ఆదివారం 25 అక్టోబర్ 2020
Yadadri - Feb 22, 2020 , 02:54:17

అనితర సాధ్యం యాదాద్రీశుడి మహిమలు

అనితర సాధ్యం యాదాద్రీశుడి మహిమలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రీశుని మహిమలు అనితర సాధ్యమని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ జి.కిషన్‌రావు అన్నారు. బర్కత్‌పురాలోని యాదగిరి భవనల్‌లో అఖండజ్యోతి పాదయాత్రను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అఖండజ్యోతి పాదయాత్ర వల్ల ఉత్సవ ప్రచారం విశేషంగా జరుగుతుందని చెప్పారు. 25 సంవత్సరాల క్రితం ఉత్సవాల ప్రచారం కోసం ప్రారంభించిన అఖండ జ్యోతి యాత్రకు విశేష ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో అఖండజ్యోతిని సందర్శించే అవకాశం ఉన్నదని తెలిపారు. శ్రీలక్ష్మీనరసింహుని మహిమలతో క్షేత్రాభివృద్ధి విశేషంగా జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రిని విశేషంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారన్నారు. ఆధారశిల నుంచి మహానాశిక వరకు కృష్ణశిలలతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ మాట్లాడుతూ యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండజ్యోతి పాదయాత్రను నిర్వహించడం ఎంతో మేలు చేకూర్చుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ హయాంలోనే ఆలయాలకు మహర్ధశ వచ్చిందని చెప్పారు. ఆలయాలపై గత పాలకులు చూపిన వివక్షవల్ల వెనుకబడిపోయాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నదని చెప్పారు. యాదాద్రి ఆలయం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక కొత్త హంగులతో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఆలయ ఈవో ఎన్‌.గీత మాట్లాడుతూ ఆలయ విశేష ప్రచారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. భక్తులు చూపిన ఆదరణ వల్లే యాత్ర 25 సంవత్సరాలుగా విజయవంతమైందని, 26వ వసంతంలోకి అడుగిడిందని చెప్పారు. కార్యక్రమంలో అఖండజ్యోతి యాత్ర నిర్వాహకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.logo