ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 18, 2020 , 23:32:27

పురపాలికలకు మహర్దశ తేవాలి

పురపాలికలకు మహర్దశ తేవాలి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: “ పట్టణ ప్రగతికి కట్టుబడి ఉండాలి... అభివృద్ధి చేయాల న్న తలంపు ఉండాలి... ప్రారంభించిన పనులు పూర్తి చేసే దమ్ము ధైర్యం ఉండాలి”.. త్యాగ గుణం ఉన్నవారే రాజకీయాల్లో రాణిస్తారంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మున్సిపల్‌  సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చేయాల్సిన విధివిధానాలను వివరించారు. జిల్లా నుంచి ఇటీవల ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, వైస్‌ చైర్మన్లు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. సమ్మేళనానికి ముందుగానే అన్ని మున్సిపాలిటీలకు  ప్రభుత్వం  కొత్త కమిషనర్ల నియామకం చేసింది. పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మున్సిపల్‌ చైర్మన్లు, అధికారులపై ఉందని సీఎం పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి పునాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులుకు అవగాహన కల్పించారు. అధికారులను సమన్వయం చేసుకుని ప్రజాప్రతినిధులు  అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని చెప్పారు. పేదలు ఎక్కువగా ఉండే దలితవాడల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావాలన్నారు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు  ఎదురైనా  లక్ష్యం కోసం శ్రమించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.   


నిధుల వినియోగంపై కచ్చితత్వం అవసరమన్న సీఎం ..

నిధుల వినియోగం విషయంలో కచ్చితత్వంతో కూడిన క్రమశిక్షణ అవసరం...ప్రణాళిక ప్రకారమే వ్యయం జరుగాలన్నదే సీఎం ధ్యేయంగా కన్పిస్తున్నది. వార్డుల వారీగా ప్రణాళికలు  తయారు చేసుకుని ఈనెల 24 నుంచి మార్చి 4వరకు జరిగే పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రతి పట్టణానికి వార్షిక, పంచవార్షిక ప్రణాళిక తయారు కావాలి... కౌన్సిలర్లు, కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు ప్రణాళిలపై ముందస్తుగా చర్చించాలి... ఎక్కడా నిర్లక్ష్యం పనికిరాదు. వార్డుల వారీగా నియామకమైన ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రతి  వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్‌ ఆఫీసర్‌ను నియామకం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ప్రతివార్డును ఎక్స్‌రే తీయాలి...

ప్రతివార్డును ఎక్స్‌రే తీయాలి...తీవ్రమైన సమస్యలు ఏమిటి? తక్షణం పరిష్కారం చేయాల్సినవి ఏమిటి? ఎంత కాలంలో పూర్తి చేయాలి? కచ్చితంగా నిర్ధారించుకోవాలి అంటూ చెప్పుకుపోయారు. మంచి పట్టణంగా ఎదగడం కోసం కృషి ప్రారంభం కావాలి. అప్పుడే సాధ్యమవుతున్నది. ప్రతి రోజూ చెత్తను, మురుగునీటిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన తాగునీరు సరఫరా జరుగాలి..వీధి లైట్లు బాగా వెలగాలి.. రహదారులపై గుంతలు, బొందలు, గోతులు  ఉండకూడదని సీఎం సూచించారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తవేయడానికి బుట్టలు పంపిణీ చేయాలి. ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైన వాహనాలను  సమకూర్చుకోవాలని సీఎం నిర్ణయించారు. 


పురపాలికలకు ఇక ఆర్థిక పరిపుష్టి...

పురపాలికలకు ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు సీఎం ప్రతి నెలా రూ. 148 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించడం వల్ల ఎంతో మేలు కలుగనున్నది.  కమిషనర్లు ప్రతి నెలా సిబ్బందికి వేతనాలు, కరెంట్‌ బిల్లులు చెల్లించాలి అప్పుడే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 


కొత్త మున్సిపల్‌ చట్టంపై అవగాహన పెరగాలి...

కొత్త మున్సిపల్‌ చట్టంపై అవగాహన పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణం, లే అవుట్‌ విషయంలో సులభతరమైన అనుమతులు ఇచ్చే విధానం తెచ్చామని తెలిపారు. ప్రజలపై నమ్మకం ఉంచాం...ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సదస్సు మున్సిపల్‌ చైర్మన్లకు, కమిషనర్లకు పురపాలికలను ఎలా అభివృద్ధి చేయాలి... ఎలా ప్రణాళికలు తయారు చేసుకోవాలి... తదితర అన్ని అంశాలపై ఒక అవగాహన కలిగిందని సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులు నమస్తే తెలంగాణకు వివరించారు.

VIDEOS

logo