శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Mar 09, 2020 , 01:58:18

మారుతీరావు మరణ శాసనం..!

మారుతీరావు మరణ శాసనం..!
  • హైదరాబాద్‌లో విషం తాగి బలవన్మరణం
  • మృతదేహం మిర్యాలగూడకు తరలింపు
  • నేడు అంత్యక్రియలు

ఒక్కగానొక్క గారాల పట్టిని ఉన్నత స్థాయికి చేర్చాలనుకుని ఎన్నో కలలుగన్న మారుతీరావు.. అమృత ప్రేమ వివాహం చేసుకోవడంపై మానసికంగా కుంగిపోయాడు. పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయని రగిలిపోయాడు. 2018మే నెలలో వివాహం కాగా.. సెప్టెంబరు 14న ప్రణయ్‌ని తుద ముట్టించాడు. తమ ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన కొడుకు జ్ఞాపకాలతో జీవిస్తున్న అమృతను తిరిగి ఎలాగైనా ఇంటికి రప్పించుకోవాలనే ప్రయత్నంలో ఓడిపోయిన మారుతీ

రావు చివరకు మరణ శాసనం రాసుకున్నాడు. 


తల్లీ అమృతా.. విషం తీసుకుంటున్నా..!

మిర్యాలగూడలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటున్న మారుతీరావు శనివారం రాత్రి కోర్టు విషయాలు మాట్లాడాలంటూ డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌ వెళ్లాడు. ఆర్యవైశ్య భవన్‌లో గది అద్దెకు తీసుకుని డ్రైవర్‌ను కారులో పడుకోమని చెప్పాడు. రాత్రి 8గంటలకు భార్యతో ఫోన్‌లో మాట్లాడి ఆ తర్వాత వెంటతెచ్చుకున్న విషం తాగిప్రాణాలు తీసుకున్నాడు. ‘తల్లీ అమృతా.. విషం తాగుతున్నా.. నువ్వు అమ్మదగ్గరికి వెళ్లు’ అంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.


ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆర్థిక ఇబ్బందులు..?

2018 సెప్టెంబర్‌14న జరిగిన ప్రణయ్‌ హత్యకేసు విచారణ జిల్లాకేంద్రంలోని ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. త్వరలోనే ట్రయల్స్‌ ప్రారంభం కానుండగా... ఆర్థిక లావాదేవీలు పరిష్కరించుకుందామని సోదరుడి నుంచి ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. మూడేళ్లుగా ఆదాయం లేకపోవడంతో పాటు గతంలో పొందిన రుణాల తాలూకూ ఆర్థిక ఇబ్బందులున్నట్లు తెలిసింది. మరోవైపు సహ నిందితులు సైతం తమకు రావాల్సిన డబ్బులపై ఇటీవల కోర్టు ఆవరణలోనే ఘర్షణ పడినట్లు సమాచారం. 


రేషన్‌ డీలర్‌గా ప్రస్థానం మొదలు...

మారుతీరావుది మధ్య తరగతి నేపథ్యమే కానీ, రేషన్‌ డీలర్‌ కావడంతో నీలి కిరోసిన్‌, నల్లబెల్లం జీరోదందా వ్యాపారాల్లో ఆరితేరాడు. వడ్డీ వ్యాపారంలో లక్షలు సంపాదించి రియల్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని వివాదాస్పద స్థలాలకు పత్రాలు సృష్టించి కోట్లు సంపాదించినట్టు ప్రచారంలో ఉంది.


బతికుంటే జైలుకు వెళ్లొద్దబ్బా..!

ప్రణయ్‌ హత్యకేసులో ఏడు నెలల 15రోజుల పాటు రిమాండ్‌ ఖైదీగా జైలు జీవితం గడిపిన మారుతీరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. తనను కలిసిన మిత్రులు, బంధువులతో మాట్లాడిన ఆయన.. ‘బతికుంటే జైలుకు వెళ్లొద్దబ్బా.. నరకం..’ అంటూ జైలు జీవితంపై విరక్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.


అమృతను ఎండీగా చూడాలి : మారుతీరావు అంతర్మథనం

మిర్యాలగూడ బస్టాండుకు సమీపంలోని నటరాజ్‌ థియేటర్‌ కొనుగోలు చేసిన మారుతీరావు మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం 

చేపట్టాడు. ‘త్వరలోనే ప్రారంభోత్సవం చేయాలి.. అమృతను ఎండీ సీటులో చూడాలన్నదే నా కోరిక’ అని తరచూ తమతో చెప్పేవాడని సన్నిహితులు తెలిపారు.


మిర్యాలగూడ టౌన్‌ : కూతురిపై తండ్రికి.. ప్రేమించిన వ్యక్తిపై కూతురుకున్న ప్రేమ రెండేళ్ల వ్యవధిలో రెండు ప్రాణాలను బలితీసుకుంది. 2018సెప్టెంబరు 14న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసు ఏ-1నిందితుడు(అమృత తండ్రి) మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవనంలో ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మచేసుకున్నాడు. కూతురుపై ఉన్న ప్రేమ.. అన్యకులస్తుడిని ఆమె ప్రేమ వివాహం చేసుకుందన్న ఆక్రోశం.. సమాజంలో ప్రతిష్ట దిగజారిందన్న ఆత్మనూన్యతతో మారుతీరావు అల్లుడి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా మారాడు. ఆపై కూతురిని తిరిగి ఇంటికి తెచ్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి ఇక తన ఆకాంక్ష నెరవేరదన్న నిర్ణయానికి వచ్చి ఆవేదనలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 


ఇది నేపథ్యం..

*ఒక్కగానొక్క గారాల పట్టిని ఉన్నతస్థాయికి చేర్చాలనుకున్న ఆశలను కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకొని వమ్ము చేసిందని మారుతీరావు మానసిక క్షోభకు గురయ్యాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోవడంతో ఆమెను ఇంటికి రావాలని నచ్చజెప్పాడు. అయినా వినకపోవడం.. కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు ప్రతిష్టలు దిగజారాయని తట్టుకోలేక ఆగ్రహజ్వాలతో రగిలిపోయాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 14న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను కిరాయి *హంతకులతో తుద ముట్టించాడు. నాటి నుంచి భర్తపై ప్రేమ అతని ఆశయాలే లక్ష్యంగా అమృత తాను కోరుకున్న వాడి జ్ఞాపకాలతో జీవిస్తుండగా, కూతురును తనవద్దకు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఓడిపోయి చివరకు తనకుతానే మరణ శాసనం రాసుకున్నాడు. 

* కూతురిపై తండ్రికున్న ప్రేమ, భర్తపై అమృతకున్న ప్రేమే వారివురి కుటుంబాల పాలిట శాపంగా మారి రెండు ప్రాణాలను బలిగొన్నది. తండ్రి, భర్తను కోల్పోయిన అమృత, వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన భర్తను కోల్పోయిన మారుతీరావు భార్య గిరిజ ఇద్దరూ ఒంటరి వారయ్యారు. 

*తాను కట్టబోయే దవాఖానకు బిడ్డ అమృతే ఎండీగా వ్యవహరిస్తుందంటూ ఇటీవల మారుతీరావు తన మిత్రులతో అన్నట్లు తెలిసింది. 

*బతికుండగా ఎవరూ జైలు కెళ్లొద్దని.. జైలు జీవితంపై మారుతీరావు తమతో అన్నట్లు సహచరులు పేర్కొంటున్నారు. 

*హత్య కేసు ట్రయల్స్‌ నేపథ్యంలో వ్యాపారంలో ఉమ్మడి ఆర్థిక లావాదేవీలు పరిష్కరించుకునేందుకు ఏదైనా స్థిరాస్తి అమ్ముదామని సోదరుడు శ్రవణ్‌ ఇటీవల మద్యవర్తుల ద్వారా అన్న మారుతీరావుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 

*శనివారం సాయంత్రం మిర్యాలగూడ నుంచి కారులో బయల్దేరిన మారుతీరావు భార్యతో కోర్టు కేసుల విషయమై లాయర్‌తో చర్చించేందుకు వెళ్తున్నానని, ఆదివారం తిరిగి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య *సంఘం భవనంలో గది అద్దెకు తీసుకున్నాడు. డ్రైవర్‌ తాను రూంలోనే పడుకుంటానని కోరినా కారులో పడుకోమని చెప్పి పంపాడు. మిర్యాలగూడలోని ఓ పురుగు మందుల దుకాణం నుంచి వెంట తీసుకెళ్లిన క్రిమిసంహారక మందు తాగి ప్రాణాలొదిలాడు. 


logo