శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Mar 20, 2020 , 23:46:07

కరోనాపై యుద్ధం

కరోనాపై యుద్ధం

  • జిల్లా అంతటా కట్టుదిట్టమైన చర్యలు  
  • అన్ని శాఖలను సమన్వయం చేస్తున్న  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ 
  • యాదాద్రిలో దర్శనం నిలిపివేత
  • పోచంపల్లిలో మాస్కులు ధరించి పెండ్లి చేసుకున్న వధూవరులు 
  • పెరిగిన శానిటైజర్స్‌, హ్యాండ్‌వాష్‌ వినియోగం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా  అధికార యంత్రాంగం  అప్రమత్తమైంది. ప్రజలు కూడా ఆ దిశగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటికెళ్లే వారు మాస్కులు ధరిస్తున్నారు.. హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లు వాడుతున్నారు. శుక్రవారం నుంచి ఈనెల 31వతేదీ వరకు  యాదాద్రిలో భక్తుల దర్శనం నిలిపివేశారు. కరోనా భయం తో పోచంపల్లిలో నూతన వధూవరులు మాస్కులు ధరించి పెండ్లి చేసుకున్నారు.  దుబాయి నుంచి నాలుగు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు పోచంపల్లి మండలం ఇంద్రియాల, రేవణపల్లి గ్రామాలకు వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న అధికారులు వారి వివరాలు తెలుసుకుని క్వారంటైన్‌లో ఉంచారు.  తుర్కపల్లి మండలం మోతీరాంతండా, బద్దుతండాల్లో కలకలం చెలరేగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తిరిగి తండాలకు చేరుకున్నారు.  దాంతో వారి నుంచి రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు పంపించారు.  

-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ 

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాదాద్రి ఆలయంలో దర్శనాలు శుక్రవారం నంచి బంద్‌ చేశారు. కరోనా భయంతో పోచంపల్లిలో నూతన వధూవరులు మాస్కులు ధరించి వివాహం చేసుకున్నారు. దుబాయి నుంచి నాలుగు రోజుల కిత్రం నలుగురు వ్యక్తులు ఇంద్రియాల, రేవణపల్లి గ్రామాలకు వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న అధికారులు వారి వివరాలు తెలుసుకుని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. తుర్కపల్లి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా తిరిగి తమ తమ తండాలకు రాగా కరోనా భయంతో మోతీరాంతండా, బద్దుతండాల్లో కలకలం చెలరేగింది. దీంతో వారి నుంచి రక్తనమూనాలను సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు పంపించారు.

యాదాద్రి ఆయలంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు..

కరోనా మహమ్మారి దరిచేరకుండా యాదాద్రి ఆలయ సిబ్బంది కరోనా వైరస్‌పై యుద్ధం ప్రకటించారు. రోజురోజుకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు ఈ నెల 31వ తేదీవరకు స్వామివారి దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. యాదాద్రి కొండపై భక్తులను అనుమతించలేదు. యాదాద్రికొండపై పనిచేసే దేవస్థాన సిబ్బందికి మాస్క్‌లను అందజేశారు. ప్రతి ఉద్యోగిని థర్మామీటర్‌తో శరీర ఉష్ణోగ్రతను పరిక్షించిన అనంతరం విధులకు అనుమతిచ్చారు. దేవస్థానం మూసివేసిన సందర్భంగా దేవస్థాన ప్రసాద విక్రయశాఖ నందు నిల్వ ఉంచిన 20 వేల లడ్డూలను యాదాద్రి కొండకింద స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద భక్తులకు ఉచితంగా అందజేశారు. 

ఇదే మొదటిసారి..

యాదాద్రి ఆలయ చరిత్రలో భక్తుల దర్శనం లేకుండా ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహించడం ఇదే మొదటిసారని అర్చకులు పేర్కొన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ససమర్ధనీయంగా ఉందని ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు చెప్పారు. తనకు తెలిసి యాదాద్రి చరిత్ర 150 ఏండ్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా శ్రీవారి బాలలయం, పాతగుట్ట ఆలయం, శివాలయంలోనికి భక్తులను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. 

తుర్కపల్లి మండలంలో కలకలం..

తుర్కపల్లి మండలంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన పలువురు వ్యక్తులు కలకలం సృష్టించారు. మండలంలోని మోతిరాంతండా, మల్కాపూర్‌ తండా, బద్దుతండాలకు చెందిన పలువురు వ్యక్తులు విద్య, ఉపాధి కోసం వెళ్లి శుక్రవారం తమ స్వగ్రామానికి తిరిగివచ్చారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బంది హుటాహూటిన గ్రామాలకు వెళ్లి, వారిని పరీక్షించారు. వారి నుంచి వివరాలు సేకరించారు. కరోనా ప్రభావం దృష్ట్యా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారి నుంచి రక్తనమూనాలను సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు పంపుతామని వైద్యాధికారులు తెలిపారు. 

ఎర్రంబెల్లిలో దుర్గమ్మ పండుగ రద్దు..

భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లిలో మూడేండ్ల కోసారి జరిగే దుర్గమ్మ పండుగ శని, ఆదివారాల్లో జరుగాల్సి ఉన్నది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగను వాయిదా వేస్తూ గ్రామపంచాయితీ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. 

మాస్కులు ధరించి వివాహం..

పోచంపల్లి మండలంలో ఓ వధూవరులు మాస్కులు ధరించి వివాహం చేసుకున్నారు. గత వారం రోజులుగా  కలెక్టర్‌ అనితారాచమచంద్రన్‌ సైతం వారి వివాహం విషయంలో చొరవతీసుకొని ఎక్కువ మంది వివాహానికి  హాజరుకాకుండా చూసుకోవాలని సూచనలు చేశారు. దీంతో వారి వివాహం నిరాడంబరంగా పోచంపల్లిలో జరిగింది. పెళ్లి తంతు నిర్వహించిన పురోహితుడి దగ్గర నుంచి బంధువులందరూ మాస్కులు ధరించి వివాహంలో పాల్గొనడం విశేషం. 

దుబాయి నుంచి వచ్చిన 15 మంది ఉద్యోగులు ..

బీబీనగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లిలో హిందువేర్‌ శానిటరీ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ బ్రాంచ్‌ దుబాయి దేశంలో కూడా ఉన్నది. భట్టుగూడెం, బ్రాహ్మణపల్లి, ఇంద్రియాల, రేవణపల్లి తదితర గ్రామాలకు చెందిన 35 మంది దుబాయ్‌లోని ఈ కంపెనీలో పని చేస్తున్నారు. వారిలో కొంతమంది ఈ నెల 12 నుంచి 15 తేదీల మధ్యలో తమ తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. వచ్చిన వారు ఎవరికి విషయం చెప్పకపోవడంతో బయటకు తెలియలేదు. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు కొంత మంది ఫిర్యాదు చేయడంతో విషయం వెల్లడైంది. వీరిలో ఒక వ్యక్తి వచ్చినప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలియడంతో బీబీనగర్‌ ఎస్సై ఆధ్వర్యంలో మెడికల్‌ ఆఫీసర్ల బృందం గ్రామానికి వెళ్లి అన్ని రకాల పరీక్షల నిర్వహించి వారికి ఎలాంటి కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  

విదేశాల నుంచి వచ్చేవారి సమాచారం అందించాలి

భూదాన్‌పోచంపల్లి : కరోనాను నిరోధించే చర్యల నేపథ్యంలో విదేశాల నుంచి గ్రామాలకు వచ్చేవారి వివరాలను రెవెన్యూ, పోలీస్‌ అధికారులతోపాటు మున్సిపల్‌ కమిషనర్‌కు అందించాలని తహసీల్దార్‌ గుగులోతు దశరథనాయక్‌ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల దుబాయ్‌ నుంచి మండలంలోని ఇంద్రియాలకు వచ్చిన ముగ్గురికి వైద్య పరీక్షలు చేశామన్నారు. అలాగే పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రేవణపల్లికి చెందిన ఓ వ్యక్తి కూడా దుబాయ్‌ నుంచి తన స్వగ్రామానికి వచ్చాడని అతడికి కూడా వైద్యపరీక్షలు చేశామన్నారు. ఈ నలుగురికీ కరోనా లక్షణాలు లేనందున వారిని తమ ఇండ్లలోనే ఉంచి 14 రోజుల పాటు పరీక్షిస్తున్నామని తెలిపారు. వారికి ఉదయం సాయంత్రం వైద్యపరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశామన్నారు. గ్రామానికి ఎవరైనా విదేశాల నుంచి వస్తే తప్పక సమాచారం ఇవ్వాలని కోరారు. దీని ద్వారా కరోనా వ్యాప్తిని నివారించే అవకాశం కలుగుతుందన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ శోభ, నరేందర్‌చారి, వీఆర్వోలు ఉన్నారు. 

చైనా నుంచి వచ్చిన విద్యార్థికి వైద్యపరీక్షలు..

చౌటుప్పల్‌ రూరల్‌ : విదేశాలనుంచి వచ్చిన పట్టణకేంద్రానికి చెందిన  ఓ విద్యార్థికి  శుక్రవారం వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా వైరస్‌ సోకలేదని తెలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  వివరాలోకి వెళ్లితే విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రెవెన్యూ, వైద్యాధికారులు సర్వే చేస్తుండగా  పట్టణకేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని చైనాలో ఎంబీబీఎస్‌ చేయడానికి వెళ్లి గత నెల 28న ఇక్కడికి వచ్చినట్లు తేలింది. ఇటీవల ఆమె కొద్దిగా అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఫలితాల్లో ఆమె ఎలాంటి కరోనా వైరస్‌ సోకలేదని తేలింది. అయినప్పటికీ కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావొద్దని వైద్యులు ఆమెకు సూచించారు. 

ప్రజలు గుమికూడటం మానుకోవాలి.. 

ప్రజలు గుమికూడటం మానుకోవాలి. ఈ వారం రోజులు ఎంతో సమన్వయంతో ప్రజలు సహకరించాలి. ఇతర దేశాల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు రెవెన్యూ సిబ్బందికి లేదా గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్‌, ఇతర ప్రభుత్వ సిబ్బందికి తెలియజేయాలి. వారి నుంచి ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం వస్తుంది. పండుగలు, పంచాంగశ్రవణం, జాతరలు మానుకోవాలి. గ్రామాల్లో గ్రామ దేవతల పండుగలు వాయిదా వేసుకోవాలి. 

-అనితారామచంద్రన్‌, కలెక్టర్‌


logo