే బస్సులను పూర్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజలు సహకరించాలి..
కర్ఫ్యూ ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు 6గంటల వరకు ఉంటుంది. ప్రజలు వందశాతం భాగస్వాములు కావాలి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కఠినమైనదైనా మన బాగు కోసమేనని గ్రహించాలి. ఆదివారం చేద్దామనుకున్న పనులన్నీ వాయిదా వేసుకోవాలి. ఇంట్లో ఉన్న మీరంతా డోర్, విండో కర్టేన్స్, మీరు వాడే బైక్‌లు, కార్లు, కీ బోర్డులు, టేబుల్స్ శుభ్రం చేసుకోవాలి. అత్యవసరమైన మెడికల్ కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
-అనితారామచంద్రన్, కలెక్టర్
కరోనా కట్టడికి చర్యలు..
కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రతి రెండు గంటలకు ఒక్కసారి ప్రభుత్వ దవాఖానలను శుభ్రం చేయిస్తున్నారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారు. శనివారం పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద ప్రతి విద్యార్థి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకొని వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. డీఈవో చైతన్యజైని ఆత్మకూర్, గుండాల, మోత్కూర్‌లోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
టీంల ఏర్పాటు..
ఆయా మండలాల్లో రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య శాఖలు, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందిని మండలానికి రెండు టీంలు, మున్సిపాలిటీకి ఒక టీంను ఏర్పాటు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి యుద్ధప్రాతిపదికపై హోం క్వారంటైన్ చేపట్టడంతోపాటు వారు ఎక్కడెక్కడ తిరిగారనే వివరాలను సేకరిస్తారు. ఈ విషయంలో బృందాలు జాయింట్ సర్వేలెన్స్ టీంలుగా పనిచేయనున్నారు. శానిటైజర్లు, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
14 రోజుల పాటు స్వీయ నిర్బంధం..
ఎవరికైనా క్వారంటైన్లో ఉంచిన వారికి వ్యాధి తీవ్రత, వ్యాప్తి చెందడంపై అవగాహన కలిగించి 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండేలా చూస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని కలెక్టర్ అనితారామచంద్రన్ అధికారులను హెచ్చరించారు. అధికారులు సిబ్బంది జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లకుండా అందుబాటులోనే ఉండేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఐసోలేషన్ వార్డులు..
ఆలేరు, చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానల్లో ఐసోలేషన్ వార్డులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గుర్తించి ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. నెల రోజుల పాటు గ్రామాల్లో, పట్టణాల్లో జాతరలు నిలిపివేయనున్నారు. జాతరలకు అనుమతులు ఇవ్వరాదని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజలు అధిక సంఖ్యలో ఫంక్షన్లు, వేడుకల్లో పాల్గొనరాదని, సామాజిక ఎడబాటును పాటించాలని సూచించారు. గ్రామాలకు వెళ్లే బృందాలు కూడా మాస్కులు, గ్లౌజులు ధరించాలన్నారు.
అనుమానితుడిని వైద్య పరీక్షలకు తరలింపు..
ఆలేరుటౌన్: కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఒక వ్యక్తిని ఆలేరు పోలీసులు అదుపులో తీసుకున్న సంఘటన ఆలేరు పట్టణంలో జరిగింది. ఆలేరు ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా డోర్నకల్ డివిజన్ రాములుతండా ఎన్నారం గ్రామానికి చెందిన భూక్యా నరేశ్(29) అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దుబాయ్ మీదుగా శనివారం ఉదయం 2.50 గం.లకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నరేశ్.. ప్రైవేటు టాక్సీలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. డోర్నకల్ వెళ్లేందుకు కృష్ణ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఆయన భువనగిరి సమీపంలో రైల్వే టీటీ అతని గురించి వివరాలు అడుగగా తాను అమెరికా నుంచి వస్తున్నానని డోర్నకల్ వరకు తీసుకున్న రైల్వే టికెట్ చూపించాడు. ఈ క్రమంలో నరేశ్ చేతి మీద విమానాశ్రయంలో వైద్యాధికారులు చేసిన పరీక్షల తాలూకు స్టాంప్ కనబడటంతో కంగారుపడిన రైల్వే టీటీ భువనగిరి రైల్వే పోలీసులు విషయం ఫోన్ ద్వారా తెలిపారు. పోలీసులు చేరుకునేలోపు రైలు భువనగిరి నుంచి ఆలేరుకు చేరుకున్నది. ఆలేరు పోలీసులు రైలు చివరిబోగిలో ఉన్న నరేశ్‌ను అదుపులో తీసుకున్నారు. పోలీసులు అతని చేతిమీద హోం క్వారైంటెన్ స్టాంప్ ముద్ర చూసి మోటకొండూరు వైద్యాధికారి రాజేందర్‌కు ఫోన్ చేశారు. నరేశ్‌ను పూర్తి వివరాలు అడిగిన అనంతరం అతనికి మాస్క్‌లు, దుస్తులు ధరింపచేసి అంబులెన్స్‌లో సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు పూర్తిస్థాయి పరీక్షల నిమిత్తం తరలించారు.
సామాజిక బాధ్యత కలిగి ఉండాలి కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి, నమస్తే తెలంగాణ :కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై జనతా కర్ఫ్యూపై దిశానిర్దేశం చేశారు. సమష్టి కృషితోనే కరోనాను ఎదుర్కోగలమని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖలు, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందిని మండలానికి రెండు, మున్సిపాలిటీలకు ఒక టీంగా ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి యుద్ధప్రాతిపదికపై హోం క్వారంటైన్ చేపట్టాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చి ఎవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. అనే వివరాలను సేకరించాలన్నారు. ఈ విషయంలో బృందాలు జాయింట్ సర్వేలైన్స్ టీంలుగా పని చేయాలని ఆదేశించారు. శానిటైజర్లు, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొరత ఉంటే వెంటనే కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్వారంటైన్లో ఉంచిన వారికి వ్యాధి తీవ్రత, వ్యాప్తి చెందడంపై అవగాహన కలిగించి 14 రోజుల పాటు స్వీయ రక్షణలో ఉండేలా చూడాలన్నారు. అధికారులు ఈవిషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. లక్షణాలు కనిపిస్తే కేవలం చేతులు శుబ్రపర్చుకొండి అని చెప్పడం సరికాదని.. 14 రోజుల పాటు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. యువత కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు, సిబ్బంది హెడ్క్వార్టర్లు విడిచి వెళ్లకుండా అందుబాటులో ఉండాలన్నారు. ఎమర్జెన్సిగా భావించి వ్యాధి తీవ్రతపై సీరియస్‌గా పనిచేయాలన్నారు. జిల్లాలో ముందస్తుగా ఆలేరు, చౌటుప్పల్ దవాఖానల్లో సరిపడా పడకలతో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసుకోవాలని, అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కూడా గుర్తించి ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు గ్రామాలు, పట్టణాల్లో జరిగే జాతరలకు అనుమతులు ఇవ్వరాదని అధికారులకు సూచించారు. జాతరలు జరిగే వివరాలు నమోదు చేసుకుని పర్యవేక్షించాలని కోరారు. బృందాలు నియమించిన పిదప శిక్షణ కార్యక్రమాల ద్వారా తొలుత అవగాహన కలిగించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, కీమ్యానాయక్, డీసీపీ నారాయణరెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి సురేందర్‌రెడ్డి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య అధికారులు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.
జనతాకర్ఫ్యూను విజయవంతం చేయాలి
- కరోనా వైరస్ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
భువనగిరి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్ విస్తరించకుండా చేపట్టిన ముందుస్తు చర్యల్లో భాగంగా ఆదివారం జనతాకర్ఫ్యూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కోరారు. ప్రధాని నరేంద్రమోదీ కరోనా నియంత్రణలో భాగంగా జనతాకర్ఫ్యూలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు, పోలీస్ అధికారులకు తగు ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ల శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా వైరస్ వేగవంగా వ్యాపిస్తున్న దృష్ట్యా అధికారులు అన్ని నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ చేపట్టాలన్నారు. అందుకు ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో జనతా కర్ఫ్యూ నిర్వహణపై టాం టాం వేయించడంతోపాటు మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు జనతా కర్ఫ్యూ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి 14రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉంచి పర్యవేక్షించాలని సూచించారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి జాయింట్ సర్వేలైన్స్ ద్వారా గ్రామస్తుల సహకారంతో వారిని పర్యవేక్షించడం ద్వారా వ్యాధి విస్తరించకుండా చూడాలని అధికారులను కోరారు. జిల్లాలో సరిహద్దులు, చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. అవసరాలను బట్టి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్ వార్డులు సిద్ధ్దం చేసి ఉంచుకోవాలని ఆయన వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన జిల్లాకు చెందిన వారిని రాష్ట్ర స్థాయిలోనే 16 మందిని గుర్తించగా, జిల్లాలో ఇప్పటి వరకు మరో 47మందిని గుర్తించి హోం క్వారంటైన్ చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో 50 థర్మల్ స్కానర్లు కొనుగోలు చేశామని కలెక్టర్ తెలిపారు. జనతాకర్ఫ్యూ నిర్వహణకై జిల్లా వ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకున్నామని ప్రజలకు ముందస్తు అవగాహనకై టాం టాం చేపట్టినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు రమేశ్, కీమియానాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి సురెందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
- ఫాతిమా జంక్షన్లో పీవీ కాంస్య విగ్రహం
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- హంగ్ వస్తే బీజేపీతో దీదీ దోస్తీ: ఏచూరి
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం