శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Mar 10, 2020 , 00:03:44

పదికోసం సక్సెస్‌ మంత్ర...!!

పదికోసం సక్సెస్‌ మంత్ర...!!
  • తొలిమెట్టు.. తోడ్పాటుతో జై కొట్టు!
  • వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అడుగులు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: విద్యార్థుల్లోని నిరాసక్తతను తరిమేసి నూతనోత్తేజం నింపడం ద్వారా పదో తరగతి విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లా విద్యాశాఖ విద్యార్థులకు ‘సక్సెస్‌ మంత్ర’ కార్యక్రమాన్ని అమలు చేసి వారి వికాసానికి నాంది పలికింది. విద్యార్థుల మనస్సును దృఢపరిచేందుకు సక్సెస్‌ మంత్ర కార్యక్రమం ఎంతో ఊపునిచ్చింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం మంచి ఆలోచన, ఆత్మనిగ్రహం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటమనే సుగుణాలను పెంపొందించే బృహత్కార్యాన్ని నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్న మాటకు అంకురార్పణ జరిగింది. మీ ఆలోచనలే మీలో ధైర్యాన్ని నింపుతాయని విద్యార్థులకు భరోసా కలిగించారు. బోధన అంటే కేవలం కరిక్యులమే కాదు.. కరిక్యులమ్‌పై ఆసక్తిని పెంపొందించే అతి ముఖ్యమైన విద్యార్థి వ్యక్తిత్వ వికాసం చాలా అవసరమని మొదటిసారి జిల్లాలోని విద్యార్థిలోకం తెలుసుకునే ప్రయత్నం జరిగింది. పరీక్షలనగానే అభద్రతా భావానికి గురయ్యే వారిలో మార్పు తీసుకురావడం ద్వారా వారిలో చైతన్యం కలిగించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమం ఇతర జిల్లాలకు కూడా ఆదర్శమైంది. పదో తరగతి విద్యార్థుల్లో పరీక్షలంటే ఉండే భయాన్ని తొలగించడం.. వారిలోని ఆత్మన్యూనతను పారదోలడం లక్ష్యాలుగా జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని నిర్మాణాత్మక పాత్ర పోషించారు. 


జిల్లాలోని అన్ని మండలాలు కవర్‌ చేస్తూ జరిగిన ‘సక్సెస్‌ మంత్ర’ పేరుతో జరిగిన మోటివేషనల్‌ క్లాసెస్‌ విద్యార్థుల్లో గుణాత్మక మార్పునకు శ్రీకారం పలికింది. పేరొందిన సైకాలజిస్టులతో విద్యార్థులకు ఇంటరాక్షన్‌ ఏర్పాటు చేయడంతో జిల్లా విద్యాశాఖకు రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. భువనగిరి, చౌటుప్పల్‌, బీబీనగర్‌, మోత్కూర్‌ యాదగిరిగుట్ట, ఆలేరు, బొమ్మలరామారం, వలిగొండ, పోచంపలి,్ల రామన్నపేటతోపాటు ఈ నెల 12,13 తేదీల్లో రాజాపేట, వలిగొండల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మూడు నాలుగు మండలాల పదో తరగతి విద్యార్థులను కలిపి ఏర్పాటు చేసిన ‘సక్సెస్‌ మంత్ర’ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. భువనగిరిలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ స్వయంగా పాల్గొన్నారు. డీఈవో అధ్యక్షతన జరిగిన ప్రేరణ కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి గుణాత్మకమార్పును తెచ్చాయి. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ సౌజన్యంతో ఏర్పాటయిన ‘సక్సెస్‌ మంత్ర’ ఇప్పుడు ఉత్తమ ఫలితాలు తెచ్చేందుకు కారణం కానున్నదని విద్యావేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వర్‌రావు, సదాశివ, లింగరాజు, కృష్ణచైతన్య, సైదులు భావిస్తున్నారు. 


పదో తరగతి పరీక్షల కోసం..

పాఠశాల స్థాయిలో విద్యార్థులు భవితవ్యాన్ని తేల్చేవి, ఉన్నత విద్యకు బాటలు వేసేవి, పదో తరగతి పరీక్షలే... 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 19 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎనిమిది రోజుల వ్యవధి ఎంతో కీలకం. పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్థులకు తెలియని భయం మొదలవుతుంది. అన్ని సబ్జెక్టులు బాగా చదివినా.. ఆశించిన మార్కులు వస్తాయా..? లేదా..? అన్న సంశయం వారిని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించి. విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేసింది. సిలబస్‌ పూర్తి చేసిన ఉపాధ్యాయులు పునశ్చరణ తరగతులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 163 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు 3,369 మంది, బాలికలు 3,710 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 1,723 మంది బాలురు, 1,264 మంది బాలికలు పరీక్షలకు హాజరు కానున్నారు.  


వందశాతం ఉత్తీర్ణత కోసం..

వందశాతం ఉత్తీర్ణత సాధించాలని వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఇటీవల కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సూచనలతో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని ప్రత్యేక తరగతులు తీసుకునే విషయంలో డిసెంబర్‌ నుంచే వ్యూహాత్మకంగా ముందుకుసాగారు. ఉపాధ్యాయులు గతంలో కన్నా భిన్నంగా.. ఈ సారి ప్రత్యేక తరగతులను సమర్ధవంతంగా నిర్వహించారు. డీఈవో ఆకస్మిక తనిఖీలు కూడా ఉండటంతో పటిష్టంగా తరగతుల నిర్వహణ కొనసాగింది. అన్ని పాఠశాలల్లో డీఈవో సూచనలతో మొదలైన ప్రత్యేక తరగతులు మెరుగైన ఫలితాలను తెచ్చేందుకు దోహదపడనున్నాయి. సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉన్న చోట విద్యావలంటీర్లను నియమించి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించిన ప్రధానోపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థుల వివరాలు సేకరించారు. పదో తరగతిలో విద్యార్థుల సంఖ్య, వెనుకబడిన సబ్జెక్టు, ఉపాధ్యాయుల కొరత ఉందా..? విద్యార్థుల హాజరు శాతం తదితర వివరాలను విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ గ్రేడ్లు ఇస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గణితంలో వెనుకబడిన ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమీక్షించి, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. 


గ్రూపులుగా విభజించి...

పదో తరగతి విద్యార్థులు కూడా చదవడం, రాయడంలో తడబాటు పడుతున్నారని విద్యాశాఖ అంతర్గత తనిఖీల్లో తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులను వారి స్థాయిని బట్టి ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించి, వెనుకబడిన వారికి నోట్స్‌ రూపొందించి ఇస్తున్నారు. సులభమైన పద్ధతుల్ని సూచిస్తున్నారు. ఏ రోజుకారోజు పరీక్షలు నిర్వహిస్తూ.. విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తిస్తూ.. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిపై సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయులు చర్చించి దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నింటిపై పట్టు సాధించేందుకు ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. సైన్స్‌, గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. రెండుసార్లు సైక్రియాటిస్టులతో ఒత్తిడిని జయించే పద్ధతులపై శిక్షణ ఇప్పించారు. 


విద్యార్థుల్లో మార్పు కోసం..

పదో తరగతి విద్యార్థుల్లో మార్పు కోసం ‘సక్సెస్‌ మంత్ర’ను ఆయుధంగా ఉపయోగించుకున్నాం. యుద్ధంలో గెలవాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం అనేది గుర్తించిన ఫలితంగా సక్సెస్‌ మంత్ర ఊపిరిపోసుకున్నది. ప్రతి విద్యార్థికి జీవితంలో తొలిమెట్టులాంటిది. గ్రూపు డిస్కషన్‌కు ప్రాధాన్యం ఇస్తే అనుమానాలు నివృత్తి అవుతాయి. సక్సెస్‌ మంత్ర క్లాసుల వల్ల విద్యార్థుల్లో మానసికంగా ఎంతో మార్పు వచ్చింది. జిల్లా అంతటా మోటివేషనల్‌ క్లాసెస్‌ నిర్వహించడం ఇదే ప్రథమం.  

- చైతన్య జైని, డీఈవో, యాదాద్రి భువనగిరి


సర్కార్‌ బడి సత్తా చూపిస్తా..

పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి మాకు వివరిస్తున్నారు. ఉపాధ్యాయుల సూచనలు, వారు చెబుతున్న పాఠాలు ఒంటపట్టించుకుని పదికి పది పాయింట్లు సాధించి సర్కార్‌ బడి సత్తా చూపిస్తా... పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ కావాలో ప్రతీ ఉపాధ్యాయులు దగ్గరుండి చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే లేచి కఠినమైన పాఠాలను చదువుకోవడంతోపాటు ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నా. 

- జీ.మానస, పదో తరగతి, ప్రభుత్వ  బాలికల ఉన్నత పాఠశాల, యాదగిరిగుట్ట


లక్ష్యాన్ని సాధిస్తా..

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ‘సక్సెస్‌ మంత్ర’ నాలో ఆత్మాభిమానం పెంపొందించింది. సాధిస్తానా..? లేదా..? అనే డౌట్‌ నుంచి సాధించడమే నా లక్ష్యం.. అనే స్థాయికి చేరుకున్నా. ప్రతిరోజు పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో నేర్చుకున్న విద్య ఎంతగానో ఉపయోగపడుతున్నది. పది పాయింట్లు తెచ్చుకోవడమే కర్తవ్యంగా ముందుకుసాగుతున్నా. 

- కె.జగదీశ్‌, పదో తరగతి, ఎస్‌వీఎన్‌ హైస్కూల్‌, యాదగిరిగుట్ట


పది పాయింట్లు తెచ్చుకుంటా..

ఎంతో ఉత్సాహంతో డీఈవో నిర్వహించిన అవగాహన సదస్సుతో నా గ్రేడులో మార్పు రానున్నది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధిస్తాననే నమ్మకం నాకు కలిగింది. ప్రతీరోజూ ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. పాఠాలు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. విషయం అర్థం కాకపోతే.. ఒకటికి పదిసార్లు అడగాలని భరోసా ఇస్తున్నారు. కచ్చితంగా పది పాయింట్లు తెచ్చుకుంటా.

- ఏ.శివాని, పదో తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, యాదగిరిగుట్ట

VIDEOS

logo