అయ్యా.. ఆదుకోరూ...

- న్యాయం చేయాలంటూ చౌటుప్పల్ ఆర్డీవో వద్దకు వచ్చిన వృద్ధ దంపతులు
- బాగోగులు చూడటం లేదంటూ కుమారులపై ఫిర్యాదు
- నడిచేందుకు చేతకాక ఆటోలో రాగా..
- కార్యాలయం బయటే వినతి స్వీకరించిన ఆర్డీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: సొంత గ్రామంలో పనిలేకపోవడంతో పక్క రాష్ర్టాలకు వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకొని కొడుకులను అల్లారుముద్దుగా సాకారు..తీరా 80 ఏండ్ల వయసులో బుక్కెడు బువ్వకోసం ఆ వృద్ధులు పోరాడుతున్నారు. వృద్ధాప్యంలో తమ బాగోగులు చూడాల్సిన కొడుకులు పట్టించుకోకపోవడంతో సోమవారం వారు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. వివరాలిలా ఉన్నాయి. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన వృద్ధులు పాలెం సత్తయ్య(80), అండాలు(75)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు బాలయ్య ఆరేండ్ల క్రితం మరణించాడు. రెండో కుమారుడు అంజయ్య దోతిగూడెం సమీపంలోని ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండగా..చిన్న కుమారుడు స్వామి వెల్లంకి గ్రామపంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె యాదమ్మను కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేశారు. గ్రామంలో పనిలేకపోవడంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి సత్తయ్య కుమారులను పోషించాడు.కష్టపడి పనిచేసి గ్రామంలో మూడు ప్లాట్లను సైతం కొనుగోలు చేసి ముగ్గురు కుమారులకు ఇచ్చాడు. ప్రభుత్వం మంజూరు చేసిన ఎకరం భూమి సైతం ఉంది. నాలుగు గదుల ఇల్లు ఉండగా..ఆ ఇంటిని చిన్న కుమారుడు స్వామికి రూ. 60వేలకు విక్రయించి కూతురు వివాహం చేశాడు. అందులోని ఓ గదిలో వృద్ధ దంపతులు ఉంటున్నారు. పెద్ద కుమారుడు మరణించడంతో ఇద్దరు కుమారులు సత్తయ్యను సాకాల్సి ఉంది. కొంత కాలం రూ. 500 చొప్పున ఇద్దరు కుమారులు సత్తయ్యకు చెల్లించారు. కానీ కొంత కాలంగా డబ్బులు ఇవ్వడం లేదు. తిండి సైతం పెట్టకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని సత్తయ్య , అండాలు దంపతులు సోమవారం గ్రామం నుంచి ఆటోలో ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఆటో నుంచి దిగి నడిచే పరిస్థితిలో వృద్ధులు లేరు. ఈ విషయం తెలుసుకున్న కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి ఆటో దగ్గరకు వచ్చి వృద్ధుల నుంచి వినతి పత్రం స్వీకరించారు. తమకు న్యాయం చేయాలని వెంకట్‌రెడ్డిని వారు వేడుకున్నారు. ఈవిషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని వృద్ధులకు భరోసా ఇచ్చారు. త్వరలో ఇద్దరు కుమారులకు నోటీసులు జారీ చేసి..వారిని ఆర్డీవో కార్యాలయానికి రప్పించి తగిన న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా వృద్ధుల పరిస్థితిని చూసిన ఆర్డీవో కార్యాలయం సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారు చలించిపోయారు.
తాజావార్తలు
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!