శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Mar 09, 2020 , 02:02:22

సాగుకు సాయం

సాగుకు సాయం
  • ఆర్థిక లోటున్నా రైతుల రుణమాఫీకి పచ్చజెండా
  • రూ.25వేల లోపు రుణాలు ఒకే విడుతలో మాఫీ
  • రైతు సంక్షేమమే ధ్యేయంగా నిధుల కేటాయింపు
  • గ్రామాలు, పట్టణాల అభివృద్ధికీ బడ్జెట్‌లో పెద్దపీట
  • విద్య, వైద్యం, బీసీల సంక్షేమానికీ భారీగా నిధులు
  • రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా వాసుల హర్షం

సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. రూ.33,191.25 కోట్ల లోటున్నా అన్ని రంగాలకు పెద్ద పీట వేస్తూనే.. అన్నదాతల అభివృద్ధికి అధిక భాగం నిధులు కేటాయించింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించారు. రూ.25వేల లోపు రుణాలన్నీ ఒకే విడుతలో మాఫీ చేస్తామని.. ఎమ్మెల్యేల చేతుల మీదుగా నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేస్తామని మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. మొత్తం రూ.1,82,914కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టగా.. రైతు రుణమాఫీ కోసం రూ.6,225కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,83,916 మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సుమారు 60 వేల మంది ఒకే విడుత రుణమాఫీ పొందనున్నారు. రైతుబంధు, రైతు బీమాతోపాటు ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.12లక్షల చొప్పున మొత్తం రూ.350కోట్లను ప్రభుత్వం కేటాయించింది.


 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా అంతటా హర్షం వ్యక్తమవుతున్నది. అన్నదాతల సంక్షేమంతోపాటు.. విద్య, వైద్యం, వెనుకబడిన తరగతుల సంక్షేమం సహా గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌తోపాటు పలు విభాగాలకూ ప్రాధాన్యం కల్పించారు. ఆర్టీసీకీ రూ.వెయ్యి కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11,758కోట్లు కేటాయించారు. ఆసరా లబ్ధిదారుల అర్హత వయస్సు 57ఏండ్లకు తగ్గించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మందికి అదనంగా లబ్ధి చేకూరనుంది. కొత్త పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల మంజూరుతో రైతు బంధు, రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య సైతం పెరగనుండగా.. వారికీ లబ్ధి చేకూరనుంది. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12లక్షల చొప్పున నిధులు కేటాయించగా.. నల్లగొండ జిల్లాలో 140 రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ శాఖకు, ఎస్సీల ప్రగతితోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమానికీ భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో బడ్జెట్‌ పైన సబ్బండ వర్గాల ప్రజలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం..

అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా సీఎం కేసీఆర్‌ సమర్ధ పాలనతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఆదర్శంగా నిలుస్తున్నది. సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారు. గ్రామాలను సుందరంగా మారుస్తూ పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. 

-కుక్కదువ్వు ఉపేందర్‌,బొమ్మలరామారం  


 మున్సిపాలిటీలకు మహర్దశ..

ఈ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మున్సిపాలిటీలకు  అధిక నిధులు ఇచ్చారు.  ఏకంగా రూ. 14,809 కోట్లు కేటాయించగా నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకునే భాగ్యం కలిగింది. నిధులు వస్తే పట్టణప్రగతిలో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. నూతన మున్సిపాలిటీ చట్టాన్ని స్వాగతిస్తున్నాం. 

-ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ యాదగిరిగుట్ట


ఎస్సీ, ఎస్టీల సంక్షేమ బడ్జెట్‌..

  సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీల పక్షపాతిగా నిలిచారు. గతేడాది కంటే ఈసారి ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి అధిక నిధులు కేటాయించడాన్ని హర్షిస్తున్నాం. మైనార్టీలకు సైతం బడ్జెట్‌ పెంచడం స్వాగతిస్తున్నాం. జిల్లాలో మొత్తం 8 ఎస్టీ, 18 బీసీ వెల్ఫేర్‌, 3 మైనార్టీ, 10 ఎస్సీ హాస్టళ్లతో పాటు మరో 2 స్కూళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం కనిపిస్తున్నది. 

-తోటకూరి అనురాధాబీరయ్య, సోషల్‌ వెల్ఫేర్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌  


చారిత్రాత్మకం..

అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మరీముఖ్యంగా రుణమాఫీని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమాతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. పింఛన్ల కోసం రూ.11,758 కోట్లు, ఎస్సీల ప్రగతి కోసం 16,534.97 కోట్లు కేటాయించడం చారిత్రాత్మకం. 

-కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌


అక్షరాస్యత పెంపునకు ప్రాధాన్యం ..

అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. అంతేకాక ప్రాథమిక, ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షనీయం. 

-మోత్కూరు బ్రహ్మచారి, విశ్రాంత ఉపాధ్యాయులు 


మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం ..

మహిళా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసింది. మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1200కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కోసం రూ.350 కోట్లు కేటాయించడం చూస్తుంటే ఎక్కడ లేని ఆనందంగా ఉంది. మహిళల సంరక్షణ, భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవడంతో పాటు సత్వర న్యాయం జరిగేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. 

-మర్రి జయమ్మ,బొమ్మలరామారం


టీఆర్‌ఎస్‌ పాలనలోనే తండాలు అభివృద్ధి..

సీఎం కేసీఆర్‌ పాలనలోనే గిరిజన తండాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటర్లుగానే వాడుకున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు 500ల జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చి స్వయం పాలన అందించడం ఆనందంగా ఉంది. అంతేకాక ప్రస్తుత బడ్జెట్‌లో  రూ.9,771.27 కోట్లు కేటాయించారు. అన్ని విధాలా ఆదుకుంటూ గిరిజనులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.

 -బన్సీ నాయక్‌, బద్దుతండా, తుర్కపల్లి మండలం


 సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట 

 సాగునీటి రంగంతో పాటు సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. రైతుబంధు పథకానికి రూ.14 వేల కోట్లు కేటాయించడంతో పాటు రూ.25 వేల లోపు బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించడం సంతోషంగా ఉంది. రైతు బీమా సొమ్మును కేవలం పదిరోజుల్లో అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది.  

- బొక్క జైపాల్‌రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌, బీబీనగర్‌ 


మైనార్టీల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌..

మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌ మైనార్టీ రెసిడెన్సియల్‌ పాఠశాలల స్థాపనతో పాటు షాదీముబారక్‌ లాంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో 71 మైనార్టీ జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. మైనార్టీల సంక్షేమం కోసం రూ.1,518 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం గొప్ప విషయం. మైనార్టీల బాగు కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు  ఎల్లప్పుడు అండగా నిలుస్తాం. 

-ఎండీ అన్వర్‌, టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు 


మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. 

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. కులవృత్తిని పక్కన పెట్టి బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస పోతున్న కార్మికుల కష్టాలను  గుర్తించిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు వలలు, కాంట, ఐస్‌బాక్స్‌లతో పాటు ఊరూరా తిరిగి చేపలను అమ్ముకునేందుకు టీవీఎస్‌ ఎక్సైల్‌ను అందజేసింది. అంతేకాక మిషన్‌ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించి అందులో చేపలను పెంచి మత్య్సకార్మికులకు ఉపాధి కల్పించింది. మరోవైపు ఈ సారి బడ్జెట్‌లో రూ.1,586 కోట్లను కేటాయించడం ఆనందంగా ఉంది. 

-బండి రాములు, మత్స్యకార్మిక ప్రధాన కార్యదర్శి 


 పాడిపరిశ్రమపై ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి..

పాడి పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ 17.3 శాతం వృద్ధిని సాధిస్తుందంటే ఆ రంగంపై ప్రభుత్వానికి ఉన్న మక్కువ అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నది. గతంతో పాటు ప్రస్తుత బడ్జెట్‌లో అధికంగా కేటాయింపులు చేసింది. పాల ఉత్పత్తిని పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం బర్రెలను పంపిణీ చేస్తున్నది.  

 -బడేటి లింగస్వామి,తంగడపల్లి 


రూ.14 వేల కోట్లు కేటాయించడం సంతోషం 

రైతు సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమాతో అన్నదాతలకు భరోసా దొరికింది. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌ రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్‌ సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు.

-కందడి వెంకట్‌రెడ్డి, రైతు,  ఆత్మకూరు


అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్నివర్గాలకు పెద్దపీట వేశారు. విద్య, వైద్యం, విద్యుత్‌, వ్యవసాయం ఇలా అన్ని రంగాలకు వేలాది కోట్లు కేటాయించడం హర్షణీయం. ప్రధానంగా  రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయం. వీటికితోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో వస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది.

-కాసర్ల గీతాదేవి, గృహిణి, సూర్యాపేట 


తెలంగాణ బడ్జెట్‌ చరిత్రాత్మకం 

దేశచరిత్రలోనే తెలంగాణ బడ్జెట్‌ చారిత్రాత్మకం. బడ్జెట్‌ అంటే కేవలం కాగితాల మీద అంకెలు మాత్రమే చూపకుండా అన్నివర్గాల సంక్షేమం కోసం బడ్జెట్‌ రూపొందించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అభినందనీయం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు హర్షణీయం. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి బడ్జెట్‌ను రూపొందించలేదు.

-సుల్తానా, ప్రైవేట్‌ టీచర్‌, తిరుమలగిరి


అక్షరాస్యత పెంచేందుకు నిధుల కేటాయింపు హర్షణీయం

రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం రూ. వంద కోట్లు కేటాయింటం హర్షణీయం. అదే విధంగా పాఠశాల విద్యతోపాటు ఉన్న త విద్యకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌లో నిధుల కేటాయిం పు అభినందనీయం. విద్యారంగంతోపాటు వైద్యరంగానికి ప్రాధాన్యత గొప్ప విష యం. వైద్యరంగానికి నిధుల కేటాయింపుతో రాష్ట్రంలోని ప్ర జల ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడుతుందనే విశ్వాసం నెలకొంది. 

-చల్లగుండ్ల సోమయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వెలిశాల 


పేదలకు జీవన భద్రత కల్పించిన బడ్జెట్‌ 

అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతులకు భరోసా కల్పించినట్లు,  నిరుపేదల కుటుంబాల్లో జీవన భద్రత కల్పించినట్లు ఉంది. రాష్ట్రంలో అన్నివర్గాలకు బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది. ఇది ప్రజల బడ్జెట్‌. ప్రజల సంక్షేమం కోసం దేశంలోనే అత్యధిక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 

-కండె వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు, మఠంపల్లిరైతులకు అండగా నిలిచే ప్రభుత్వం  

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమని బడ్జెట్‌ ద్వారా నిరూపితమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రుజువు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించడం అభినందనీయం. రైతులంతా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి. 

-దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు సమన్వ సమితి మండలాధ్యక్షుడు, పాలకవీడు  


అన్నివర్గాలను సంతృప్తిపర్చిన బడ్జెట్‌ 

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్నివర్గాలను సంతృప్తిపర్చింది. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్‌ అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆదివారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయం, సంపూర్ణ అక్షరాస్యత, విద్య, వైద్య, ఇరిగేషన్‌ రంగాలతోపాటు అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత దక్కింది. ఏ ఒక్కరూ విమర్శించకండా, ఏ సామాజిక వర్గానికి నష్టం కలుగకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం అభినందనీయం.

- కొణతం సీతారాంరెడ్డి, నేరేడుచర్ల


ఇదో ప్రగతి శీలమైన బడ్జెట్‌

ప్రగతిశీల రాష్ట్రంగా పేరొందుతున్న రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ముమ్మాటికీ ప్రగతిశీల బడ్టెట్‌. వాస్తవాలకు దగ్గరగా ఉన్న బడ్టెట్‌. అభివృద్ధి, సంక్షేమ రంగాలను సమపాళ్లలో రంగరించి తయారు చేసిన బడ్టెట్‌గా చెప్పవచ్చు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెప్రగతికి  ఎన్నడూలేని విధంగా రూ.23వేల కోట్లు, వ్యవసాయ, సంక్షేమ రంగాలకు కోతలు లేకుండా వేల కోట్లు బడ్టెట్‌లో ప్రవేశపెట్టడం సంతోషకరం. అన్నింటికంటే ముఖ్యంగా ఇంటి స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకునేందుకు గృహ నిర్మాణానికి రూ.11వేల కోట్లు, హెదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో మున్సిపాల్‌ శాఖకు రూ.14వేల కోట్లు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం మరో రూ.10వేల కోట్లు కేటాయించడ అభినందనీయం..  

-ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు,  పెన్‌పహాడ్‌, సూర్యాపేట  


logo