మంగళవారం 02 జూన్ 2020
Yadadri - Mar 15, 2020 , 01:18:42

అద్భుత ప్రగతి

అద్భుత ప్రగతి

ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండిన ఆలేరు, మోత్కూరు ప్రస్తుతం అద్దంలా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో రూపురేఖలు మార్చుకున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు చేపట్టిన ప్రగతి పనుల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాదయాత్రలు నిర్వహించారు. సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా ప్రభుత్వం ఆలేరుకు రూ.17.38 లక్షలు, మోత్కూరుకు 21 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు ప్రాధాన్యతా క్రమంలో పారిశుధ్యం, పచ్చదనం, శిథిలమైన ఇండ్ల తొలగింపు, ప్రమాదకరంగా మారిన ఇనుప స్తంభాల మార్పు లాంటి పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేశారు

  • ‘పట్టణ ప్రగతి’తో ఆలేరు, మోత్కూరు పట్టణాలకు నూతన శోభ
  • ఎన్నో ఏండ్ల నాటి సమస్యలు పరిష్కారం
  • పాదయాత్ర నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
  • వందశాతం పూర్తయిన ప్రగతి పనులు

ఆలేరుటౌన్‌-మోత్కూరు: ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండిన ఆలేరు ప్రస్తుతం అద్దంలా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో రూపు మార్చుకున్నది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు చేపట్టిన ప్రగతి పనుల్లో భాగంగా పట్టణంలోని 12 వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాదయాత్ర నిర్వహించారు. సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా ప్రభుత్వం ఆలేరుకు రూ.17.38 లక్షలు మంజూరు చేయగా అధికారులు ప్రాధాన్యతా క్రమంలో పారిశుధ్యం, పచ్చదనం, శిథిలమైన ఇండ్ల తొలగింపు, ప్రమాదకరంగా మారిన ఇనుప స్తంభాల మార్పు లాంటి పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేశారు. 


100 శాతం పనులు పూర్తి.. 

పట్టణాన్ని ప్రధానంగా పట్టిపీడిస్తున్న సమస్యలను గుర్తించిన అధికారులు వందశాతం పూర్తి చేశారు. ప్రతి వార్డులో నూతన విద్యుత్‌ లైన్లు, వీధుల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించారు. అంతేకాక 124 శిథిలమైన గృహాలు, 57 పొదల తొలగింపు, 75 విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, 89,150 మీటర్ల రోడ్ల పరిశుభ్రత, 65,300 మీటర్ల డ్రైనేజీల్లో మురుగు తొలగింపు, 65 ప్రాంతాల్లో బ్లీచింగ్‌, హరితహారం కింద 28,085 మొక్కల పెంపకాన్ని చేపట్టారు. మరోవైపు ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న డంపింగ్‌ యార్డు సమస్యలను అధికారులు పరిష్కరించారు. సర్వే నెం.844లో రెండు ఎకరాల భూమిని కేటాయించారు. సాయిగూడెంలోని శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దీంతో ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాగా స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


 పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు..

పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని నిర్ధిష్ట సమయంలో పనులు పూర్తి చేశారు. వార్డుల అభివృద్ధిలో భాగంగా ప్రతివార్డులో 4 కమిటీలు ఏర్పాటు చేసిన అధికారులు అభివృద్ధి పనుల్లో క్రియాశీలకంగా పని చేశారు. మున్సిపల్‌ సిబ్బందితో పాటు కౌన్సిలర్లు, సభ్యులు కూడా పలుగు, పార పట్టి పనుల్లో పాల్గొన్నారు. ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారంలో ముందున్నారు. ఈ ప్రగతి పనులను ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ కీమ్యానాయక్‌, భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, ఆలేరు మున్సిపల్‌ కమిషనర్‌ హనమంతప్రసాద్‌, ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.


పట్టణ ప్రగతిని నిరంతరం కొనసాగిస్తా..

పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూనే ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా ఆలేరును మార్చడమే నా ముందున్న లక్ష్యం. ఆలేరును సుందరనగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కలను నిజం చేసేలా పని చేస్తా. పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ పట్టణ ప్రగతిని నిరంతరం కొనసాగిస్తూ ఆలేరును అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తా. 

-వస్పరి శంకరయ్య, ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌


సంతోషంగా ఉంది..

‘పట్టణ ప్రగతి’లో ఆలేరు సుందరంగా మారడం సంతోషంగా ఉంది. ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ పట్టణ సమస్యలను పరిష్కరించుకున్నాం. ఎంతో అనుభవం ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది మాకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం. పట్టణ ప్రగతిని నిరంతరం కొనసాగిస్తే ఆలేరు పరిశుభ్రంగా ఉండటం ఖాయం. 

-మొరిగాడి మాధవి, ఆలేరు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ 


logo