బుధవారం 03 మార్చి 2021
Yadadri - Feb 28, 2020 , 00:14:38

హాజీపూర్‌ బాధితులకు అండగా నిలుస్తాం

హాజీపూర్‌ బాధితులకు అండగా నిలుస్తాం
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
  • గ్రామస్తుల ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, సీపీ
  • నిందితుడికి ఉరిశిక్ష వేయించిన పోలీసులకు గ్రామస్తుల అభినందనలు
  • పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది
  • నిరంతర నిఘా నేత్రాలతో ప్రజలకు రక్షణ : సీపీ మహేశ్‌భగవత్‌
  • నేర రహిత సమాజం కోసం ప్రజలందరూ సహకరించాలి
  • భయాన్ని వీడి ధైర్యంగా ముందుకెళ్లాలి

బొమ్మలరామారం: హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. మండలంలోని హాజపూర్‌ గ్రామంలో గురువారం గ్రామస్తులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల రక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. హాజీపూర్‌ సంఘటనపై బాధితులను ఆదుకునేందుకు గురువారం ఉదయం మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారన్నారు. హాజీపూర్‌ భాధిత కుటుంబాలకు చేయూతనందించడానికి తానే స్వయంగా వారిని కలిసి వారికి అవసరమయ్యే ఆర్థిక వనరుల కల్పనకు కృషి చేస్తామని, తన మాటగా గ్రామస్తులకు తెలియజేయాలని మంత్రి కేటీఆర్‌ తనతో చెప్పినట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు.

వాట్సాప్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు బాధిత కుటుంబాల సమాచారాన్ని పంపినట్లు చెప్పారు. అమాయక బాలికలను పొట్టన పెట్టుకున్న నిందుతుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్ష పడేలా కృషి చేసిన పోలీస్‌శాఖకు అభినందనలు తెలిపారు. గ్రామస్తులు, ప్రభుత్వం, పోలీసుల సమష్టి సహాకారంతోనే నిందితునికి సరైన శిక్ష పడిందన్నారు. గ్రామస్తుల మంచితనమే చెడుపై విజయం సాధించిందన్నారు. బాధిత కుటుంబాలకు లీగల్‌ సర్వీసెస్‌ ద్వారా ఒక్కో కుటంబానికి రూ.5 లక్షల డబ్బులు రావాల్సి ఉన్నదన్నారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కో కుటంబానికి రూ.50 వేలు అందజేశామన్నారు. గ్రామంలోని శామిర్‌పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 లక్షల చొప్పున అంచనా వేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదికలను పంపినట్లు తెలిపారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రాచకొండ కమిషనరేట్‌ సీపీ మహేశ్‌భగవత్‌ మాట్లాడుతూ.. మైనర్‌ బాలికలను అత్యంత అమానుషంగా అత్యాచారం, హత్యలు చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయిస్తామని బాధిత కుటుంబాలకు, గ్రామస్తులకు ఇచ్చిన హామీని పోలీస్‌శాఖ ద్వారా నిలబెట్టుకున్నామని రాచకొండ కమిషనరేట్‌ సీపీ మహేశ్‌భగవత్‌ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డికి నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా రెండు కేసుల్లో ఉరిశిక్ష, మరో కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చాలా కష్టపడ్డామన్నారు. నిందితుడు పైకోర్టులు, రాష్ట్రపతి అప్పీలుకు వెళ్లినా తప్పనిసరిగా ఉరిశిక్ష అమలయ్యేది ఖాయమన్నారు. నిందితుడు కర్నూల్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కూడా హత్యకేసులో మరణశిక్ష పడే అవకాశం ఉన్నదన్నారు.

నిందితుడికి కఠిన శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించి ఉరిశిక్ష పడేలా కృషి చేసిన పోలీస్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కేసులో పోలీసులకు గ్రామస్తులు అం దించిన సహకారం మరువలేనిదన్నారు. గ్రామంలో రూ.14లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నమన్నారు. బడిపిల్లలకు స్కూల్‌కు వెళ్లడానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు. ప్రజలే యూనిఫామ్‌ లేని పోలీసుల్లా వ్యవహరించి ప్రజారక్షణకు కృషి చేయాలన్నారు. గ్రామం నుంచి బొమ్మలరామారం మండల కేంద్రానికి వెళ్లే విద్యార్థినులకు స్వచ్ఛంద సంస్థల ద్వారా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కేసులో సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అనంతరం గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తూ ఆదుకుంటున్న పోలీసులు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నిందితుడికి పడిన ఉరిశిక్షను వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్‌, సీపీ, పోలీస్‌ సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కేసులో మొదటి నుంచి బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఎప్పటికప్పుడు గ్రామస్తుల్లో ధైర్యాన్ని కల్పించి ప్రజల సమన్వయంతో పనిచేసిన భువనగిరి ఏసీపీ భుజంగరావుకు బాధిత కుటుంబంలోని శ్రావణి బాబాయి సభాస్థలంలో ప్రజలందరిముందు పోలీస్‌శాఖకు కృతజ్ఞత తెలియజేస్తూ.. పాదాభివందనం చేశారు. అనంతరం గ్రామపంచాయతీ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీ పీ భుజంగరావు, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ మధుబాబు, గ్రామ సర్పంచ్‌ కవిత, ఎంపీటీసీ ఫక్కీర్‌ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ పద్మసుందరి, ఎంపీడీఓ శేషాద్రి, మల్యాల సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ బాల్‌రాజ్‌, ప్రజాసంఘాల నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు తదితరులు ఉన్నారు.

VIDEOS

logo