శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Mar 20, 2020 , 23:44:21

ఆన్‌లైన్‌.. పర్మిషన్‌..

ఆన్‌లైన్‌.. పర్మిషన్‌..

  • మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు కొత్తచట్టం ప్రకారం అనుమతులు 
  • ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌- బీపాస్‌ అమలు
  • 75 చదరపు గజాల భవనానికి రిజిస్ట్రేషన్‌
  • 500 చదరపు గజాల వరకు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌
  • 500  చదరపు గజాలు దాటితే 21 రోజుల్లో అనుమతి

మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులను సరళీకరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. అనుమతుల కోసం ఆయా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవ సరం లేదు. ఇక నుంచి అన్ని అనుమతులు ఒకే చోట ఈజీగా లభించనున్నాయి. టీఎస్‌- బీపాస్‌(తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం) విధానా నికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం నూతన భవనాలకు అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆన్‌లైన్‌ ద్వారా కొనసాగే ఈ విధానం ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానున్నది. దీనికి అనుగుణంగా భవన నిర్మాణ అనుమ తులు సకాలంలో జారీ చేసేందుకు బల్దియా యంత్రాంగం చర్యలు చేపట్టింది.  పట్టణాల్లో కూడా అక్రమ కట్టడాలపై  ప్రభుత్వం నిఘా పెట్టనున్నది.  

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా టీఎస్‌-బీపాస్‌ను తీసుకొస్తున్నది. దీనికి ప్రకారం 21 రోజుల్లో అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి కారణాలు చూపకుండా 21 రోజుల్లో అధికారులు అనుమతి ఇవ్వకపోయినా..  అనుమతి ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ పరిధిలో ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టడానికి.. జీ ప్లస్‌-2 భవనాన్ని నిర్మించడానికి అనుమతుల కోసం ఇక నుంచి ఆయా ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. వచ్చేనెల 2వ తేదీ నుంచి అన్నీ అనుమతులు ఒకే చోట సులభంగా లభించనున్నాయి. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులను సరళీకరిస్తూ కొత్త చట్టం తెచ్చిన ప్రభుత్వం.. దాని ప్రకారం భవనాలకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. టీఎస్‌- బీపాస్‌(తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిపికేషన్‌ సిస్టమ్‌) విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం నూతన భవనాలకు అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆన్‌లైన్‌ ద్వారా కొనసాగే ఈ విధానం ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానున్నది. దీనికి అనుగుణంగా భవన నిర్మాణ అనుమతులు సకాలంలో జారీ చేసేందుకు బల్దియా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పట్టణంలో అక్రమ కట్టడాలపై కూడా నిఘా పెట్టనున్నది.  

సులభంగా అనుమతులు..

75 చదరపు గజాల నుంచి 500 చ.గ వరకు, ఆపైన రిజిస్ట్రేషన్ల అనుమతులు పొందాలంటే టీఎస్‌-బీపాస్‌ కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 75 చ.గ స్థల విస్తీర్ణంలో నివాస భవనం నిర్మించాలనుకుంటే రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని కేవలం రూపాయి నామమాత్రపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా తక్షణమే రిజిస్ట్రేషన్‌ జారీ చేస్తారు. 75 నుంచి 200 చ.గ విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టేందుకు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ (స్వీయ ధ్రువీకరణ పత్రం) తప్పనిసరి. తమ వద్ద ఉన్న అన్ని డాక్యూమెంట్లతో మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని సంప్రదించకుండానే ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్మాణ అనుమతి పొందేందుకు అవకాశం ఉంటుంది. 200 చ.గ నుంచి 500 చ.గ వరకు ఎవరైనా బిల్డింగ్‌ ప్లాన్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే తక్షణమే అనుమతి మంజూరు చేస్తారు. కలెక్టర్‌ ద్వారా ఏర్పాటు చేయబడిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పరిశీలన చేసే సమయంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన వివరాలు తప్పుగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూలగొట్టడం లేదా జరిమానా విధించడం చేస్తారు. ఈ రెండు జరుగని పక్షంలో అ భవనానికి సీల్‌ వేయడం లేదా స్వాధీనం చేసుకోబడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రిపోర్టును కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేయనున్నారు.

21 రోజుల్లో అనుమతులు..

500 చ.గ విస్తీర్ణం కన్నా ఎక్కువగా ఉన్న ఫ్లాట్లలో భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రస్తుతం అనుమతులు పొందడం కష్టం. కానీ ఇక నుంచి ఆ నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు లభించనున్నాయి. అనుమతి కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం వివిధ శాఖల అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని అనుమతులు ఒకే దగ్గర లభించేలా టీఎస్‌-బీపాస్‌ ఉపయోగపడనున్నది. ఒకవేళ 21 రోజుల్లోగా అకారణంగా అనుమతి రాకుంటే 22వ రోజున అనుమతి ఇచ్చినట్లుగానే భావించి అధికారులు దరఖాస్తుదారుడికి సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, అక్రమ కట్టడాలపై నిఘా ఉంచేందుకు రహస్య వ్యవస్థను ఏర్పాటు చేసేలా మున్సిపల్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఈ వ్యవస్థ సమర్పించిన వివరాలపై ఏడు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వివరాలు సేకరించి యంత్రాంగానికి అందజేసే రహస్య వ్యవస్థకు రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించాలని భావిస్తున్నారు. కాగా, టీఎస్‌- బీపాస్‌ వచ్చే నెల 2 నుంచి అమల్లోకి రానుండటంతో దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఏటా 600 వరకు భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు వస్తుండగా.. ఇందులో 300 నుంచి 350 వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. 

ఏప్రిల్‌ 2 నుంచి అమలు..

మున్సిపల్‌ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్‌- బీపాస్‌ ఏప్రిల్‌ 2 నుంచి అమలు కానున్నది. ఇకనుంచి అనుమతులు సులభంగా లభించనున్నాయి. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ఇది అమలు కానున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇవ్వడమే ప్రధానమైన అంశంగా ముందుకు సాగుతాం.

  - అనితారామచంద్రన్‌, కలెక్టర్‌


logo