గురువారం 04 జూన్ 2020
Yadadri - Feb 29, 2020 , 00:12:34

ప్లాట్ల దందా గుట్టు రట్టు

ప్లాట్ల దందా గుట్టు రట్టు
  • అక్రమంగా డబుల్‌ రిజిస్ట్రేషన్లు
  • 7 గురు ముఠా సభ్యులను
  • అరెస్ట్‌ చేసిన పోలీసులు
  • రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి సీసీ కాపీలు తీసుకుని నకిలీ డాక్యుమెంట్లు సృష్టి
  • పలువురు బాధితులు చౌటుప్పల్‌ పోలీసులను ఆశ్రయించడంతో బట్టబయలైన భూబాగోతం
చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : అంతా మాయ.. తేరుకునే లోపే రూ.కోట్లు దండుకున్న వైనం.. గుట్టుగా డబుల్‌ రిజిస్ట్రేషన్లకు తెరలేపి కొంతమంది రియల్టర్లు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. డాక్యుమెంట్‌ రైటర్లతో కుమ్మక్కవుతూ అక్రమాలకు పాల్పడ్డారు. అమాయకులను ఆసరా చేసుకొని కోట్ల రూపాయలు దండుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఆధార్‌, పాన్‌కార్డులు సృష్టించి డబుల్‌ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు కొంతమంది ప్రబుద్ధులు. ఇది చౌటుప్పల్‌ మండలం తూఫ్రాన్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. చౌటుప్పల్‌ మండలం తూఫ్రాన్‌పేట అంటేనే రియల్‌ ఎస్టేట్‌కు పెట్టింది పేరు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉండడం.. ఎన్‌హెచ్‌ 69 రోడ్డు సమీపంలో ఉండడంతో ఇక్కడి భూములకు, ప్లాట్లకు రెక్కలొచ్చాయి. రెండు దశాబ్దాల నుంచే ఇక్కడ రియల్‌ దందా జోరుగా కొనసాగుతున్నది. గ్రామ పరిధిలో గతంలో చేసిన వెంచర్లలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పలువురు హైదరాబాదీ సెటిలర్లు ప్లాట్లను కొనుగోలు చేశారు. పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో తమ ప్లాట్లు ఎక్కడికీ పోవులే.. అనే ధీమాగా ఉన్నారు. భూముల రేట్లు అమాంతం పెరగడంతో సదురు ప్లాట్లపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడింది. నకిలీ ఆధార్‌, పాన్‌కార్డులు సృష్టించి ఫేక్‌ డాక్యుమెంట్లు తయారు చేసి అమాయకులకు మార్కెట్‌ రేటుకు అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకున్నారు. తీరా అసలైన యజమానులు వచ్చి తమ ప్లాట్లలో మరొకరు హద్దురాళ్లు నాటుకోవడం చూసి  నివ్వరపోయేవారు. ఏమి చేయాలో పాలుపోక లబోదిబోమనే వారు. ఇక్కడే నకిలీ డాక్యుమెంట్‌ సృష్టికర్తలు రంగంలోకి దిగి వారిని బెదిరించి సెటిల్‌మంట్‌ చేసే వారు. వినకపోతే.. ఇవి తమ ప్లాట్లేనని, తమ దగ్గర ఒర్జినల్‌ డాక్యుమెంట్లు ఉన్నాయని.. ఏమి చేస్తారో చేసుకోండి.. అంటూ భయభ్రాంతులకు గురిచేసి వారిని అక్కడి నుంచి  పంపించే వారు. ఈ క్రమంలో కొంతమంది బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడంతో డబుల్‌ రిజిస్ట్రేషన్ల భాగోతం బట్టబయలైంది. ఈ తంతుకు పాల్పడ్డ 7 గురు నిందితులు పర్దం శేఖర్‌, ఆనుగు మాధవరెడ్డి, ఎల్మ రామలింగేశ్వర్‌రెడ్డి, ఆనుగు జైపాల్‌రెడ్డి, పర్దం సురేశ్‌, పెద్దపుడి నరేశ్‌, ఆకుల శ్రీకాంత్‌లపై మూడు కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని ఎల్‌బీనగర్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవాంర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్‌ సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. 


వెలుగులోకి వచ్చింది ఇలా...

తూఫ్రాన్‌పేట గ్రామంలోని మైలారం రోడ్డు పక్కన సర్వే నెం. 82,83లో గతంలో చేసిన వెంచర్‌లో హైదరాబాద్‌కు చెందిన అన్నపూర్ణ 266 గజాల ప్లాటును కొనుగోలు చేసింది. తర్వాత ఆమె శ్రీగణేశ్‌కు అమ్మింది. శ్రీగణేశ్‌ ప్లాటుకు హద్దురాళ్లను నాటుకున్నారు. తూఫ్రాన్‌పేట గ్రామానికి చెందిన పర్దం శేఖర్‌, ఏనుగు మాధవరెడ్డి ఈ ప్లాటుపై కన్నేశారు. గతంలో ప్లాటు కొనుగోలు చేసిన అన్నపూర్ణమ్మతో కమ్ముక్కయ్యారు. ఆమెకు కొంత నగదు ముట్టజెప్పి నకిలీ డాక్యుమెంట్‌ సృష్టించి, తిరిగి ఆ ప్లాట్‌ను పర్దం శేఖర్‌ తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ప్లాటు చదును చేసి హద్దురాళ్లను సైతం యథేచ్ఛగా నాటాడు. విషయం తెలుసుకున్న ప్లాటు అసలైన ఓనర్‌ శ్రీగణేశ్‌ అక్కడికి వచ్చి తన ప్లాటును శేఖర్‌ కబ్జా చేయడం చూసి పర్దం శేఖర్‌ను నిలదీశాడు. తనకూ ఒర్జినల్‌ డాక్యుమెంట్‌ ఉందని, ప్లాటు తనదేనని శేఖర్‌ బుకాయించాడు. దీంతో చేసిదేమీ లేక 2016 చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో శ్రీ గణేశ్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో పర్దం శేఖర్‌, అన్నపూర్ణమ్మ, ఏనుగు మాధవరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూఫ్రాన్‌పేట గ్రామంలోని గ్రీన్‌ సిటీ వెంచర్‌లో సర్వే నెం.100లోని ప్లాట్‌ నెం.59, 123లోని 533 గజాల స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వర్లు కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేసిన ఏనుగు మాధవరెడ్డి, పర్దం శేఖర్‌ ఫేక్‌ డాక్యుమెంట్‌ సృష్టించి దండుమల్కాపురానికి చెందిన గిర్కంటి నిరంజన్‌గౌడ్‌కు రూ.18లక్షలకు అమ్మారు. మరికొంత కాలానికి ఇదే ప్లాటును మళ్లీ శేఖర్‌ తన తమ్ముడు సురేశ్‌, మాధవరెడ్డి తన తమ్ముడు జైపాల్‌రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ ఫేక్‌ డాక్యుమెంట్‌ను డాక్యుమెంట్‌ రైటర్‌ ఆకుల శ్రీకాంత్‌ సహాయంతో చేయించారు. విషయం తెలుసుకున్న నిరంజ్‌గౌడ్‌ శేఖర్‌, మాధవరెడ్డి, శేఖర్‌ను నిలదీశారు. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కంగుతిన్న వారు రూ.36 లక్షలు ఇస్తామని నిరంజన్‌గౌడ్‌ను ఒప్పించారు. కానీ జనవరి 2020 సంవత్సరంలో నిరంజన్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటికే వీరిపై చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే వెంచర్‌లో 102 సర్వే నెంబర్‌లోని ప్లాట్‌నెం.1857కు సంబంధించిన 266 గజాల స్థలాన్ని హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన తుమ్మల కిరణ్‌కుమార్‌ 2018లో కొనుగోలు చేశారు. గతంలో తన అన్న వెంగయ్య చౌదరి కొనుగోలు చేసిన ప్లాటును కిరణ్‌కుమార్‌ కొన్నాడు. ఈ ప్లాట్‌ను అతను యాట మోహన్‌రావుకు అమ్మగా.. అతను చర్ల నర్సింహకు అమ్మాడు. ఇక్కడే మాయ చేసిన ఏనుగు మాధవరెడ్డి, పర్దం శేఖర్‌.. తుమ్మల కిరణ్‌కుమార్‌ ఫేక్‌ ఆధార్‌, పాన్‌కార్డును సృష్టించారు. రామలింగేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దింపి తానే తుమ్మల కిరణ్‌కుమార్‌గా నమ్మించాడు. అతడి నుంచి ఆ ప్లాట్‌ను ఏనుగు మాధవరెడ్డి తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకొని హద్దురాళ్లను నాటాడు. ఇది తెలుసుకున్న ప్లాటు నిజమైన ఓనర్‌ నర్సింహ మాధవరెడ్డిని నిలదేశాడు. దీంతో తానే అసలైన ఓనర్‌నని మాధవరెడ్డి నర్సింహను బెదిరించాడు. దీంతో కిరణ్‌కుమార్‌, మోహన్‌రావు కలిసి తమకు ప్లాటమ్మిన కిరణ్‌కుమార్‌ దగ్గరకు వెళ్లి నిలదీశాడు. తీరా కిరణ్‌కుమార్‌ ఆరా తీయగా.. తన పేరుతో మాధవరెడ్డి తయారు చేసిన నకిలీ భాగోతం బయటపడింది. దీంతో కిరణ్‌కుమార్‌ చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయగా.. జనవరి 2020 సంవత్సరంలో ఏనుగు మాధవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు, ఐడీ కార్డులు, ఆధార్‌, పాన్‌కార్డులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పర్దం నరేశ్‌ తాయరు చేసే వాడు. ఈ మూడు కేసులకు సంబంధించిన నిందితులైన పర్దం శేఖర్‌, ఏనుగు మాధవరెడ్డి, రామలింగేశ్వర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నరేశ్‌, ఆకుల శ్రీకాంత్‌లను అరెస్ట్‌ చేశారు. సురేశ్‌ తప్పించుకున్నాడని, అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను  రామన్నపేట కోర్టులో హాజరు పరుస్తామని సీపీ తెలిపారు. నిందితుల నుంచి ఆరు నకిలీ సెల్‌ డీడ్‌ డ్యాంక్‌మెంట్లు, రూ.7లక్షలు, బ్రీజా కారు, టాటా సఫారీ వాహనాలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని సీపీ తెలిపారు. 


కోట్ల రూపాయలు చేతులు మారిన వైనం..

ఫేక్‌ డ్యాక్‌మెంట్లు సృష్టించి భూభాగోతం నడిపిన తంతులో కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తున్నది. తూఫ్రాన్‌పేటలోని గ్రీన్‌ సిటీ వెంచర్లలోని 100కు పైగా ప్లాట్లను డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మినట్టుగా తెలుస్తున్నది. వివిధ మార్గాల్లో ఈ ఫేక్‌ డ్యాక్‌మెంట్లను సృష్టించినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా సబ్‌రిజిస్ట్రార్‌  కార్యాలయం నుంచి సీసీ కాపీలు పొంది, నిజమైన ఓనర్ల పేరుతో నకిలీ ఆధార్‌, పాన్‌కార్డు సృష్టించి ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లను అమ్మేయడం ఒక పద్ధతైతే.. గ్రీన్‌ సిటీ వెంచర్‌లోని ఉద్యోగులతో కుమ్మక్కై ఒరిజనల్‌ డాక్యుమెంట్లు పొంది.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ పాట్లను అమ్మడం మరో పద్ధతి. వెంచర్‌లో అభివృద్ధి పనుల కోసం వదిలేసిన 10 శాతం భూమిని ఆ వెంచర్‌ ఓనర్లతోనే కుమ్మక్కై ప్లాట్లుగా మార్చి అమ్మేయడం ఇంకో పద్ధతి. ఈ తంతంగంలో అమాయకులకు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ ప్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు దండుకున్నారు. 


logo