బుధవారం 03 జూన్ 2020
Yadadri - Mar 07, 2020 , 23:37:10

మహిళలు చైతన్యవంతులు కావాలి

మహిళలు చైతన్యవంతులు కావాలి

భువనగిరి అర్బన్‌: ప్రతిక్షణం ఒత్తిడి ఉన్నా.. చిరునవ్వుతో తన పనుల్లో ముందుకు సాగే మహిళలతోనే సమాజ నిర్మాణం సాఫీగా సాగుతుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని రావిభద్రారెడ్డి గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ. మహిళలు అన్ని రంగాల్లో శక్తి వంతురాలన్నారు. ప్రతి విషయంలో ఆలోచనతో సమాజంలో ముందుకెళ్లినప్పుడే గుర్తింపు ఉంటుందన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని పెన్ను, గన్ను, రాజకీయంలో మైకులను పట్టి అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నామని నిరుపించుకుంటున్నారని తెలిపారు. సమాజంలో మహిళ పాత్ర ఎంతో ఉన్నదని, మహిళలు చైతన్యవంతులుగా మారినప్పుడు ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకోవచ్చన్నారు. మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలు, ఉపాధి కల్పన పనులను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా స్థిరపడాలన్నారు. మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నదన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా క్రీడా పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. 


అనంతరం మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ కుటుంబ నిర్ణయాల్లో మహిళలకు సరైన పాత్ర ఇవ్వడం వల్లే మహిళాసాధికారత సాధించగలుగుతున్నామన్నారు.  మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే మద్యపానం నిషేధం, గ్రామాల్లో బెల్టుషాపుల మూసివేతపై ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్‌ బ్యాంకు అధికారి నాగార్జునబాబు, హార్టికల్చర్‌ అధికారి సురేశ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ కృష్ణప్రియ, మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, రెవెన్యూ అధికారి విజయ, జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైని, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయకుమారి, డీపీఆర్‌ఓ జగదీశ్‌, ఆయా శాఖల అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు నరాల నిర్మల, ఎంపీపీ నరాల నిర్మల, వాకిటి పద్మ, గొలనుకొండ లక్ష్మి, భానుమతి, శారద, శ్రీరాములు జ్యోతి, పుష్పలత, ఎరుకల సుధ, అనురాధ, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మహిళా సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


మహిళ వ్యక్తి కాదు..  ఒక శక్తి..

- కృష్ణప్రియ, జిల్లా ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ 

మహిళ వ్యక్తి కాదు.. శక్తి అని ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ కృష్ణప్రియ అన్నారు. మహిళలు సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఏ రంగంలో చూసినా పట్టుదలతో సాధించే వరకు ఉపక్రమించరని తెలిపారు. మహిళలో ఉన్న ప్రేమ స్వభావంతో భర్త,పిల్లలతోపాటు కుటుంబంలో ఎంతటి భారమైన మోయడానికి వెనకడుగు వేయరన్నారు. 


చైతన్య వంతురాలిగా ఎదుగాలి..

- కేవీ కృష్ణవేణి, మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి

మహిళలు విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో చైతన్య వంతులుగా ఎదగాలని మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి కేవీ.కృష్ణవేణి అన్నారు. మహిళలు చైతన్యవంతులుగా మారినప్పుడే సమాజంలో ధైర్యంగా ముందుకెళ్ల్లవచ్చనానరు. 


ఆడపిల్లను ఉన్నత స్థాయిలో చదివించాలి..

- చైతన్యజైని, జిల్లా విద్యాశాఖాధికారిణి  

ఆడపిల్ల అని చదువులో వివక్ష చూపకుండా ఉన్నత స్థాయికి వరకు చదివించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి చైతన్యజైని అన్నారు. మహిళలు చైతన్యవంతులు కావాలంటే విద్య ఎంతో అవసరమన్నారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలను ఏ రకంగా తక్కువగా చూడొద్దన్నారు. 


logo