మంగళవారం 19 జనవరి 2021
Yadadri - Feb 27, 2020 , 00:09:50

స్వయం ఉపాధికి కృషి

స్వయం ఉపాధికి కృషి

భూదాన్‌పోచంపల్లి : యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి, వారికి తగిని ఉపాధి అవకాశాలను కల్పించేలా కేంద్ర ఖాదీ బోర్డు కృషి చేస్తున్నదని కేంద్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా అన్నారు. పోచంపల్లి పట్టణంలో కేంద్ర ఖాదీ బోర్డు సహకారంతో నెలకొల్పబడిన పలు స్వయం ఉపాధి కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఖాదీ బోర్డు ద్వారా చేనేత రంగంలో ఉపాధి పొందటంతోపాటు పలువురికి ఉపాధిని అందిస్తున్న సిల్క్‌ యూనిట్‌ను ఆయన సందర్శించారు. కేంద్ర ఖాదీ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేసిన వస్ర్తాలను కేవీఐబీ ద్వారా రైల్వేతోపాటు మిలటరీ వారికి కూడా సరఫరా చేస్తున్నామన్నారు. త్వరలో పోచంపల్లికి ఒక క్లస్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేబీఐబీ ద్వారా ప్రైమినిస్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ పోగ్రామ్‌లో భాగంగా యువతకు తగిన రుణాలు అందించి వారికి తగిని ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. సేవా రంగంలో రూ.10 లక్షలు, ఉత్పత్తి రంగంలో రూ.25 లక్షల వరకు రుణాన్ని అందిస్తున్నామన్నారు. 


ఇందులో ఎస్సీ ఎస్టీ, బీసీలకు రూ.8.74 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంద, అంటే  35 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ఇతరులకు 25 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. పోచంపల్లి చేనేత వస్ర్తాల ప్రపంచ ప్రఖ్యాతి గాంచడంతోపాటు ఎంతో నాణ్యతతో ఉన్నాయని ఆయన అన్నారు. ఇక్కడ మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు తగిన ఉపాధి అవకావాలు కల్పించడమే తన ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా ఆయన పోచంపల్లిలోని భద్రావతీ కాలనీలో ఏర్పాటు చేసిన సిల్క్‌ యూనిట్‌ను పరిశీలించారు. తదుపరి పోచంపల్లి హ్యాండ్లూమ్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో చేనేత వస్ర్తాలను తిలకించారు. కార్యక్రమంలో కేంద్ర ఖాదీ బోర్డు సీఈవో ప్రితా వర్మ, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ ఉషా సురేశ్‌, స్టేట్‌ డైరెక్టర్‌ సిందులాల్‌, ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ బోర్డు డైరెక్టర్‌ కర్నాటి ధనుంజయ్య, జాయింట్‌ సీఈవో వైకే బరమటికర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ సంతోశ్‌, నారాయణరావు, శ్రీహరి, సైదులు తదితరులు పాల్గొన్నారు.