శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Mar 05, 2020 , 00:14:56

టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా గొంగిడి మహేందర్‌రెడ్డి!

టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా  గొంగిడి మహేందర్‌రెడ్డి!

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తున్నది. టీఆర్‌ఎస్‌  కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు గొంగిడి మహేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు బుధవారం డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి సతీమణి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశారు. గురువారం హైదరాబాద్‌లోని టెస్కాబ్‌ భవన్‌లో జరిగే రాష్ట్ర సహకార బ్యాంకుల ఎన్నికల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే వీలుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత 29వ తేదీన జరిగిన డీసీసీబీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆశీస్సులతో డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు నుంచి గొంగిడి దంపతులు పనిచేస్తూ వస్తున్నారు. 


హోదా పెంపు..

ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును అందుకు పోతూ, మరోవైపు రైతుల పక్షపాతిగా మహేందర్‌రెడ్డి సేవలందిస్తూ వస్తున్నారు . 32 ఏండ్ల నుంచి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌గా పలుసార్లు ఎన్నికయ్యారు. ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి గొంగిడి మహేందర్‌రెడ్డి సైతం అడుగులు వేశారు.  


రైతుల హర్షం

సహకారం సంఘాల కార్యకలాపాల్లో 32 ఏండ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న గొంగిడి మహేందర్‌రెడ్డి సేవలను వాడుకోవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తున్నది. గొంగిడి మహేందర్‌రెడ్డితో కేటీఆర్‌ పలుమార్లు ఇదే విషయాన్ని ఫోన్‌ ద్వారా చర్చించినట్లు తెలుస్తున్నది. గత ఉమ్మడి ఆంధ్రపదేశ్‌, తాజా  తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాల్లో అనుభవం, నమ్మినవ్యక్తిగా ఉంటూ వస్తున్న గొంగిడి మహేందర్‌రెడ్డికి ఆ అనుభవాలే టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు దారులు వేశాయి. నాటి ఉద్యమ నాయకుడు, కార్మిక, కర్షక నేత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన గుర్తింపు ఇస్తున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  logo