సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 17, 2020 , 00:06:54

టీఆర్‌ఎస్‌వే సహకార పీఠాలు

టీఆర్‌ఎస్‌వే సహకార పీఠాలు

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ, సహకార పీఠాలపై అదేస్థాయిలో ముందడుగు వేసింది. ఆలేరు నియోజకవర్గంలోని 8 పీఏసీఎస్‌లో 6 చైర్మన్‌ పదవులు, 5 వైస్‌చైర్మన్‌, 78 డైరెక్టర్లను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్‌ను కాంగ్రెస్‌

  • నియోజకవర్గంలో 8 పీఏసీఎస్‌లో
  • 6 చైర్మన్లు, 5 వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం
  • గుండాలలో చైర్మన్‌ ఎన్నిక వాయిదా..
  • వంగపల్లి చైర్మన్‌గా ఆరోసారి ఎన్నికైన
  • గొంగిడి మహేందర్‌రెడ్డి..
  • వైస్‌ చైర్మన్‌గా ఎగ్గిడి బాలయ్య
  • యాదగిరిగుట్ట చైర్మన్‌గా ఇమ్మడి రాంచంద్రారెడ్డి
  • వైస్‌ చైర్మన్‌గా కాటబత్తిని ఆంజనేయులు
  • సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు కానుక..
  • పీఏసీఎస్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ, సహకార పీఠాలపై అదేస్థాయిలో ముందడుగు వేసింది. ఆలేరు నియోజకవర్గంలోని 8 పీఏసీఎస్‌లో 6 చైర్మన్‌ పదవులు, 5 వైస్‌చైర్మన్‌, 78 డైరెక్టర్లను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్‌ను కాంగ్రెస్‌ తమ ఖాతాలో వేసుకున్నది. చైర్మన్‌ పోటీలో పలువురు డైరెక్టర్‌ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరిగాయి. కాగా కోరం లేకపోవడంతో గుండాల పీఏసీఎస్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించారు. అంనతరం మధ్యాహ్నం 2.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల అభ్యర్థులను ప్రకటించారు. 

గడిచిన ఆరేండ్లలో సీఎం కేసీఆర్‌ రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన రైతులు స్థానిక సహకార ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకున్నారు. 


వంగపల్లిలో..

వంగపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఆరోసారి టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వంగపల్లి పీఏసీఎస్‌లో జరిగిన చైర్మన్‌, వైస్‌  చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన చైర్మన్‌ అభ్యర్థిగా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా 7వార్డు డైరెక్టర్‌ ఎగ్గిడి బాలయ్య ఒకటే నామినేషన్‌ దాఖలు కావడంతో చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఎగ్గిడి బాలయ్యను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఉపేందర్‌నాయక్‌ ప్రకటించారు. 


యాదగిరిగుట్టలో..

యాదగిరిగుట్ట పీఏసీఎస్‌ చైర్మన్‌గా 3వ వార్డు డైరెక్టర్‌ ఇమ్మడి రాంచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికకాగా వైస్‌ చైర్మన్‌గా 1వ వార్డు డైరెక్టర్‌ అభ్యర్థి కాటబత్తిని ఆంజనేయులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సాయిలు ప్రకటించారు. అదేవిధంగా డైరెక్టర్లుగా గెలుపొందిన వారికి కూడా నియామకపత్రాలు అందజేసినట్లు తెలిపారు.


సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు కానుక..

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆలేరు నియోజకవర్గం నుంచి 6 పీఏసీఎస్‌ చైర్మన్లు, 5 వైస్‌ చైర్మన్లు, 78 డైరెక్టర్లను కానుకగా ఇస్తున్నామని పీఏసీఎస్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వంగపల్లి పీఏసీఎస్‌లో చైర్మన్‌గా 6 వసారి ఎన్నికైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని మరోసారి పీఏసీఎస్‌ ఎన్నికల్లో నిరూపితమైందన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్‌, మిషన్‌ కాకతీయ పథకం, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో  పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేత వంటి రైతు సంక్షేమ పథకాలే గెలునపు నాందిపలి కాయన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు చేరువై వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలను చేరవేస్తామన్నారు. ఇంత పెద్ద గెలుపునకు కారణమైన టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


తుర్కపల్లిలో..

తుర్కపల్లి : మండలకేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మండలంలో మొత్తం 13 వార్డులకు 10 టీఆర్‌ఎస్‌, 3 కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం టీఆర్‌ఎస్‌ 7, కాంగ్రెస్‌ 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 3 వార్డులకు నిర్వహించిన ఎన్నికల్లో 3 వార్డులు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడంతో టీఆర్‌ఎస్‌ స్థానాలు 10 వార్డులకు చేరుకున్నది. కాగా చైర్మన్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి సింగిరెడ్డి నరసింహరెడ్డి ఒకే నామినేషన్‌ వేశారు. వైస్‌ చైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన కొండ్రా ముత్యాలు కాంగ్రెస్‌ అభ్యర్థి పాంగళ్ల కిష్టయ్య నామినేషన్లను ఎన్నికల అధికారి జోసెఫ్‌కు అందజేశారు. ఇరుపార్టీల ఒప్పందం మేరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్యాలు నామినేషన్‌ను ఉపసంవరించుకున్నారు. దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు ఒక్కోనామినేషన్‌ దాఖలు కావడంతో ఎన్నికల అధికారి చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి సింగిరెడ్డి నరసింహరెడ్డి, వైస్‌చైర్మన్‌గా కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి పాంగాళ్ల కిషయ్య ఎన్నికైనట్లుగా ప్రకటించి వారికి నియామకపత్రాలు అందజేశారు. అదే విధంగా డైరెక్టర్లకు సహితం నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన నరసింహారెడ్డికి మాజీచైర్మన్‌ చిన్నప్పురెడ్డి నరేందర్‌రెడ్డి పదవీ బాధ్యతలు అప్పగించారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం చైర్మన్‌గా అభ్యర్థి సింగిరెడ్డి నరసింహారెడ్డిని ప్రకటించింది. అయితే గెలుపొందిన సింగిరెడ్డి నరసింహారెడ్డి 1989 నుంచి 1990 వరకు మాదాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా 1992లో రెండో సారి 6 నెలల పాటు చైర్మన్‌ పదవులను రెండు పర్యాయాలు నిర్వహించి వీఆర్వో ఉద్యోగం రావడంతో రెండో సారి 6 నెలలకే చైర్మన్‌ పదవీని వదులుకొని ఉద్యోగంలో చేరారు. పదవీ విరమణ అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మూడోసారి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 


ఆలేరులో..

ఆలేరుటౌన్‌ : ఆలేరు పీఏసీఎస్‌ చైర్మన్‌గా శర్భనపురం గ్రామానికి చెందిన మొగులగాని మల్లేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు గానూ టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున మొగులగాని మల్లేశ్‌ చైర్మన్‌, ఆలేరు పట్టణం 2వ వార్డు అభ్యర్థి చింతకింది చంద్రకళ వైస్‌ చైర్మన్‌ కోసం ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మధ్యాహ్నం 2 గం.ల వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ తప్ప వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు నామినేషన్లు సమర్పించకపోవడంతో ఎన్నికల అధికారి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మొగులగాని మల్లేశ్‌ చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా  చింతకింది చంద్రకళ ఎన్నికయినట్లు ఆయన ప్రకటించారు.


బొమ్మలరామారంలో.. 

బొమ్మలరామారం : సహకార సంఘం చైర్మన్‌గా మండల కేంద్రానికి చెందిన గూదె బాల్‌నర్సయ్య, వైస్‌చైర్మన్‌గా మైలారం గ్రామానికి చెందిన ఏనుగు కొండల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నికైనారు. మొత్తం 13 స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 10 మంది డైరెక్టర్లు, కాంగ్రెస్‌ 2, బీజేపీకి 1 ఎన్నికకాగా టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సభ్యులు ఉండటంతో ఏకగ్రీవంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నాగార్జున ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లకు ధ్రువీకరణ పత్రాలు ఎన్నికల అధికారి అందజేశారు. 


ఆత్మకూర్‌(ఎం)లో బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా ఎన్నిక..

ఆత్మకూరు(ఎం) : సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు 6, కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు 6, బీఎస్పీ అభ్యర్థి ఒక్కరు గెలుపొందారు. దీంతో ఆదివారం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో జరిగిన సహకార సంఘం చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉత్కఠభరితంగా సాగింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు సమానంగా గెలువడంతో బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థికి 7గురు సభ్యులు బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయడంతో చైర్మన్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 1వ వార్డు డైరెక్టర్‌ జిల్లాల శేఖర్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నిక కాగా, 11వ వార్డు నుంచి బీఎస్పీ బలపర్చిన పార్టీ నుంచి డైరెక్టర్‌గా గెలుపొందిన గంధమల్ల జహంగీర్‌ కాంగ్రెస్‌ బలపర్చిన డైరెక్టర్ల సహకారంతో వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి ప్రకటించారు.


చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం..

రాజాపేట : రేణికుంట సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ల ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి 13 మంది డైరెక్టర్లు హాజరు కాగా, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే  దాఖలు చేశారు. దీంతో చైర్మన్‌గా రేణికుంటకు చెందిన చింతలపూరి భాస్కర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రాజాపేటకు చెందిన కాకల్ల ఉపేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి బూర్గు మహేందర్‌రెడ్డి ప్రకటించారు. 


కోరం లేక చైర్మన్‌ ఎన్నిక వాయిదా 

గుండాల : మండల కేంద్రంలోని సహకార సంఘంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఆదివారం ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉండగా మొత్తం 13 డైరెక్టర్లకు ఆరుగురు డైరెక్టర్లు మాత్రమే హాజరు కావడంతో ఎన్నికల అధికారి ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి కోరం పూర్తిగా లేకపోవడంతో చైర్మన్‌ ఎన్నికను సోమవారానికి వాయిదా వేశారు. మొత్తం 13 మంది సభ్యుల్లో ఏడుగురు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలువగా ఆరుగురు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్‌ బలపరిచిన సభ్యులు గైర్హాజరు కావడంతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీలోని ఏడుగురు సభ్యులలో ఒకరు లేకపోవడంతో కోరం పూర్తి కాలేదు. దీంతో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.

VIDEOS

logo