బుధవారం 03 జూన్ 2020
Yadadri - Feb 25, 2020 , 03:12:25

ప్రగతికి శ్రీకారం

ప్రగతికి శ్రీకారం

పట్టణాల్లో ప్రగతిబాటలు పడ్డాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి, పట్టణాలను సైతం సుందరీకరించేందుకు పూనుకున్న ప్రభుత్వం ఈ మేరకు సోమవారం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 10 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో మొదటిరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు ఇన్‌చార్జిలు పట్టణాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించే పనిలో పడ్డారు. అంతేకాక పారిశుధ్యం, మొక్కల సంరక్షణపై ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు యాదగిరిగుట్ట పట్టణంలోని పట్టణ ప్రగతిలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ జి.రమేశ్‌, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, పోచంపల్లిలో అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌, చౌటుప్పల్‌లో ఆర్డీవో సూరజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టణాల్లోని పలు వార్డుల్లో కలియదిరిగారు. సమస్యలను గుర్తించే పనిలో పడ్డారు. మురికివాడల్లోని పారిశుధ్య సమస్యలను తొలగించేందుకు పూనుకున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, ఆలేరు పట్టణాల్లో ప్రారంభమైన పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పర్యవేక్షించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఏడో వార్డులో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రమేశ్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ పట్టణ ప్రగతి ఆవశ్యకతను వివరించారు. ప్రతిఒక్కరూ పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దాతల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలపై ఉందన్నారు. 


*ఆలేరులో పట్టణప్రగతిని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఆర్డీవో భూపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను అధిగమించాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య వాడలన్నీ కలియతిరుగుతూ సమస్యలను గుర్తించారు. 

* భువనగిరిలో పట్టణ ప్రగతికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 35 వార్డుల్లో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు. అనంతరం 1వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి సభలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో  ప్రజలందరూ భాగస్వాములై సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. 

*భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని 13వార్డుల్లో పట్టణ ప్రగతిని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయా వార్డుల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకుని వివిధ వార్డుల సమస్యలపై ప్రజాభిప్రాయం సేకరించారు. అడిషనల్‌ కలెక్టర్‌ కీమ్యానాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సాగాయి. 

* చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి ఉత్సాహంగా కొనసాగింది. 16 వార్డులో మున్సిపాలిటీ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీవో ఎస్‌. సూరజ్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం వార్డు కౌన్సిర్లతో కలిసి వార్డుల్లో పాదయాత్ర చేశారు. పలు సమస్యలను గుర్తించారు.  

* మోత్కూరు మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమయ్యింది. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో చైర్‌పర్సన్‌ తిపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి పాల్గొన్నారు. అన్ని వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు వార్డుల్లో పర్యటించి ప్రధాన సమస్యలను గుర్తించారు. అందరి సహకారంతో వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని చైర్మన్‌ తెలిపారు. 


logo