గురువారం 04 మార్చి 2021
Yadadri - Feb 22, 2020 , 23:44:07

యాసంగి ప్రణాళిక

యాసంగి ప్రణాళిక

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ: యాసంగిలో వరి ధాన్యం సేకరించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వానాకాలంలో జిల్లాలో 140 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. యాసంగిలో సాగు విస్తీర్ణం భారీగా పెరగడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 150  కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,90,000 ఎకరాలు కాగా ఖరీఫ్‌ సీజన్‌లో 83,497 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. రైతులు ఎక్కువగా వరి పంటకే మొగ్గు చూపారు. యాసంగిలో 1,36,750 ఎకరాల్లో వరిని సాగు చేశారని అధికారులు అంచనాలు రూపొందించి ఈ మేరకు కార్యాచరణను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 3,00,000 టన్నుల మేర ధాన్యం దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో 1,90,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి రూ.350 కోట్లు  రైతులకు చెల్లించారు. 29,000 మంది రైతులకు మద్దతు ధర చెల్లించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ముందస్తుగానే అప్రమత్తం అవుతున్నది.  ఈ యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం అడిషనల్‌ కలెక్టర్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నది. రికార్డు స్థాయిలో గత వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరించిన ఉత్సాహంతో ఉన్న పౌరసరఫరాల సంస్థ ఈసారి అదే ఊపుతో కొనుగోళ్లకు సిద్ధమవుతున్నది. యాసంగిలో వ్యవసాయ శాఖ అందించిన దిగుబడి అంచనాలను అనుసరించి అందుకు తగ్గట్లుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 


వానాకాలంలో  రికార్డు స్థాయిలో..

2019-20 వానాకాలం సీజన్‌లో జిల్లా రైతులు  దిగుబడులు ఊహించిన దానికన్నా రెట్టింపు రావడంతో యాదాద్రి ధాన్యాగారమై వర్ధిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 350 కోట్లు చెల్లింపులు జరిగాయి. అంతేకాక, కొనుగోలు కేంద్రాల నుంచి రైతుల ద్వారా ఏకంగా 1,90,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఏడాది కాలంలోనే రైతులు పండించిన పంట దిగుబడులు దాదాపుగా రెట్టింపు అవ్వడంతో జిల్లాలో ధాన్యపుసిరులు వెల్లువెత్తాయి. రైతుల ఇంట సిరుల రాశులతో కళకళలాడాయి. వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం దిగుబడులు భారీగా ఉండడంతో ముందస్తు అప్రమత్తతో సులువుగా కొనుగోళ్లను పూర్తి చేశారు. అదే ఉత్సాహంతో యాసంగిలోనూ ధాన్యం సిరులను రైతుల నుంచి సేకరించి వారికి కనీస మద్దతు ధర కల్పించడమే ఉద్దేశంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. యాసంగి సీజన్‌ వానాకాలం  రికార్డులను బద్దలు కొట్టనున్నది. 3,00,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

150 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..

యాసంగి సీజన్‌ వచ్చిందంటే పంటల సాగుకు భయపడే రైతులు ఈసారి నిండిన చెరువులు.. కుంటలు సాక్షిగా ఎంతో నమ్మకంతో ముందడుగు వేశారు. రైతుబంధుతో పెట్టుబడులకు చేయూత చేకూరడంతో జిల్లాలో ప్రాధాన్యత స్థాయిలోనే పంటలు సాగవుతున్నాయి. రైతుబంధు పథకం ప్రారంభానికి ముందు వరకు రైతుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పెట్టుబడులకు అప్పులు తెచ్చి నిండా మునిగిపోయేది. ఇప్పుడేకంగా రైతుల చెంతకే రైతుబంధు రూపంలో ఎకరాకు రూ.5 వేలు చొప్పన నగదు రావడంతో చీకూచింత పోయింది. ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా తోడవ్వడంతో యాసంగిలో వరి సాగు జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లోని నలుమూలల 150 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధరను కల్పించడం కోసం ప్రభుత్వం సిద్ధమైంది. సీజన్‌లో ఎంతలేదన్నా సుమారుగా మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించే వీలుంది. ఏ చిన్న పోరపాటు లేకుండా కేంద్రాలను రైతుల ముంగిటకు తీసుకు పోవడంతో పాటుగా ప్రైవేటు దోపిడీని నివారించేందుకు సర్కారు  ప్రయత్నిస్తున్నది.

 

1, 36, 750 ఎకరాల్లో సాగు..

జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలు 1, 36,750 ఎకరాలు కాగా ఈ సారి సీజన్‌లో వానాకాలం కన్నా అధికంగా ధాన్యం వస్తుదందని అంచనా చేస్తున్నారు. వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఈ యాసంగి సీజన్‌లో 1, 36,750 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో 1,90,000 మెట్రిక్‌ టన్నుల పంట చేతిలోకి వచ్చింది. ప్రస్తుతం సాగైన విభిన్న పంటల్లో వరి సాగుకే చాలా మంది మొగ్గు చూపారు. సాగు విస్తీర్ణం మేరకు జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 3,00,000 లక్షల టన్నుల మేర ధాన్యం రావొచ్చని అధికారులు చెబుతున్నారు. 

 

మందస్తు కసరత్తు..

అడిషనల్‌ కలెక్టర్‌  రమేశ్‌ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ కోసం ముందస్తు కసరత్తును ప్రారంభించారు.  ప్రారంభం కానున్న నెల ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేసే బాధ్యతలను జిల్లా పౌరసరఫరాల శాఖ తీసుకున్నది.  అడిషనల్‌ కలెక్టర్‌  రమేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి డీఆర్‌డీఏ పీడీ మందడి ఉంపేందర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంధ్యారాణి, ఆర్‌డీవోలు పీ. భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీకాంత్‌,  పౌరాసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ ఎం.గోపికృష్ణలు పాల్గొని చేపట్టాలల్సిన కార్యాచరణపై తగిన వ్యూహం తయారు చేశారు.


75 లక్షల గన్నీ బ్యాగ్‌లు ..

జిల్లాలో 3,00,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్న అధికారులు ధాన్యాన్ని సకాలంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా రవాణా చేసేందుకు 75లక్షల గన్నీ బ్యాగ్‌లు అవసరమవుతాయని లెక్కలు కట్టారు. ఇప్పటికే జిల్లాలో 25 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 75 లక్షల బ్యాగులను కొనుగోలు చేసి జిల్లాకు పంపాలని రాష్ట్ర శాఖ అధికారులకు నివేదికలను పంపారు. అదేవిధంగా 150 కేంద్రాలకు ఆరు వేల టార్ఫాలిన్లు అవసరమవుతాయని అధికారులు లెక్కలు వేశారు. జిల్లాలో ప్రస్తుతం 3,400 టార్ఫాలిన్లు అందుబాటులో ఉన్నాయి. మిగతావాటిని కొనుగోలు చేసేందుకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ రమేశ్‌ల అనుమతులతో జిల్లా పౌరాసరఫరాల శాఖ అధికారి సంధ్యారాణి, మేనేజర్‌ గోపికృష్ణలు రాష్ట్ర స్థాయి అధికారులకు లేఖలు రాశారు. 


యాసంగికి ముందస్తుగానే ఏర్పాట్లు..

యాసంగి సీజన్‌లో ధాన్యం దిగుబడులు 3,00,000 టన్నుల మేర వచ్చే వీలుందని వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారి అంచనాలను అనుసరించి జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 1,36,750 ఎకరాల్లో ప్రతి ప్రాంతం నుంచి వరి పంట సాగవ్వడంతో రైతుల నుంచి కొనుగోలు చేసే విషయంలో ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు 150 కేంద్రాల ఏర్పాటుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాం.

-ఎం.గోపికృష్ణ, జిల్లా పౌరాసరఫరాల సంస్థ, మేనేజర్‌

VIDEOS

logo