బుధవారం 03 జూన్ 2020
Yadadri - Feb 26, 2020 , 23:50:53

న్యాయసదస్సులతో చట్టాలపై అవగాహన

న్యాయసదస్సులతో చట్టాలపై అవగాహన

బీబీనగర్‌: ప్రజలకు చట్టాలపై అవగాహన తేవడానికి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.స్వప్నారాణి వెల్లడించారు. బీబీనగర్‌ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం గ్రామస్తులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానులేనని, కోర్టులో కేసులపై కొట్లాడలేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. చట్టాల గురించి తెలియకపోవడంతో ప్రజలు నేరాలకు పాల్పడుతున్నారని దీంతో క్రయ విక్రయాలు, లావాదేవీల్లో ఇరుక్కొని ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అందుకే గ్రామాల్లో న్యాయ సలహాలు అందించడానికి సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌ అదాలత్‌, మెగాలోక్‌ అదాలత్‌ రాజీకి వీలున్న క్రిమినల్‌ కేసులతో పాటు అన్ని సివిల్‌ కేసులను వాయిదాలతో నిమిత్తం లేకుండా ఇరు వర్గాలు రాజీకి ముందుకొస్తే వాటిపై తుది తీర్పునిస్తామని, దీనిపై తిరిగి అప్పీలుపై ఆస్కారం ఉండదన్నారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఉభయులూ కేసులో విజయం సాధిస్తారని, దీనితోపాటు కేసుల సంఖ్య తగ్గి ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. ఉచితంగా అందించే న్యాయసేవలతో పాటు చట్టాలపై అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న ఇలాంటి సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 


చట్టాలపై అవగాహన ఉండాలి : సురేందర్‌రెడ్డి, భువనగిరి రూరల్‌ సీఐ 

ప్రజలకు చట్టాలపై సరైన అవగాహన ఉంటే తప్పులు చేయరని, ఎలాంటి కేసుల్లో ఇరుక్కోరని సీఐ సురేందర్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లకు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన  కల్పించాలన్నారు. దీనివల్ల తమ భవిష్యత్తులో చిన్న చిన్న తప్పులు చేసి కోర్టుల చుట్టూ తిరగరని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, ఎస్సై రాఘవేంద్రగౌడ్‌, ఉప సర్పంచ్‌ దస్తగిరి, వార్డు సభ్యులు సురేశ్‌గౌడ్‌, అంజి, యమున, వేణు, ప్రశాంతి, లత, రఘు, కోఆప్షన్‌ సభ్యులు అశోక్‌, ఆంజనేయశర్మ, లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి తుల్జాప్రసాద్‌ నాయకులు నరేందర్‌, నరేష్‌యాదవ్‌, గణేశ్‌ పాల్గొన్నారు.


logo