సీపీఎం కంచుకోటకు బీటలు..

- చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ విజయదుందుభి
- చైర్మన్ తో పాటు వైస్‌చైర్మన్ పీఠాలు కైవసం
- 13 స్థానాల్లో 8 స్థానాల్లో గెలుపు
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: చౌటుప్పల్ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ఇప్పటివరకు సీపీఎంకు కంచుకోటగా ఉన్న సింగిల్‌విండోను టీఆర్ఎస్ కైవసం చేసుకొని రికార్డును తిరగరాసింది. ఏకంగా 13 వార్డులకు గాను ఎనిమిదింటిలో విజయకేతం ఎగురవేసింది. బీజేపీ బలపర్చిన అభ్యర్థులు నలుగురు గెలువగా.. సీపీఎం అభ్యర్థి ఒకరు టాస్‌లో గెలుపొందారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు చైర్మన్ గిరిని సొంతం చేసుకోలేదు. దశాబ్దాలుగా సీపీఎం ఈ సింగిల్‌విండోను ఏలింది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందు సీపీఎం గాలికి కొట్టుకుపోయింది. కనీవిని ఎరుగని మెజార్టీని టీఆర్ఎస్ సొంతం చేసుకొని సత్తా చాటింది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ కూటమి కేవలం నాలుగు స్థానాల్లో గెలుపొందింది. టీఆర్ఎస్ బలపర్చిన 7వ వార్డు అభ్యర్థి భారీ మెజార్టీ సాధించాడు. చెన్నగోని అంజయ్యగౌడ్ తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 149 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చెన్నగోని అంజయ్యకు 196 ఓట్లు రాగా.. బీజేపీ బలపర్చిన రాధారపు సత్తయ్యకు కేవలం 47 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రెండో వార్డు టై..
చౌటుప్పల్ సహకార ఎన్నికలో రెండవ వార్డు టై అయ్యింది. సీపీఎం బలపర్చిన బోరెం నర్సిరెడ్డికి, బీజేపీ బలపర్చిన కాయితి నరేందర్‌కు సమానంగా 100 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారి జమదగ్ని టాస్ వేసి బోరెం నర్సిరెడ్డిని విజేతగా ప్రకటించారు. బోరెం నర్సిరెడ్డి, కాయితి నరేందర్ పేర్ల మీద ఐదు చిట్టలు రాసి డ్రా తీశారు. దీంట్లో బోరెం నర్సిరెడ్డి పేరు రావడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. కాగా బీజేపీకి చెందిన ఓ కార్యకర్త నిమిషం ఆలస్యంగా రావడంతో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ ఒక్క ఓటు తమకు వస్తే గెలుపొందేవారని నాయకులు మధనపడుతున్నారు.
స్వల్ప ఉద్రిక్తం..
ఎన్నికల కౌంటింగ్ జరిగే సమయంలో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులపై కవ్వింపు చర్యలకు పాల్పడడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీల నాయకులు తోసుకున్నారు. వెంటనే స్పందించిన సీఐ వెంకటేశ్వర్లు అక్కడి నుంచి వారిని చెదరగొట్టారు.
టీఆర్ఎస్దే విజయం..
బీబీనగర్ సహకార సంఘంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. మొత్తం 13 వార్డుల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని నాలుగు టీఆర్ఎస్, ఐదు కాంగ్రెస్, ముగ్గురు టీఆర్ఎస్ బహిష్కృత నేతలు, ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అంతకు ముందు శనివారం ఉదయం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సింగిల్ విండో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 13 వార్డులకు గాను 2726 మంది ఓటర్లు ఉండగా 2001 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై సుధాకర్‌గౌడ్ పర్యవేక్షించారు. ఏసీపీ భుజంరావు పోలింగ్ బూత్‌ను పరిశీలించి ఓటింగ్ సరళిపై ఆరా తీశారు.
నారాయణపురంలో టీఆర్ఎస్ ప్రభంజనం..
సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం చూపింది. నారాయణపూర్ సహకార సంఘంలోని 13 వార్డులకు గాను టీఆర్ఎస్ దాని మిత్రపక్షం 8, కాంగ్రెస్ 5 వార్డులు గెలుపొందాయి. ఇందులో 6, 7 వార్డులు టీఆర్ఎస్ మిత్రపక్షం ఏకగ్రీవం చేసుకున్నది. గుజ్జ సహకార సంఘంలో 13 వార్డులకు టీఆర్ఎస్ మిత్రపక్షం 9, కాంగ్రెస్ 3, బీజేపీ 1 వార్డును కైవసం చేసుకున్నది. ఇందులో 6,7 వార్డులు టీఆర్ఎస్ మిత్రపక్షం ఏకగ్రీవం చేసుకున్నది. రెండు సహకార సంఘాల్లో టీఆర్ఎస్ విజయం సొంతం చేసుకోవడంతో నాయకులు,కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
భువనగిరి టీఆర్ఎస్, చందుపట్ల కాంగ్రెస్..
భువనగిరి సహకారం టీఆర్ఎస్ పరం కాగా.. చందుపట్ల కాంగ్రెస్ వశమైంది. భువనగిరిలోని 13వార్డులకు గాను టీఆర్ఎస్ 10స్థానాలు.. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు-2స్థానాలు సీపీఎం 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. అదేవిధంగా చందుపట్ల పీఏసీఎస్‌లోని 13 వార్డులకు గాను టీఆర్ఎస్ 4 స్థానాలు.. కాంగ్రెస్ 9 స్థానాలను దక్కించుకుంది.
పోచంపల్లి, జూలూరులో జైత్రయాత్ర..
భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు, పోచంపల్లి సహకార సంఘాల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. పోచంపల్లి సింగిల్‌విండో పరిధిలో మొత్తం 13 స్థానాలకు గాను 9 స్థానాలు ఏకగ్రీవం కావడంతో 4 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ముగ్గురు టీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. 1వ వార్డు నుంచి మద్ది చంద్రారెడ్డి, 3వ వార్డు నుంచి రామసాని చంద్రశేఖర్‌రెడ్డి, 7వ వార్డు నుంచి ఏనుగు జంగారెడ్డి, 8వ వార్డు నుంచి కూసుకుంట్ల అలివేలు మంగలు విజయం సాధించిన వారిలో ఉన్నారు. జూలూరు సింగిల్‌విండో పరిధిలోని 13 వార్డులకు గాను 10 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన మూడు స్థానాలకు ఎన్నికలు జరుగగా రెండు స్థానాల్లో టీఆర్ఎస్.. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. విజయం సాధించిన వారిలో 5వ వార్డు నుంచి గట్టు రాంరెడ్డి, 8వ వార్డు నుంచి మరికుక్క పెంటయ్య, 9వ వార్డు నుంచి ఉడుతల జంగయ్య గెలుపొందారు.
అడ్డగూడూరులో ఎగిరిన గులాబీ జెండా
అడ్డగూడూరు సహకార సంఘంపై టీఆర్ఎస్ జెండా ఎగురింది. మొత్తం 13 వార్డులలో 3వ వార్డు ఏకగ్రీవం కాగా 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 6 టీఆర్ఎస్ గెలుచుకోగా 5 కాంగ్రెస్, 1 స్థానాన్ని టీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ గెలుచుకుంది. దీంతో టీఆర్ఎస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. అంతకుముందు ఉదయం జరిగిన ఎన్నికల్లో 87 శాతం పోలింగ్ నమోదు కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భువనగిరి ట్రాఫిక్ సీఐ రాజు,ఎస్త్సె ఇద్రీస్ ఆలీ బందోబస్తు చేపట్టారు.
నేడు ప్రమాణస్వీకారం..
సహకార ఎన్నికల్లో గెలుపొందిన 13 మంది డైరెక్టర్లతో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేయించినట్టు ఎన్నికల అధికారి మన్నె అంజయ్య తెలిపారు. అంతేకాక చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నట్లు తెలిపారు.
మోత్కూరులో ఘన విజయం..
మోత్కూరు సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 13 స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు, బీజేపీ ఒకస్థానం గెలుచుకున్నాయి. ఇందులో టీఆర్ఎస్ రెండు వార్డులు, ఒకటి కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలుపొందాయి. ఇదిలా ఉంటే 3వ వార్డు నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బయ్యాని చంద్రశేఖర్, టీఆర్ఎస్ అభ్యర్థి బోయిని యాకయ్యపై డ్రాలో గెలుపొందారు. ఇద్దరికి చెరి సమానం (104) ఓట్లు రాగా.. మొదటగా అధికారులు రికౌంటింగ్ నిర్వహించారు. అనంతరం డ్రా తీసి బయ్యాని చంద్రశేఖర్ గెలుపొందినట్టు ప్రకటించారు. మోత్కూరు సహకార సంఘంలో టీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తనయుడు అశోక్‌రెడ్డి చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అహర్శిశలు పని చేసిన రామకృష్ణారెడ్డి తొలిసారిగా ఆయన తనయుడు అశోక్‌రెడ్డిని సహకార సంఘం ఎన్నికల బరిలో నిలిపారు. కాగా సంఘం పరిధిలోని 9వ వార్డులో జనరల్ స్థానం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. వీరికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆశీస్సులు ఉన్నాయి. టీఆర్ఎస్ గెలుపుతో నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
తాజావార్తలు
- హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్‌కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!