మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Mar 01, 2020 , 00:15:55

ఉద్యమ నేపథ్యమే పదవినిచ్చింది

ఉద్యమ నేపథ్యమే పదవినిచ్చింది
  • సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ గుర్తింపునిచ్చారు..
  • సహకరించిన అందరికీ కృతజ్ఞతలు
  • డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

‘కేసీఆర్‌ ఉద్యమ ప్రస్థానం.. కేటీఆర్‌ అకుంఠిత దీక్షతో పార్టీ బలోపేతం కావడం వల్లనే ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్సే విజయం సాధిస్తున్నది.. నాకు దక్కిన డీసీసీబీ చైర్మన్‌ అవకాశం సైతం కేసీఆర్‌తో నాకున్న ఉద్యమ నేపథ్యం, యువనేత కేటీఆర్‌ నా శ్రమను గుర్తించ డమే కారణం. ’ అని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం  నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు.


నమస్తే తెలంగాణ ప్రతినిధి : మీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్తారా..?

మహేందర్‌రెడ్డి : 1986లో వంగపల్లి కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేశాను. 1987లోనే సింగిల్‌ విండో చైర్మన్‌గా అతి చిన్న వయస్సులోనే 400ఓట్లతో విజయం సాధించాను. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నాను. 2001లో మండల పరిషత్‌ ఎన్నికల్లో ఎంపీపీ పదవి మహిళా రిజర్వేషన్‌ కావడంతో మా సతీమణి గొంగిడి సునీతను రాజకీయాలకు పరిచయం చేశాను. మా స్వగ్రామం వంగపల్లి. 1987 నుంచి 2020 నేటి వరకు పీఏసీఎస్‌ చైర్మన్‌గా వరుసగా ఆరుసార్లు పనిచేయడం ఎంతో అనుభవాన్ని అందించింది. ఈ క్రమంలోనే 2002 నుంచి 2005 వరకు టీఆర్‌ఎస్‌ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. 2006నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రైతుల కష్ట, నష్టాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. 


నమస్తే : డీసీసీబీ చైర్మన్‌ అవకాశం ఊహించారా..?

మహేందర్‌రెడ్డి : పదవుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఉద్యమం ఆకర్షించింది. 2001లో పార్టీలో చేరినప్పటి నుంచి మడమ తిప్పకుండా పోరాడాను. రాజీలేని పోరాటం చేశాం. కేసీఆర్‌ పిలుపందుకుని ప్రతి కార్యక్రమంలో ముందుండి పాల్గొన్నాను. 


నమస్తే : డీసీసీబీ చైర్మన్‌గా ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు?

మహేందర్‌రెడ్డి : ఇది ముమ్మాటికి సీఎం కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ కష్టఫలం. వారికి రుణపడి ఉంటా. 


నమస్తే : ఉద్యమ నేపథ్యాన్ని అగ్ర నేతలు గుర్తించినట్లు భావిస్తున్నారా?

మహేందర్‌రెడ్డి : ఎన్ని బాధలు వచ్చినా పార్టీలోనే కొనసాగాను. నేను నా భార్య ఇద్దరం పార్టీలో సమానంగా పని చేశాం. ఉప ఎన్నికలు జరిగితే ఇద్దరం వేర్వేరుగా మండలాల ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకుని పనిచేశాం. రాజీలేని ఆ పోరాటమే మాకు గుర్తింపు ఇచ్చినట్లు భావిస్తున్నాం. 


నమస్తే : డీసీసీబీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు..?

మహేందర్‌రెడ్డి : నాకున్న అనుభవం అంతా రైతులతో నేర్చుకున్నదే. రైతులు సంతోషంగా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిండు. రైతుబంధు మొదలుకుని బీమా వరకు సరిగ్గా రైతులకు అందుతున్నాయి. సొసైటీల్లో అవినీతి లేకుండా డీసీసీబీని ఉపయోగించుకుని రైతుల మద్దతు మరింతగా పొందేందుకు కృషి చేస్తాను. పారదర్శకంగా పాలన చేస్తాను. నా ఎన్నికకు సహకరించిన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. 

VIDEOS

logo